- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Girl Child.. ఇంటింటి లచ్చిందేవి.!

ఆడబిడ్డ పుడితే..
అమ్మ పుట్టింది అనుకుంటాం.
కాళ్లకు పట్టీలేసుకొని బుడిబుడి నడకలతో
ఇల్లంతా తిరుగుతుంటే..
నా తల్లే.. నా బంగారమే అని సంబరపడతాం.
నా బిడ్డ లచ్చిందేవిరా అని దోస్తులతో చెప్పుకుంటాం.
నాన్నగా.. అన్నగా.. భుజాల మీదెత్తుకొని భూమ్యాకాశాలను చూపిస్తాం.
ఆడబిడ్డను ఇంట్లో ఇంత బాగా చూసుకున్నప్పుడు..
మరి బయట కూడా చూసుకోవాలి కదండీ.?
ఎవరి బిడ్డయినా ఆడబిడ్డే కదా.?
జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రేపటి మహిళల గురించి ప్రత్యేక కథనం.!
- దాయి శ్రీశైలం
ఇండియాలో జాతీయ బాలికా దినోత్సవాన్ని మొదటిసారిగా 2008, జనవరి 24న నిర్వహించారు. అప్పట్నుంచి ప్రతీ జనవరి 24కి సెలబ్రేట్ చేస్తున్నారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కల్పించడం, సాధికారతకు కృషి, ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయడమే కార్యక్రమ ఉద్దేశం. వీటినింత అట్టహాసంగా చేస్తున్నా ఆడపిల్లలపై వివక్ష రోజురోజుకూ పెరుగుతోంది ఎందుకూ.?
అమ్మ మళ్లీ పుట్టింది
సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్. భాస్కర్ బయట టెన్షన్‌గా తిరుగుతున్నాడు. కాన్పుల గది నుంచి ఎప్పుడు పిలుపొస్తుందా అనే ఎదురుచూపు. ఇంతలోనే.. "భాస్కర్ గారూ మీకు ఆడబిడ్డ పుట్టిందీ" అని నర్స్ కేకేసింది. గబగబా లోపలికి ఉరికి బిడ్డను చూసుకున్నాడు భాస్కర్. "ఆడపిల్లనేలే" అని వాళ్లత్త మూతి ముడిచింది. భార్య మొఖంలోనూ విచారమే. భాస్కర్ మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. ఇంటికి ఫోన్ చేసి "నాయినా.. లచ్చిందేవి పుట్టిందే" అని సంబరపడ్డాడు. వాళ్లక్కకు ఫోన్ చేసి "అక్కా అమ్మ మల్లొచ్చిందే" అని సంతోషపడ్డాడు. ఇంతల్నే భార్యకు చలి వణుకుడు పట్టిందని ఫోనొచ్చింది. "ఈ పాపపు లోకంలో తన బిడ్డను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా" అనే బాధ కావచ్చు ఆ తల్లిది. ఒకరకంగా అదొక అభద్రతా ఫీలింగ్.
అభద్రత ఎందుకంటారా.?
లోకం అలా తయారయ్యింది బాస్. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఒక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంక్రాంతి పండగకు సొంతింటికి వచ్చిన యువకుడు సొంత అన్న కూతురిపై కన్నేశాడు. పట్నం తీసుకెళ్తా అని ఏవో మాయమాటలు చెప్పి ఇంట్లో వాళ్లను ఒప్పించి మైనర్ అమ్మాయిని తీసుకెళ్లాడు. "బాబాయే కదా భద్రంగా చూసుకుంటాడు" అనుకున్నారు. కానీ, వాడి పాపపు బుద్ధితో అమ్మాయిని పాడుచేశాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. "నువ్వు నాశనమైపోరా" అని దుమ్మెత్తి పోశారు. ఇదండీ సాటి మహిళల భయం, అభద్రత. అర్థమయ్యింది కదా.? సొంతం అన్న కూతురంటే వాడికి కూడా కూతురే కదా.? అలాంటివాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.
వద్దనుకున్న కూతురే..
బయట పరిస్థితులు అలా ఉన్నాయి. దాన్ని అడ్డంపెట్టి ఆడబిడ్డలపై వివక్ష చూపిద్దామా.? చిన్నప్పటి నుంచే పిల్లలకుధైర్యం నూరిపోసి పెంచాలి. "మీ బిడ్డే మీ ఇంటిపేరు నిలబెట్టే ధీశాలి" అవుతుంది. సంజితా మహాపాత్ర గురించి తెలుసా.? మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు కలెక్టర్ ఆమె. కానీ తను పుట్టినప్పుడు వాళ్లమ్మ ఏడ్చింది. "మళ్లీ ఆడబిడ్డనే పుట్టిందని" తల్లడిల్లిపోయింది. "ఇద్దరు ఆడపిల్లలే అయితే బతికేదెలా.? ఇంటిపేరు నిలబెట్టేదెలా.?" అని ఆలోచించారు. ఒకానొకదశలో సంజితను వద్దనుకున్నారు. కానీ, కన్నతల్లి ప్రాణం ఒప్పుకుంటుందా.? ఎలాగోలా కష్టపడి, ధైర్యం నూరిపోసి పెంచారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన సంజిత ధైర్యశాలిగా నిలబడి కలెక్టర్ అయ్యింది. సంజితలా పెంచుదాం మన బిడ్డల్ని.
