పురుషుల్లో మెనోపాజ్.. నిజమేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-10 05:56:30.0  )
పురుషుల్లో మెనోపాజ్.. నిజమేనా?
X

దిశ, ఫీచర్స్: మహిళల్లో రీప్రొడక్టివ్ సైకిల్(పునరుత్పత్తి చక్రం) ఆగిపోవడాన్ని సూచించేది 'మెనోపాజ్'. ఈ దశకు చేరుకునే స్త్రీల సగటు వయసు 50. ఇదిలా ఉంటే.. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లోనూ అనేక లక్షణాలు, మార్పులు సంభవిస్తాయి. దీన్నే కొందరు నిపుణులు మెనోపాజ్‌తో పోల్చుతూ ఈ స్థితిని 'ఆండ్రోపాజ్'గా పరిగణిస్తున్నారు. అయితే పురుషుల మెనోపాజ్ లేదా ఆండ్రోపాజ్ అంశం గురించి 1930 - 1950 మధ్యకాలం వరకు విస్తృతంగా చర్చించినట్లు సోషల్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది. కానీ స్పష్టమైన ఆధారాలు లేకుండా రోగనిర్ధారణ చేయడం సరికాదని ఆధునిక పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక వృద్ధాప్య ప్రభావం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతుండటం వాస్తవమే. కాబట్టి పురుషుల హార్మోన్లపై వృద్ధాప్యం ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది? తగ్గించేందుకు తీసుకోగల చర్యలేంటి? తెలుసుకుందాం.

పురుషుల్లో పెరిగే వయసు సెక్స్ సంబంధిత హార్మోన్ల స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫిమేల్ మెనోపాజ్ ప్రక్రియతో పోల్చినపుడు పురుషుల్లో ఇది కచ్చితమైంది కాదు. ఈ మేరకు కొంతమంది పరిశోధకులు 'ఆండ్రోజెన్ డిక్లైన్ ఇన్ ది ఏజింగ్ మేల్(ADAM)' లేదా ఆలస్యంగా ప్రారంభమయ్యే 'హైపోగోనాడిజం' సంబంధిత లక్షణాలను కనుగొన్నారు. సెక్స్ కణాలను ఉత్పత్తి చేసే గోనాడ్స్(టెస్టికల్స్) లేదా అవయవాల వయసు పెరగడం, పనితీరు మందగించడం మొదలైనపుడు ఇది సహజంగా సంభవిస్తుంది. నిజానికి మెనోపాజ్ అనేది స్త్రీ లైంగిక అభివృద్ధిలో సహజమైన భాగం కాగా.. పురుషుల్లో ఈ పరిస్థితి కేవలం 2.1 శాతం మందినే ప్రభావితం చేస్తుంది. దీని ప్రాబల్యం వయసుతోపాటు పెరుగుతుంది కానీ ఇప్పటికీ పురుషుల అభివృద్ధిలో ఇది ప్రామాణిక దశ కాదు.

లక్షణాలు :

మహిళల్లో మెనోపాజ్ దశ.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ తగ్గుదలను సూచిస్తుంది. దీంతో స్త్రీల ప్రధాన పునరుత్పత్తి హార్మోన్లు అతి తక్కువ వ్యవధిలోనే గణనీయంగా తగ్గుతాయి. ఇక మేల్ మెనోపాజ్ గా భావిస్తున్న పరిస్థితుల విషయానికొస్తే.. లక్షణాలు మెనోపాజ్ లో కంటే చాలా నెమ్మదిగా, సూక్ష్మంగా, తక్కువ తీవ్రతతో కనిపిస్తాయి. అయితే మేల్ హార్మోన్ లేదా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుదల.. మెనోపాజ్ దశలో స్త్రీల హార్మోన్ స్థాయిల్లో కనిపించే తగ్గుదల కన్నా తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది.

