Lover's Day : గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడకు బ్రో.. ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు!!

by Javid Pasha |
Lovers Day : గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడకు బ్రో.. ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు!!
X

దిశ, ఫీచర్స్ : ‘‘నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్.. మీకెలాగూ ఉంటుంది కదా ఫ్రెండ్స్.. మీరన్న ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్..’’ ఈ మధ్య సోషల్ మీడియా బాగా వైరల్ అయిన అనే డైలాగ్ ఇది. దాని సంగతి ఎలా ఉన్నా ఈరోజుల్లో గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ లేకపోవడం నమోషీగా ఫీలయ్యేవారు కూడా అక్కడక్కడా ఉన్నారంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఇక అసలే వాలెంటైన్స్ డే సందర్భమిది. అలాంటప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ల పరిస్థితి ఏంటి? అని కూడా కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో.. అలాంటి వారికోసం కూడా ఏదో ఒక మార్గం లేకపోలేదు బ్రో అని సలహాలిస్తున్నారు పలువురు.. అవేంటో చూద్దాం.

లవర్ ఉన్నోళ్లు ఎలాగూ వాలెంటైన్స్ డే‌ను నచ్చిన విధంగా జరుపుకుంటారు. ఆరోజు సినిమాలకో, షికార్లకో, విహార యాత్రలకో ప్లాన్ చేసుకుంటారు. కొందరు ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు. అయితే మరి మా సంగతేంటి? అనే సందేహాలు ‘ఏక్ నిరంజన్‌’లను, ‘పెళ్లి కాని ప్రసాదు’లను వెంటాడుతుంటాయి. అయితే గర్ల్ ఫ్రెండ్ లేని యువకులు లేదా బాయ్ ఫ్రెండ్ లేని యువతులు వాలెంటైన్స్ డే రోజు అలా ఫీలవ్వాల్సిన అవసరం లేదని, ఒంటరి వాళ్లమని, తమకేం సరదాలుంటాయని నిరాశ చెండాల్సిన పని లేదని అంటున్నారు పలువురు నిపుణులు. గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా అందమైన క్షణాలను ఆస్వాదించే సరదా కార్యకలాపాలు చాలానే ఉంటాయని చెబుతున్నారు.

ఇలా ప్లాన్ చేసుకోండి

గర్ల్ ఫ్రెండ్ లేకున్నా ఆనందంగా గడపడానికి అనేక మార్గాలు ఉంటాయి. ‘‘ముఖ్యంగా ఒంటరి వ్యక్తులు ఆ రోజు తమను తాము ప్రేమించుకోండి. ఇష్టమైన పనులు మీకోసం చేసుకోండి. దీనివల్ల మీలో గొప్ప అనుభూతి కలుగుతుంది. మీ భవిష్యత్తుకోసం మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ ఆరోగ్యంపట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ పై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం ప్రేమకు మరో రూపంగా నిలుస్తుంది’’ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా ఉండే వ్యక్తులు ఆత్మ విశ్వాసంతో ఉండి అనేక విజయాలు సాధించగలుగుతారు. తద్వారా సమాజంలో గుర్తింపు, ఆదరణ, ప్రేమ సహజంగానే లభిస్తుంటాయి. పైగా ‘మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమించుకున్నప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతారు’ అంటుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే అస్సలు ఫీలవ్వకండి. వాలెంటైన్స్ డే రోజు సరదాగా, మరింత ఉత్సాహంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.

ఫ్రెండ్స్‌తో కలిసి..

జీవితంలో ఒంటరితనం లేదా పార్టనర్ లేకుండా ఉండటం కూడా అత్యంత సహజమైన దశ, యుక్త వయస్సుకు రాగానే వెంటనే గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో కలిగి ఉండాలనే రూల్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడి చెట్ట పట్టాలేసుకుని తిరుగాలనీ లేదు. ఎవరి చాయిస్‌ను బట్టి వారు ఉంటారు. ఎవరి ఆసక్తిని బట్టి వారు మెలుగుతుంటారు. ఆయా పరిస్థితులు, అవకాశాలు కూడా సరదాలు, సంతోషాలు, పార్టనర్లు వంటి విషయాల్లో ప్రభావం చూపుతుంటాయి. సో.. మీరు మీ విషయంలో అస్సలు దిగులు పడకూడదు అంటున్నారు నిపుణులు. మీరు ఏక్ నిరంజన్‌లు అయినా సరే.. వాలెంటైన్స్ డే రోజు, మీ లాంటివారు ఇంకెంతోమంది ఉంటారని మర్చిపోకండి. మీ స్నేహితుల్లోనే చాలా మంది ఒంటరివారు ఉంటారు. వారితో కలిసి ఆ రోజు సరదాగా గడిపే ప్లాన్ చేసుకోండి. అందరూ కలిసి పార్టీ చేసుకోవచ్చు. నచ్చితే ఏ సముద్ర తీరానికో వెళ్లి క్యాండిల్లైట్ పార్టీ కూడా చేసుకోవచ్చు. అందరూ కలిసి సినిమాలకు, విహారాలకు వెళ్లొచ్చు. అందర్నీ ఉత్తేజ పరిచే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఒంటరి వారందరూ కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. చేయాలే కానీ బోలెడన్ని పనులు, పంచుకోవాలి కానీ అనేక వేదికలు మీకోసం సిద్ధంగా ఉంటాయి.

