Hey Bro.. ఆనందంగా ఉండటం ఎలా.?

by Daayi Srishailam |
Hey Bro.. ఆనందంగా ఉండటం ఎలా.?
X

మనిషి..

సంపాదిస్తున్నాడు.

సాధిస్తున్నాడు.

సమస్యలను ఛేదించి..

పైకి ఎగబాకుతున్నాడు.

కానీ..

సంతోషంగా ఉంటున్నాడా.?

తినడానికే టైమ్ లేని బిజీలైఫ్‌‌‌లో సంతోషమెక్కడిది.?

ఐనా.. ఆ సంతోషాన్ని ఎక్కడని వెతుక్కోవాలి.?

ఇంకెక్కడ బాస్.. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి పదండీ.!

సంతోషంగా ఉండటమంటే విలాసవంతంగా ఉండటం కాదు.. ప్రశాంతంగా బతకడం. కనీసం పడుకుంటే కంటినిండా నిద్రపట్టేంత ప్రశాంతత. ఇలా ఎంతమంది ఉంటున్నారు.? చాలా తక్కువే. కొందరి దగ్గర పైసా ఉండదు. కానీ చిరునవ్వులొలికిస్తూ ఉల్లాసంగా.. సంతోషంగా ఉంటారు. కొందరు పేరుకు కోటీశ్వరులే కానీ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. డబ్బుతో సౌకర్యాలను ఏర్పరచుకోవచ్చుగానీ సంతోషాన్ని కొనుక్కోలేం.

1. నరేష్‌‌‌కి పోలీస్ డిపార్ట్‌‌‌మెంట్‌‌లో జాబ్. సర్కారు నౌకరీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా.? కానీ నరేష్ డ్యూటీకి లీవ్ పెట్టి, ఫ్యామిలీకి దూరంగా అమీర్‌‌‌పేట్‌‌లో ఒక హాస్ట్‌‌‌లో ఉంటున్నాడు. ఈ బతుక్కి సంతోషం లేకుండా పోయిందనే బాధ అతడిది. మంచి జాబ్.. బ్యాంక్ బ్యాలెన్సున్నా నో హ్యాపీ.

2. సరళది విజయవాడ. మ్యారేజ్ బ్యూరో నడిపిస్తోంది. మొన్నామధ్య ఫేస్‌‌‌బుక్‌‌‌లో ఒక పోస్ట్ పెట్టింది. కంటినిండా నిద్రపోక మూణ్నెళ్లయింది. అసలు ప్రాబ్లమేంటో అర్థంకావడం లేదు. వ్యాపారం బానే నడుస్తోంది. అయినా ఏదో కోల్పోయిన ఫీలింగ్. నో హ్యాపీ.

3. శివ.. మొదట్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో చేసేవాడు. అక్కడ హ్యాపీగా లేదని ఒక లాజిస్టిక్ కంపెనీలో చేరాడు. ఆ పనిలోనూ సాటిస్‌‌‌ఫై లేదని క్యాబ్ నడుపుతున్నాడు. ఆర్నెళ్లు కూడా కాలేదు. ఛల్.. నాలుగు బర్రెలు కొనుక్కొని డెయిరీ పెడతా అంటున్నాడు. అక్కడైనా హ్యాపీగా ఉంటాడా. ఏమో డౌటే.

ఆర్ యూ హ్యాపీ.?

నరేష్.. సరళ.. శివ మాత్రమే కాదు. సంతోషమనే లోటు ఉన్నవారు మనదగ్గర అడుగడుగునా కనిపిస్తారు. ఎందుకిలా ఉంటున్నారు.? ఆర్థిక, సామాజిక ప్రభావం వల్ల అస్తవ్యస్త జీవనశైలిని అలవర్చుకొని ఈ సంతోష రహిత జీవితాలను అనుభవిస్తున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. గతేడాది మార్చి నెలలో అమెరికా సంస్థ అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఫిన్లాండ్ మొదటి ప్లేస్‌‌‌లో నిలిచింది. మొత్తం 143 దేశాలకు ర్యాంకులు ఇస్తే వాటిలో ఇండియా ర్యాంక్ 126. చూశారా మనవాళ్లు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫిన్లాండ్ ప్రజలకు సాధ్యమైన హ్యాపీనెస్.. ఇండియన్స్‌‌‌కు ఎందుకు సాధ్యం కాదు.? వాళ్లు మనలా కాకుండా నేచర్‌‌కు దగ్గరగా జీవిస్తారట. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉంటారట వాళ్లు. విజయం అనే అంశంపై వారికి మెరుగైన అవగాహన ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి మన దగ్గరేమో నరేష్.. సరళ.. శివలా అన్ హ్యాపీగా ఉంటున్నారు.