* వేడి సెగలు : వేడి ఆవిరులు

* మూడీనెస్, చిరాకు

* ఉదరం, ఛాతి చుట్టూ పేరుకునే కొవ్వు

* కండర ద్రవ్యరాశి కోల్పోవడం

* పొడి, పలుచని చర్మం

* అధిక చెమట

ఇదిలా ఉంటే.. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM) అధ్యయనం.. 'లైంగిక కోరికలతో పాటు ఉదయం అంగస్తంభనల ఫ్రీక్వెన్సీ తగ్గడం, అంగస్తంభన లోపాలను పురుషుల మెనోపాజ్‌లో అత్యంత సాధారణ లక్షణాలుగా గుర్తించింది. శక్తి కోల్పోవడం, కిలోమీటరు లేదా 0.62 మైళ్ల కంటే ఎక్కువగా నడవలేకపోవడం, పరుగెత్తడం లేదా భారీ వస్తువులను ఎత్తడం వంటి కఠినమైన శారీరక పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు తదితర లక్షణాలను కూడా చేర్చింది. ఈ క్రమంలోనే మోకాళ్లపై కూర్చోవడం, వంగడం కూడా చాలా కష్టంగా మారవచ్చు. మేల్ హార్మోన్ స్థాయిల్లో మార్పు ఫలితంగా డిప్రెషన్, అలసట కూడా ఏర్పడవచ్చు.

కారణాలు :

మనిషికి 30 ఏళ్లు వచ్చిన తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయి ప్రతి ఏటా సగటున ఒక శాతం తగ్గుతుంది. అయినప్పటికీ టెస్టోస్టెరాన్ స్థాయిల్లో సాధారణ, వయస్సు-సంబంధిత క్షీణత.. పురుషుల మెనోపాజ్ లక్షణాలకు కేంద్రంగా ఉందని వైద్యులు నమ్మరు. ఇది లక్షణాలకు సంబంధించింది అయితే ప్రతి మనిషి వాటిని అనుభవిస్తాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదనేది వారి భావన.

వ్యాయామం లేక వృద్ధుల్లో తగ్గుతున్న టెస్టోస్టెరాన్ :

ఈ పరిస్థితి చాలా సంక్లిష్టమైనది. వివిధ వ్యక్తుల్లో వివిధ లక్షణాలను కలిగిస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతున్న వృద్ధుల్లో ఈ లక్షణాలు తరచుగా సంభవిస్తుండగా, అవి గుండె జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహానికి దారితీయొచ్చు. కాగా మేల్ హార్మోన్ల స్థాయిని మార్చడం ఈ పరిస్థితికి ఏకైక కారణం కాదని ఇది సూచిస్తుంది. వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యం వినియోగం, ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి అంతర్లీనంగా ఆరోగ్య సమస్యలను కలిగించే ఇతర ప్రమాద కారకాలు కాగా.. రక్తనాళాల్లో మార్పులు లేదా నరాల సమస్య ఫలితంగా అంగస్తంభన సమస్య తలెత్తవచ్చని తెలుస్తోంది. కొంతమంది పురుషుల్లో 'మిడ్-లైఫ్ సంక్షోభం' కారణంగా మానసిక ప్రభావాన్ని అనుభవిస్తారు. ఇది ADAM భౌతిక లక్షణాలకు దారితీసే కారకాలను ప్రేరేపించగలదు. ఇక వృషణాలు తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయని 'హైపోగోనాడిజం' పరిస్థితే యంగ్ మేల్స్‌ యుక్తవయసుకు చేరుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. ఒకవేళ ఇది వృద్ధాప్యంలో అభివృద్ధి చెంది ఊబకాయం లేదా టైప్ 2 డయాబెటిస్‌తో ముడిపడి ఉంటే ADAM లక్షణాలు సంభవించవచ్చు.

చికిత్స :

మేల్ మెనోపాజ్‌ పరిస్థితికి స్పష్టమైన నిర్వచనం లేనందున.. ఈ శారీరక మార్పులు అనుభవించే పురుషులు వారి లక్షణాల ప్రకారం చికిత్స పొందుతారు. ఊబకాయం ఉన్న వ్యక్తి వెయిట్ మేనేజ్‌మెంట్‌తో పాటు వ్యాయామ నియమావళి పాటిస్తూ ఆహారాన్ని కూడా సర్దుబాటు చేసుకోవాలి. సమతుల్య, పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు అంతర్లీన పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తే లక్షణాలు తగ్గించవచ్చు. రక్త పరీక్షలు, స్కానింగ్ సహా ఏదైనా హృదయ సంబంధ వ్యాధులు గుర్తించేందుకు వైద్యులు అంగస్తంభన, అలసట వంటి కనుగొనబడిన లక్షణాలపై వివరణాత్మక తనిఖీని నిర్వహిస్తారు. ఇక డిప్రెషన్ లేదా ఆందోళన సంకేతాలు ఉన్న వ్యక్తిని మనస్తత్వవేత్త లేదా మనోరోగ వైద్యుడికి సూచించవచ్చు. అంతేకాదు యాంటిడిప్రెసెంట్స్, సైకోథెరపీ లేదా రెండింటినీ సూచించవచ్చు.

Advertisement

Next Story