నచ్చిన ప్రదేశానికి వెళ్లి..

ఫ్రెండ్స్‌తో కలిసి నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిసరాలను ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 14 నాడు నచ్చిన హోటల్‌కు వెళ్లి రుచికరమైన ఆహారంతో డిన్నర్ చేయవచ్చు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవచ్చు. వాలెంటైన్స్ డే గురించి చర్చించవచ్చు. అందరూ కలిసి ఫోటోలు దిగడం, వివిధ ఆటలు ఆడటం చేయవచ్చు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం లేకుంటే ఒంటరిగా ఉండి కూడా మీరు ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీ అందం, ఆహార్యంపై దృష్టి పెట్టండి. లేదా మీకు ఇస్టమైన దుస్తులు కొనడానికి, ఫేషియల్ చేసుకోవడానికి సమయం కేటాయించుకోండి. నచ్చిన హెయిర్‌కట్‌ని చేయించుకోండి. దీనివల్ల మీ మనసులో అందమైన అనుభూతి కలుగుతుంది.

నచ్చిన సినిమాలు చూస్తూ..

మీరు సినిమా చూడాలంటే పార్టనర్ లేరని ఆగిపోకండి. పార్టనర్‌లేని ఇతర స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లండి. లేకుంటే ఇంట్లోనే మీకు నచ్చిన సినిమాలు, సిరీస్‌లు చూడండి. దీంతో మీలో ఆరోజు ఆనందం రెట్టింపవుతుంది. మీలోని అందమైన, ఉత్సాహ భరితమైన భావోద్వేగాలవల్ల ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్‌లు కూడా మీ మెదడులో రిలీజ్ అవుతాయి. మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతాయి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు చూడటానికి ఇష్టం లేకపోతే, మరో మార్గం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో, తోబుట్టువుతో కలిసి డిన్నర్ చేయడం, సినిమాలు చూడటం చేయవచ్చు. మీకు డ్యాన్స్ ఇష్టమైతే అది కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. కొత్త కొత్త బీట్స్‌ గురించి తెలుసుకోవచ్చు.

సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు

వాలెంటైన్స్ డే రోజు ఇబ్బందిగా ఫీలవ్వకుండా ఉండేందుకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా ఎంచుకోవచ్చు. ఆ రోజు అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్లి అక్కడ గడపవచ్చు. వివిధ పనుల్లో సాయం చేయవచ్చు. ఆయా వ్యక్తులతో సంభాషించడం మీకు ఇష్టమైతే అలా కూడా చేయవచ్చు. వారి గురించి తెలుసుకున్నాక మీలో ఏవైనా ఐడియాలు వస్తే పంచుకోవచ్చు.

ఆహ్లాదకరంగా, ఆనందంగా..

జంటలేని ఒంటరి జీవితం ఎందుకు అనుకోకండి బ్రో.. మీకు వాలెంటైన్స్ డే రోజు ఏం చేయాలనే సందేహమే అవసరం లేదు. ఆరోజు మీ ఆలోచనలు ఆందోళనకరమైన విషయాలవవైపు వెళ్లకుండా ఉండేందుకు వివిధ పనులు, కార్యకలాపాలు మస్తు ఉంటాయి. మీరుండే రూమ్, హాస్టల్ గది లేదా మీరు ఇంటిని సర్దుకోవచ్చు. అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా తీర్చిదిద్దుకోవచ్చు. మీరే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి అలంకరణ వస్తువులను, పువ్వులను తీసుకొచ్చి అలంకరించుకోవచ్చు. మీరు కూడా అందంగా ముస్తాబై అద్దంలో చూసుకుని మురిసిపోవచ్చు. కుటుంబ సభ్యలు మెచ్చే పనులు చేయవచ్చు. ఇష్టమైన వంటకాలు వండుకొని తినవచ్చు. లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన పుస్తకాలు చదవొచ్చు. పెండింగ్‌లో ఉన్న మీకు ఇష్టమైన పనులు పూర్తి చేయవచ్చు. పెరట్లో కొత్తగా మొక్కలను నాటవచ్చు. మనసులో ఎవరైనా ఉంటే ప్రపోజ్ చేయవచ్చు. చేయాలేగానీ అనేక రకాల పనులు, కార్యకలాపాలు ఉంటాయి. అవి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. డోంట్ వర్రీ బ్రో!

Next Story

Most Viewed