అమ్మ లేకున్నా..
ఫూలా సోరెన్ తెలుసు కదా.? ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన బ్లైండ్ క్రికెటర్. భారత అంధుల క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్. ఫూలా పుట్టగానే తల్లి చనిపోయింది. ఆడమనిషి లాలన లేని జీవితం ఎలా ఉంటుంటి.? బతకడమే కష్టం అని భావించిన స్థితి నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుందంటే ఆమె ఎన్ని కష్టాలను దాటుకొని వచ్చుండొచ్చు. అన్నింటికంటే మించి కంటిచూపు లేదు. తల్లి లేకపోయినా తండ్రి ఫూలా బాధ్యత చూసుకున్నాడు. "ఎహే.. గా కండ్లు కనవడని పిల్ల కోసం ఎందుకు నీ ఆరాటం" అని ఎవరెన్ని రకాలుగా నిరుత్సాహ పరిచినా పట్టించుకోలేదు. తన బిడ్డలో అమ్మను చూసుకున్నాడు. ఫూలా సోరెన్ విజయానికి పునాది వేశాడు. ఇగో.. ఇలా బాధ్యతగా పెంచితే ఏ బిడ్డయినా సక్సెస్ అవుతుంది.
త్వరగా పెళ్లి చేస్తే..
రోష్ని పర్వీన్‌ది బీహార్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అమ్మాయిల జీవితాలను బాగుచేస్తోంది. రోష్నికి 14 ఏండ్ల వయసులోనే పెండ్లి జరిగింది. అప్పుడు తన భర్త వయసు 45 సంవత్సరాలు. అంటే రోష్ని వయసు కంటే మూడురెట్లు ఎక్కువ. ఆడపిల్లకు త్వరగా పెండ్లి చేయాలనే ఒక మూఢ నమ్మకంతో బలవంతపు పెండ్లి చేశారు. రోష్ని ఎంతో బాధపడింది. కొన్నిసార్లు పారిపోయి పుట్టింటికి వచ్చేది. వదిలేద్దామనుకుంది కానీ అప్పటికే గర్భవతి అయింది. తర్వాత భర్త వదిలేశాడు. ఆమె జీవితం అంధకారమైంది. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చిరు ఉద్యోగం చేసేది. కొంతకాలానికి బాల్య వివాహాలపై ఉద్యమం షురూ చేసింది. అలా 60కి పైగా బాల్య వివాహాలను అడ్డుకుంది. "ఆడపిల్లకు త్వరగా పెండ్లి చేసి చేతులు దులుపుకోవాలి" అనుకునేవాళ్లు ఒకసారి ఆలోచించండి.
కట్నం బూచి ఎన్నాళ్లు.?
సూరజ్ బాయి మీనాది రాజస్థాన్. వాళ్ల కుటుంబ ఆచారం ప్రకారం ఆడపిల్లలను చదివించొద్దట. ఒకవేళ చదివించినా పెండ్లప్పుడు భారీగా కట్నం ఇవ్వాల్సి వస్తుందట. ఈ కారణంతో సూరజ్ బాయిని చదివించొద్దనుకున్నారు పేరెంట్స్. వంట చేయడం, పొద్దంతా కట్టెలు, పిడెకలు సేకరించడం, బట్టలు ఉతకడం ఇదే పని వాళ్లకు. దీన్నొక నరకంగా భావించిందామె. కానీ తన తమ్ముడు హేమరాజ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పేరెంట్స్ లేనప్పుడు ఇద్దరూ కలిసి సమీపంలోని ప్రకృతి పార్క్‌కు వెళ్లేవారు. అక్కడే ఎన్నో విషయాలు తెలుసుకుంది ఆమె. ఏం చెప్పాడో ఏమో. "అక్క చదువుకు ఎవరూ అడ్డు చెప్పొద్దనే" సరికి.. ఇంకో మాటకూడ మాట్లాడలేదు పేరెంట్స్. కట్ చేస్తే.. సూరజ్ బాయి రణథంబోల్ నేషనల్ పార్కులో తొలి ప్రకృతి శాస్త్రవేత్త.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అమ్మో, నాన్నో, అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడో.. ఎవరో ఒకరు ప్రతి ఇంట్లో ఆడబిడ్డలను అర్థం చేసుకొని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. బంగారం అనుకున్నవారికి లచ్చిందేవిగా కనిపిస్తూనే ఉంది ఆడబిడ్డ. అమ్మాయిని చదివిస్తే వాళ్లు భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దుతారు. సో.. భవిష్యత్ అంతా అమ్మాయిలదే బాస్. బేటీ పడావో.. బేటీ బచావో.!!