- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nightmares : పీడ కలలు ఎందుకు వస్తాయి.. అవి నిజం అవుతాయా?

దిశ, ఫీచర్స్ : గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదో దెయ్యం వెంటాడుతున్నట్లో, ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లో అనూభూతికి లోనవుతాం. దిగ్గున లేచి అటూ ఇటూ చూస్తాం. ఏమీ కనిపించదు. హమ్మయ్యా కలలోనా ఇదంతా జరిగింది! అనుకొని మళ్లీ పడుకుంటాం. అట్లనే ఒక్కోసారి నిద్రలేవగానే మనసంతా ఉల్లాసంతో, ఉత్సాహంతో నిండిపోతుంది. రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చి మనలో మనమే ఆనంద పడుతుంటాం.. అలాంటి కల మరోసారి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కలలు రావడం సహజమే. అయితే వీటిపట్ల ప్రజల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా పీడకలలు అపశకునమని, అవి నిజం అవుతాయని కూడా కొందరు నమ్ముతుంటారు. ఇది ఎంత వరకు నిజం? అసలు కలలు ఎందుకు వస్తాయి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
కలలు రావడం సహజమే అయినప్పటికీ, కొందరికి ఎక్కువగా ఆందోళనకు, భయానికి గురిచేసే పీడకలలే వస్తుంటాయి. దీనిని కొందరు రాబోయే ప్రమాద సంకేతంగా భావించి ఆందోళన చెందుతుంటారు. మరికొందరు తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయని చెబుతుంటారు. కానీ ఇదంతా వాస్తవం కాదంటున్నారు నిపుణులు పేర్కొంటున్నారు. కలలు నిజం అవుతాయనేది చాలామందిలో ఉండే ఒక అపోహ మాత్రమేనని, వాటిని నిరూపించగలిగే శాస్త్రీయ ఆధారాలేవీ ఇప్పటి వరకైతే లేవని చెబుతున్నారు.
ఎందుకు వస్తాయి?
వాస్తవానికి మనం నిద్రపోతున్న సమయంలో బ్రెయిన్‌లోని రైట్ ఫ్రంటల్ లోబ్‌లో జీవితంలో లేదా ఏరోజుకారోజు మనం ఎదుర్కొన్న అనుభవాలు, జ్ఞాపకాల తాలూకు న్యూరోడీజనరేషన్ ప్రాసెస్ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితివల్ల మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన లేదా భావోద్వేగానికి గురిచేసిన సంఘటనలు, సమస్యలు, జ్ఞాపకాలు వంటివి రీ ప్రాసెస్ పొందుతుంటాయి. అవి మెదడు భాగాన్ని ప్రేరేపిస్తూ కొన్నిసార్లు కలల రూపంలో వ్యక్తం అవుతాయని, పీడకలలు రావడానికి కూడా ఇదే కారణమని సైంటిస్టులు అంటున్నారు. అయితే వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఏదైనా మానసిక సమస్య ఉన్నప్పుడు అది మరింత ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోనూ రావచ్చు
స్ట్రెస్, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతల బారిన పడినప్పుడు పీడకలలు వచ్చే చాన్సెస్ అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నవారికి తరచుగా లేదా అప్పుడప్పుడుు తమను ఎవరో వెంటాడుతున్నట్లు, సూసైడ్ చేసుకున్నట్లు, దెయ్యాలు తరుముతున్నట్లు, ఆత్మీయులు చనిపోయినట్లు కలలు వస్తుంటాయి. ఇలాంటి భయానక లేదా బాధను కలిగించే వాటినే ప్రజలు పీడకలలుగా పేర్కొంటారు. ఇవి సాధారణంగా రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM), అంటే నిద్ర దశలోనే సంభవిస్తాయి.
మెదడు కార్యకలాపాల్లో మార్పులు
నిద్రపోతున్నప్పుడు ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్’ అనే పరిస్థితి వల్ల నిద్రలో ఉన్నప్పటికీ మెలకువగా ఉన్నట్లే మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. అవి పలు రకాలుగా వర్గీకరించబడుతాయి. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అనుభవాల ప్రాసెసింగ్, అలాగే ఏకీకరణకు అనూభూతికి దారితీస్తాయి. ఇవే పీడకలలు రూపంలోనూ వ్యక్తం అవుతుంటాయి. అలాగే అధికస్థాయి ఒత్తిడి, ఆందోళనలు కూడా పీడకలలు రావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే మెదడు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ నిద్రలో భావోద్వేగాలను ప్రాసెస్ చేసి వాటిని విడుదల చేస్తుంది. అలాగే మెమరీ కన్సాలిడేషన్ ప్రాసెస్ కూడా బాధాకరమైన అనుభవాలను, భావోద్వేగాలను ప్లే చేయడానికి దారితీస్తుంది. ఇవి కలల రూపంలో వ్యక్తం అవుతాయి. సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ (norepinephrine) అండ్ ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఈ కెమికల్స్ మానసిక స్థితి, భావోద్వేగాలు, నిద్రను నియంత్రిస్తాయి. కాబట్టి పీడకలలు వస్తాయి.
స్లీప్ డిజార్డర్స్ వల్ల కూడా..
కొన్నిసార్లు స్లీప్ అప్నియా, ఇన్‌సోమ్నియా(insomnia), రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు కూడా పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, యాంటీ డిప్రెసెంట్స్ మెడికేషన్స్ తరచుగా వాడాల్సి రావడం కూడా పీడకలలను ప్రేరేపిస్తాయి. అట్లనే స్త్రీలలో అయితే గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం లేదా రుతువిరతి సందర్భాలు కూడా ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలో పీడకలలకు కారణం అవుతుంటాయి. నిద్రలేమి, నిరాశ, స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటి మానసిక పరిస్థితులు, కెఫిన్, నికోటిన్, టొబాకో వంటి పదార్థాలు తీసుకోవడం, అధిక మద్యపానం వంటివి కూడా పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచే అవకాశం ఎక్కువ.
రాకూడదంటే ఏం చేయాలి?
పీడకలలు తరచుగా వస్తుంటే మరింత ఆందోళనకు, భయానికి గురవుతుంటారు కొందరు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందు కలలు నిజం అవుతాయనే అపోహలను తొలగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సైంటిఫిక్ ఆలోచనలు ఉన్నవారు, చదువుకున్న వారు సాధారణ కలలు లేదా పీడకలలు రావడంవల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలియజెప్పాలి. దీంతో బాధితులు సగం రిలాక్స్ అవుతారు. అలాగే స్థిరమైన, నాణ్యమైన స్లీప్ షెడ్యూల్స్ పాటించడం, నిద్రకు ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటం, వ్యాయామాలు, యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి కూడా పీడకలలను నివారిస్తాయి. ఇవి కాకుండా మీరు ప్రత్యేకించి అంతర్లీన సమస్యలు ఏమైనా ఎదుర్కొంటుంటే కూడా అవి పీడకలలు రావడానికి కారణం అవుతుండవచ్చు. కాబట్టి అవసరమైతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.