- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sciatica : ఆ లక్షణాలు ఎంతకీ తగ్గట్లేదా..? సయాటికా కావచ్చు!

దిశ, ఫీచర్స్ : గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక బలహీనత, కాల్షియం లోపం వంటివి ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మెడ, నడుము, వెన్ను నొప్పికి కారణం అవుతున్నాయి. చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా వెన్నునొప్పి క్రమంగా ప్రమాదకరమైన ‘సయాటికా’గా మారుతుంది. ప్రజెంట్ ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మందిని ఇది వేధిస్తోంది. సయాటికా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.
సయాటికా అంటే..
తుంటి (తొడ వెనుక భాగం)లోని నరాల నుంచి కాళ్ల వరకు వ్యాపించే ఒక రకమైన పెయిన్‌ను సయాటికాగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కొందరికి కాళ్లల్లో గుంజుతున్నట్లు అనిపిస్తుంది. నరాలపై ఒత్తిడి వల్ల కాళ్లు, నడుము భాగంలో నొప్పి, తిమ్మిరి, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో దాదాపు 40 శాతం మంది ఈ సమస్యను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీపు కింది భాగాన ఉండే డిస్కుల్లోని ఏదైనా హెర్నియేటెడ్ డిస్క్ జారిపోయినా, స్పైనల్ స్టెనోసిస్ ఏర్పడినా నరాల మీద అధిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు బాధితుల్లో నొప్పి తీవ్రత పెరిగి నడవలేని పరిస్థితి తలెత్తవచ్చు.
లక్షణాలు, చికిత్స
శారీరకంగా ఎక్కువగా కష్టపడేవారికి లేదా ఏజ్‌బార్ కారణంగా వెన్నెముకలో మార్పులవల్ల కూడా సయాటికా సంభవిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నది. ఊబకాయం కలిగి ఉన్నవారిలో, గర్భిణుల్లో, తరచూ ఒకే దగ్గర కూర్చునే వారిలో, అధిక బరువులు ఎత్తేవారిలోనూ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. వెన్ను, కండరాలు, నరాలపై ఒత్తిడి పెరగడంవల్ల ఇది వస్తుంది. సయాటికా నొప్పి వెన్నుపూసలో మొదలై తొడ వెనుక భాగంలో కాళ్ల నుంచి మొదలుకొని అరికాళ్ల వరకు వ్యాపిస్తుంది. నొప్పి అధికమైనప్పుడు కూర్చోవడం కష్టమవుతుంది. చివరికి తుమ్మినా, దగ్గినా నొప్పిగా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి హీట్ లేదా కోల్డ్ థెరపీలు, మెడిసిన్, వివిధ వ్యాయామాలు వంటి చికిత్సా విధానాలతో వైద్యులు సయాటికాకు చికిత్సను అందిస్తారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.