Unstoppable Rapes.. అయినా.. మనిషి మారలేదు.!

by Daayi Srishailam |   ( Updated:2025-01-19 11:19:14.0  )
Unstoppable Rapes.. అయినా.. మనిషి మారలేదు.!
X

మనిషి..

వేషం మార్చెను.

భాషను మార్చెను.

వేదికలెక్కెను.

వాదము చేసెను.

త్యాగము మేలని బోధలు చేసెను.

హిమాలయముపై జెండా పాతెను.

చంద్రమండలంపై పాదము మోపెను.

కానీ, అతడు మారలేదు.

అతడి తీరు మారలేదు.!

షేమ్.. షేమ్..!!

రోజూ ప్రధాన వార్తలు ఏమొస్తున్నాయో అబ్జర్వ్ చేస్తున్నారా.? అమ్మాయిపై అఘాయిత్యం, విద్యార్థినిపై అత్యాచారం, మహిళపై లైంగిక దాడి. ఇవే కదా.? దేశ వ్యాప్తంగా రోజూ ఇవే చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్ని ఇన్సిడెంట్‌లు జరుగుతున్నా.. సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడినా.. శిక్షలు పడుతున్నా.. సిగ్గుచేటని తెలిసినా మనిషి మారడం లేదు. థూ.. ఏం మనుషులురా బాబూ.?

సిగ్గుపడు.!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడొక కామాంధుడు. ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ పైఅంతస్తులో బాలికల హాస్టల్ ఉంటుంది. ఎవరిదో బర్త్ డే ఉంటే పొద్దంతా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారట. పీకలదాకా తాగి ఉంటారు. ఇంకేముందీ.. కండ్లు కామంతో మూసుకుపోయి ఉంటాయి. పైన హాస్టల్ గదుల్లో ఉన్న అమ్మాయిలను వెతుక్కుంటూ అజిత్ అనే కామాంధుడు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై దాడిచేసి అత్యాచారం జరిపాడు. ఇదేనా సంస్కారం.? అమ్మాయిల హాస్టల్ విడిగా కాకుండా, రియల్ ఎస్టేట్ ఆఫీస్‌తో అటాచ్‌మెంట్ అయి ఉండటమే పెద్ద తప్పు అంటే, పైగా బర్త్ డే వేడుకలు చేసుకోవడమొకటి. ప్రతీ ఇంట్లో అమ్మాయిలుంటారు.. అందరికీ ఆడవాళ్లుంటారు. సమాజం ఇలా తయారైతే వారికి రక్షణెక్కడిది.? సిగ్గుపడండ్రా బాబూ.!

ఇక నమ్మకమెలా.?

ఇబ్రహీంపట్నం ఏరియాలో దాదాపు 50-60 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. టాప్-10 జాబితాలో ఉన్నవి చాలానే ఉన్నాయి కాబట్టీ పోటీపడి వస్తుంటారు విద్యార్థులు. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ హాస్టల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మంగల్‌పల్లి చౌరస్తాలో ఇంచుమించు 60 హాస్టల్స్ ఉంటాయి. మంచి గ్రేడ్ సాధించి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి హాస్టల్స్‌లో ఉంటున్నారు. పిల్లల్ని ఫ్యామిలీకి దూరంగా ఉంచాలని మాత్రం ఏ తల్లిదండ్రికి ఉంటుంది.? దూరమైనా.. భారమైనా మంచిగా చదువుకొని ప్రయోజకులైతే చాలు అనే ఆలోచనతో కూలినాలి చేసైనా సరే లక్షల రూపాయలు ధారపోసి పంపిస్తుంటారు. ఇక్కడేమో మృగాళ్లు కొందరు ఇలా హాస్టల్స్‌లోకి చొరబడి వాళ్ల జీవితాలను పాడుచేస్తారు. సమాజం ఇలా ఉంటే పైచదువుల కోసం పిల్లల్ని బయటకు పంపేదెలా.? వాళ్లు సురక్షితంగానే ఉంటారనే నమ్మకం కలగడమెలా.?

గుడ్డిగా నమ్మితే..

ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటన. రిమ్స్‌ మెడికల్ కాలేజీలో చదివే 17 సంవత్సరాల అమ్మాయికి రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ అనే యువకుడితో ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. పెండ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించాడు ఆ యువకుడు. పెండ్లికంటే ముందు శారీరకంగా కలుసుకోవాలని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని సికింద్రాబాద్‌కు రప్పించాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ అమ్మాయి సికింద్రాబాద్ వచ్చింది. ఇదే అదునుగా శివ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా ఇంటికి పంపించేశాడు. మోసపోయాను అని తెలుసుకున్న అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విషయమంతా ఇంట్లో చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో యాక్ట్ కింద అతడిపై కేసు ఫైల్ చేశారు. ఇదిగో ఇలా ఉంది సమాజం. కంటపడితే కాటేద్దామన్నంత కామం నిండా కమ్మేసుకుంది.

ఎలాగమ్మా ఇలా అయితే..

ఆ శివ ఎవడో తోక చుట్టం కాదు.. తొండెం చుట్టం కాదు. ఆ టైమ్‌పాస్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఆయింతదానికే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారా తల్లీ.? తల్లిదండ్రులకు మీమీద ఎన్నో అంచనాలుంటాయి. మీరేమో ఇన్‌స్టా‌గ్రామ్‌‌లు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్కులూ అని కాలక్షేపం చేస్తూ.. ఆఖరికి ఎవడో ముక్కూ మొఖం తెలియని వాళ్లను ఇష్టపడీ, తర్వాత మోసపోయి గోసపడతారు. అంతా జరిగాక తెలుసుకొని అయ్యో అని మొత్తుకుంటారు. అవన్నీ పక్కకు పడేసి బుద్ధిగా చదువుకుంటే తల్లిదండ్రి ఎంత సంతోషిస్తారు.? ఒకడు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవడం ఇంకెన్ని రోజులు.? ఎవడు ఎలాంటివాడో తెలుసుకోలేరా.? వాడి మోసాన్ని పసిగట్టి వాడి భరతం పట్టలేరా.? సున్నితంగా ఉండకండీ. ఎవడన్నా కామంతో చూస్తే రారా నా కొడకా అన్నట్లు తిప్పి కొడితే తోక ముడుచుకొని వెళ్లి.. మళ్లీ అమ్మాయిల జోలికి పోవాలంటే తడిసిపోవాలి. సో.. మనం ఒకరికి చాన్స్ ఇవ్వొద్దు.. మోసపోవద్దు.!

మారండ్రా బాబూ.!

ఫన్ బకెట్ భార్గవ్ తెలుసుకదా.? ఏమైంది అతడి పరిస్థితి. మంచిగా వీడియోలు తీసుకుంటూ కెరీర్ డెవలప్ చేసుకొని హాయిగా ఉండాల్సినోడు. కటకటాల పాలయ్యాడు. వీడియోల చిత్రీకరణ పేరిట బాలికను ప్రలోభపెట్టి గర్భవతిని చేశాడు. నేరం కూడా రుజువైంది. తాజాగా విశాఖపట్నం ఫోక్సో న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల పరిహారం విధించింది. ఏం జీవితమది.? 20 ఏళ్ల జైలు శిక్ష. సంపాదించుకున్న పేరు పోయింది. డబ్బులు బొక్కా. కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో మొఖం చూపించలేని పరిస్థితి. అతడి జీవితమెంత భయానకంగా మారిందో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. అలా ఉంటాయి శిక్షలు అని తెలిసి కూడా అమ్మాయిలను ఎలా టచ్ చేస్తున్నార్రా బాబూ.? మీ కళ్ల ముందే ఫన్ బకెట్ భార్గవ్ చేజేతులా జీవితాన్ని ఆగం చేసుకున్నాడు. అది చూసైనా కామం కళ్లు తెరవండి.

ఇలా కావాలా ఏంటి.?

మహిళలపై అత్యాచార ఘటనలను అడ్డుకునేందుకు తమిళనాడు సర్కారు కఠిన చర్యలు తీసుకొచ్చింది. మహిళల వెంటపడినా, వేధించినా నేరమే. దీనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక వేధింపులకు పాల్పడితే జీవిత కారాగార శిక్ష విధిస్తారు. యాసిడ్ దాడి చేస్తే పదేళ్ల జైలు శిక్ష.

చీదరించుకుంటున్నా..

శిక్షలు పడుతున్నా, చీదరించుకుంటున్నా మనిషి నైజం మారడం లేదు. దీంతో సత్వర పరిష్కారం ఆశిస్తున్నారు కొందరు. తప్పుచేసిన వాడికి బుద్ధి వచ్చేలా, ఇంకొకడు ఆ తప్పు చేయకుండా బహిరంగంగా శిక్షలు విధించాలంటున్నారు. కొందరైతే ఉరి తీయాల్సిందే అని అంటున్నారు.

Next Story

Most Viewed