Healthy diet: మీ డైట్‌లో వీటిని చేర్చుకుంటే అద్భుతమే.. ఆరోగ్యంతోపాటు ఇంకెన్నో..!

by Javid Pasha |
Healthy diet: మీ డైట్‌లో వీటిని చేర్చుకుంటే అద్భుతమే.. ఆరోగ్యంతోపాటు ఇంకెన్నో..!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో భాగంగా సరైన డైట్ చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. వీటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ తప్పక తీసుకోవాల్సిందిగా కొన్నింటిని సజెష్ చేస్తుంటారు. అలాంటి వాటిలో చియా, దానిమ్మ, అవిసె గింజలు, గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉండటంతోపాటు పలు ప్రయోజనాలు కలిగిస్తాయి. అవేంటో చూద్దాం.

బరువు తగ్గాలంటే..

ఇటీవల చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరు తమ డైట్‌లో దానిమ్మను తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దీని గింజల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. పాలీ ఫెనాల్స్, కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటంవల్ల శరీరంలో అధిక కొవ్వును కరిగించడం ద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.

పొద్దు తిరుగుడుతో షుగర్ కంట్రోలింగ్

పొద్దు తిరుగుడు, అలాగే అవిసె గింజలు డైట్‌లో చేర్చుకోవడం మధుమేహం ఉన్నవారికి మంచిది. వీటిలో విటమిన్ -బి1, విటమిన్ ఇ, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పొద్దు తిరుగుడులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్, అవిసె గింజల్లో ఉండే సెకోసోలారిసి రెసినాల్ డిగ్లూకోసైడ్ వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ నిరోధకత, ఉత్పత్తి మధ్య సమన్వయ పాత్ర పోషిస్తాయి.

ఎముకల బలానికి చియా సీడ్స్‌

చియాసీడ్స్‌ను స్మూతీస్, డిజర్ట్, సలాడ్‌లలో వాడుతుంటారు. కాల్షియం ఫుల్లుగా ఉంటుంది కాబట్టి ఎముకల బలానికి సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. వీటిని దీర్ఘకాలంపాటు డైట్‌లో చేర్చుకుంటూ ఉంటే ఎముకల ఖనిజాలు దృఢంగా తయారవుతాయి. లివర్ అండ్ గట్ హెల్త్‌కు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరకప్పు చియా గింజలను రెండున్నర కప్పుల బాదం పాలు, దాల్చిన చెక్క పొడితో మిక్స్ చేసి తయారు చేసే పానీయాన్ని అప్పుడప్పుడూ తాగుతూ ఉంటే ఎముకలు బలంగా తయారవుతాయి.

ఎనర్జీకోసం గుమ్మడి గింజలు

ఇక పోషకాలు సమృద్ధిగా ఉండటంవల్ల గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఐరన్ కంటెంట్‌కు మూలం కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే రక్త హీనత, వివిధ ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో తక్షణ శక్తిని పెంచడంతోపాటు అధిక బరువు తగ్గడంలో గుమ్మడి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

నువ్వులతో గుండె ఆరోగ్యం

చిన్నగానే కనిపిస్తాయి కానీ నువ్వుల్లో పోషకాలు మాత్రం ఫుల్లుగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉండటంవల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఒమేగా - 6 ఫ్యాటీ యాసిడ్స్‌కు నువ్వులు మూలం. వీటిని డైట్‌లో చేర్చుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. స్ట్రోక్, గుండె జబ్బుల రిస్క్‌ను నివారిస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story