మేనేజింగ్ హ్యాపీనెస్ కోర్సు

ఆనందం అంగట్లో దొరికే వస్తువు కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది. సహజంగా జరగాల్సిన ప్రక్రియను ప్రయోగశాలల్లో.. తరగతి గదులల్లో నేర్చుకునే పరిస్థితి కల్పిస్తున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మనుషులకు ఆనందాలు.. సంతోషాలు కరువయ్యాయి కాబట్టీ సంతోషంగా ఎలా ఉండాలి అనే కోర్సును ప్రవేశపెడుతున్నామని ప్రకటించింది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే శిక్షణా తరగతులు అన్నమాట. గమ్మతే ఉంది కదా.? కానీ ఏం చేస్తాం. రోజు రోజుకూ సన్నగిల్లుతున్న సంతోషాల గురించి ఎక్కడో ఒకచోటయితే నేర్చుకోవాలికదా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రవేశపెడుతున్న మేనేజింగ్ హ్యాపీనెస్ కోర్సు వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఆనందం, మానసిక సమతుల్యత ఏర్పడుతుంది కావచ్చు. సంతోషంలో మనమెక్కడున్నామో తెలుసుకున్నాం.. ఆనందాన్ని ఎందుకు కోల్పోతున్నామో అర్థమైంది కాబట్టీ సంతోషాల కోర్సును ఫాలో అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఫీల్ హ్యాపీ

హ్యాపీనెస్ కోర్సు మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, న్యూరోసైన్స్‌తో అనుబంధం కలిగి ఉంటుందట. హార్వర్డ్ ప్రొఫెసర్, సామాజిక శాస్త్రవేత్త ఆర్థర్ బ్రూక్స్ ఈ కోర్సు బాధ్యతలు తీసుకున్నారట. భావేద్వేగాలను మెరుగుపరిచి ఆనందానికి అర్థమేంటో తెలియజేసి, దానిని రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నేర్పిస్తామని హార్వర్డ్ యూనివర్సిటీ పెద్దలు చెప్తున్నారు. ఆరు వారాల పాటు ఈ కోర్సు ఉంటుంది. ఫీజు రూ. 18,199గా నిర్ణయించారు. ఒత్తిడి, మానసిక సవాళ్లతో బాధపడుతున్న వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ మంచి ప్రయత్నమే చేసింది. కానీ, దాన్నే సాకుగా చూపి ఎన్ని కోచింగ్ సెంటర్లు, ట్రెయినింగ్ అకాడమీలు, ట్యూషన్లు పుట్టుకొస్తాయో. వాస్తవానికి ఆనందం అనేది ఇలా మార్కెట్లో బోర్డులు పెట్టుకొని అమ్ముకునేది కాదుగానీ, భవిష్యత్ తరాలకు దూరమవుతున్న ఆ ఆనందాన్ని పరిచయం చేసే ప్రయత్నమైతే హార్వర్డ్ యూనివర్సిటీ చేస్తున్నట్లుంది. జీవితంలో ఏం చేయాలో తోచనివాళ్లు.. అన్నీ ఉన్నా ఏదో వెలితితో ఉండేవారు.. ప్రతీదానికి ఆరాటపడి ఏదీ సాధించలేక బాధపడే వారు ఈ కోర్సులో చేరి చూడండి.

అదొక రసాయనిక చర్య

ఆనందం ఎవరో పాఠాలు చెప్తే దొరకదు. అది మెదడులో జరిగే రసాయనిక చర్య అంటున్నారు శాస్త్రవేత్తలు. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్ అనే నాలుగు రసాయనాలే ఆనందానికి దోహదపడతాయి. వీటినే డీఓఎస్ఈ డోస్ అంటారు. సానుకూలమైన ఆలోచన మదిలో మెదిలితే మెదడులో విడుదలయ్యే డోపమైన ఆనందాన్ని కలిగిస్తే.. నచ్చినవారితో సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు ఉల్లాసభరితంగా మారడానికి ఆక్సిటోసిన్ దోహదపడుతుంది.

మీ సంతోషమెంత.?

1. ఆల్వేస్ హ్యాపీగా ఉంటా.

2. సంతోషమొస్తే ఎగిరి గంతేస్తా.. సమస్యొస్తే కుంగిపోతా.

3. పెద్దగా సంతోషంలేదు.. విచారంగానూ లేను.

4. అస్సలు సంతోషమే లేదు. రోజంతా విచారంగా ఉంటున్నా.

పై క్వశ్చన్‌కు మీ ఆన్సర్..

1 అయితే మీరు 75శాతానికి మించి హ్యాపీగా ఉన్నట్లు.

2 అయితే మీరు 50శాతం సంతోషంగా ఉన్నట్లు. కుంగిపోవడం మానుకోవాలి.

3 అయితే మీరు మరీ నిర్లిప్తంగా బతికేస్తున్నట్లు లెక్క. చిన్న ఆనందాలనూ ఆస్వాదించండి.

4 అయితే మీరు దు:ఖ సాగరంలో ఉన్నట్లు. ఆశాభావాన్ని పెంచుకుంటే మంచిది.

Next Story

Most Viewed