ఇక పేర్లు తప్పు పలకడాల్లేవ్!

by Harish |
ఇక పేర్లు తప్పు పలకడాల్లేవ్!
X

‘Saoirse Ronan’.. ఒకసారి ఈ పేరు పలకండి. ఇదొక హాలీవుడ్ హీరోయిన్ పేరు. సయోర్సే రోనన్, సావోర్సే రోనన్.. ఇలా రకరకాలుగా పలికి ఉంటారు. కానీ దాన్ని ‘సెర్షా రోనన్’ అని పలకాలి. ఇలా పేర్లు తప్పు పలికితే ఆ పేరు పెట్టుకున్నవాళ్లకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. వారి జీవితం మొత్తం పరిచయాలు పెంచుకోవాలంటే ముందుగా పేరు సరిగ్గా పలికేలా చేయడం పెద్ద పనిగా పెట్టుకుంటారు. వ్యక్తిగతంగా తెలిసిన వాళ్లయితే పర్లేదు. కానీ వృత్తిపరంగా నెట్‌వర్క్ పెంచుకునే లింక్డిన్ లాంటి సైట్లలో కాంటాక్టు సమాచారం చూసి, కాల్ చేసి పేరు తప్పుగా పలికితే వారు అవమానంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయుల పేర్లను ఉత్తర భారతీయులు తప్పుగా పలుకుతారు. ఎలాగూ ప్రపంచమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది కాబట్టి, అంతర్జాతీయ కంపెనీల నుంచి కాల్స్ వస్తాయి. అప్పుడు వారు కూడా పేరు తప్పుగా పలికే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్యకు లింక్డిన్ వెబ్‌సైట్ ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది.

మీ పేరుకు గనక స్పెల్లింగ్ ఒక రకంగా, పలికే విధానం మరో రకంగా ఉంటే.. మీరు మీ పేరును ఎలా పలకాలో చెబుతూ ఒక పది సెకన్ల ఆడియోను ప్రొఫైల్‌లో పెట్టుకునే అవకాశాన్ని కల్పించనుంది. వచ్చే నెలాఖరులోగా తమ 690 మిలియన్ల వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు లింక్డిన్ ప్రొడక్ట్ మేనేజర్ జోసెఫ్ అకోనీ తెలిపారు. ఈ ఫీచర్ వల్ల ఒకరి పేరును కచ్చితంగా ఎలా పలకాలో తెలుసుకుని అదే పేరుతో వాళ్లని పిలవడం వల్ల ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుందని అకోనీ వివరించారు.

Advertisement

Next Story