భారత్-చైనా సరిహద్దులో పార్వతీ దేవి అవతారం..

by Nagaya |
భారత్-చైనా సరిహద్దులో పార్వతీ దేవి అవతారం..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పెళ్లి చేసుకోకుండా శివ సేవకే అంకితమైన మహిళా భక్తులను చూసే ఉంటారు. వీళ్లు ఆ పరమ శివుడినే భర్తగా భావిస్తూ నిత్య పూజలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కాగా ఇలాంటి భక్తురాలైన లక్నోకు చెందిన మహిళ ఇండో-చైనా బార్డర్‌కు సమీపంలోని నిషిద్ధ ప్రాంతమైన నభీధాంగ్‌‌ను విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తోంది. ఆమెను హర్మీందర్ కౌర్‌గా గుర్తించగా.. తాను పార్వతీ దేవి అవతారమని, కైలాస పర్వతంలో కొలువైన శివుడిని పెళ్లి చేసుకుంటానని చెప్తూ వార్తల్లో నిలిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగంజ్‌కు చెందిన హర్మీందర్ కౌర్ SDM ధార్చుల జారీ చేసిన 15 రోజుల అనుమతిపై తన తల్లితో కలిసి గుంజి(కైలాస్-మానసరోవర్ మార్గంలో)కి వెళ్లింది. అయితే ఆమె గడువు మే 25న ముగిసినప్పటికీ నిషేధిత ప్రాంతమైన నభీధాంగ్ నుంచి వెళ్లకుండా అక్కడే ఉందని పితోర్‌గఢ్ ఎస్పీ తెలిపారు. తనను తీసుకొచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు బృందాన్ని ధార్చుల నుంచి పంపించామన్నారు. కానీ బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో వారు తిరిగొచ్చారని తెలిపారు. అయితే ఆమెను ఎలాగైనా ధార్చుల వద్దకు తీసుకొచ్చేందుకు వైద్య సిబ్బందితో సహా 12 మంది సభ్యులతో కూడిన పోలీసు బృందాన్ని పంపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే తాను పార్వతీ దేవి అవతారమని, శివుడిని పెళ్లాడేందుకే ఇక్కడకు వచ్చానని చెప్తున్నందున.. ఆ మహిళ మానసిక ఆరోగ్యం సరిగా లేదని నివేదిక పేర్కొంది.



Advertisement

Next Story