- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Personal Skills : సక్సెస్‌ఫుల్ వ్యక్తుల లిస్ట్‌లో మీరూ ఉండాలా..? వీటిని వదులుకోవాల్సిందే!

దిశ, ఫీచర్స్ : ప్రయత్నాలు అందరూ చేస్తారు కానీ.. కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలాగనీ ఫెయిల్యూర్ ఉండదు, ఉండకూడదనేది కాదిక్కడ. కాకపోతే సక్సెస్‌కు గల కారణాలను అన్వేషించడం, అవగాహన చేసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు మానసిక నిపుణులు. ప్రయత్నాలకు తోడు పరిస్థితులు సహకరించడం విజయానికి దారితీస్తాయి. అలాగే కొన్ని అలవాట్లు, బలహీనతలు కూడా ఫెయిల్యూర్‌కు కారణం అవుతాయి. కాబట్టి విజయం సాధించి సక్సెస్ ఫుల్ వ్యక్తుల జాబితాలో చేరాలంటే జీవితంలో మీరు వదులుకోవాల్సిన అలవాట్లు, మార్చుకోవాల్సిన దినచర్యలు కూడా కొన్నుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
ఇతరులను నిందించడం
మీరు సక్సెస్‌ఫుల్ వ్యక్తులుగా ఎదగాలంటే వదులుకోవాల్సిన బ్యాడ్ హాబిట్లలో ఇతరులను నిందించడం కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. కొందరు తాము అనుకున్న పనులు సజావుగా జరగనప్పుడు, ఓటమిని ఎదురు చూసినప్పుడు తమలోని లోపాలేమిటో చెక్ చేసుకోకుండా ఇతరులే అందుకు కారణమని చెప్తుంటారు. తమ ఇబ్బందులకు ఇతరులను బ్లేమ్ చేస్తుంటారు. ఇలాంటి ధోరణి ఎప్పటికీ మీ ఎదుగుదలకు సహాయపడదు. పైగా ఇలాంటి బ్లేమ్ గేమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను దూరం చేయడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇక జీవితంలో కొన్నిసార్లు తప్పులో, పొరపాట్లో అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటి ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు సాధారణంగా తమ తప్పులకు బాధ్యత వహిస్తారు. పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతారు. మీరూ ఆ జాబితాలో చేరాలంటే మారాల్సిందే మరి.
వాయిదా వేయడం
అప్పటి పరిస్థితుల్లో చేయలేని పనులనో, ఇబ్బందికరమైన వాటినో వాయిదా వేయడంలో తప్పులేదు. కానీ కొందరు సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా చాన్స్ దొరికితే చాలు వాయిదా వేస్తుంటారు. ఇలా చేయడం అప్పటిపూర్తికి కంఫర్ట్‌గా అనిపిస్తుండవచ్చు. కానీ తర్వాత ఇది మరిన్ని తప్పులు చేసేందుకు, పొరపాట్లకు అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు పరీక్ష ఫీజు కట్టేందుకు ఇంకా గడువు ఉందని లైట్ తీసుకుంటూ పోతే.. తీరా చివరి తేదీ వచ్చాక ఆ పని జరుగుతుందో లేదో అని ఒత్తిడికి లోనవుతారు. సడెన్‌గా ఆ రోజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటే సర్వర్ డౌన్ కావచ్చు. టెక్నికల్ ఇష్యూస్ తలెత్తవచ్చు. అందుకే పనులను వాయిదా వేయడం అంత మంచిది కాదంటారు నిపుణులు. ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలో చేయకపోతే లాస్ట్ మినిట్‌లో హడావిడి, ఆందోళన పెరిగిపోతాయి. అవి ఓటమికి, పొరపాట్లకు దారితీస్తాయి. కాబట్టి వాయిదా ధోరణిని వదులుకోవడం మస్ట్.
మార్పు పట్ల భయం
జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజీలో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. మానవులు యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్పు వల్ల కలిగే లాభాల గురించి కాకుండా, నష్టాల గురించే ఎక్కువగా ఆలోచించడం ఇందుకు కారణం. సాధ్యమయ్యే పనుల్లో కూడా సక్సెస్ సాధించలేకపోవడానికి మార్పుపట్ల ఇలాంటి భయాలు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలనుకోవడాన్ని, మార్పుపట్ల వ్యతిరేక భావాన్ని, భయాన్ని వదులుకోవాలంటున్నారు నిపుణులు.
గోల్స్ లేకపోవడం
విజయం అనేది సంకల్పం, పట్టుదల, కృషి వంటివి కలిగిన స్పష్టమైన లక్ష్యాల ఫలితం. మీకంటూ ఓ లక్ష్యం లేకపోవడం కూడా పదే పదే ఓటమికి దారితీయవచ్చు. కాబట్టి సక్సెస్ ఫుల్ వ్యక్తుల జాబితాలో మీరూ ఉండాలనుకుంటే స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. మనసులో స్పష్టమైన లక్ష్యమో, గమ్యమో లేకుండా ప్రయాణించడం మొదలు పెడితే ఎక్కడ ముగించాలో తెలియదు. కాబట్టి గోల్ సెట్ చేసుకోండి. ముఖ్యంగా మీరు సాధించగల, సమయ పరిమితితో కూడిన లక్ష్యాలను కలిగి ఉండటం మంచిది. కాబట్టి మీకంటూ లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడంలో మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణిని వదులుకుంటేనే మీరు విజయం సాధిస్తారు.
పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచన
ఏదైనా పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ ఆలోచన అధికమైతేనే కష్టం. పర్ఫెక్షన్ అనేది ఉన్నత ప్రమాణాలు, కృషికి సంకేతం కావచ్చు. కానీ పర్‌ఫెక్షనిజం అనేది కొన్నిసార్లు మీ సక్సెస్‌ను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుంటే అంతా సవ్యంగా చేయాలనే అతి ఆలోచనతో ఏదీ చేయలేపోవడమే ఇందుకు కారణం. కాబట్టి పర్ ఫెక్షనిజం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటే.. ఇప్పుడే వదిలేయడం బెటర్.
ఆత్మవిశ్వాసం లేకపోవడం
జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు. కానీ మీమీద మీరు నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతే మాత్రం ఇంకేదీ సాధించలేరు అంటారు మానసిక నిపుణులు. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల తమ సామర్థ్యాలతోపాటు ఇతరులను కూడా తక్కువ అంచనా వేయడం, అనుమానించడం, వాస్తవాలతో సంబంధం లేకుండా ఇతరులు ఏది చెప్పినా నమ్మడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే వీరిలోని సెల్ఫ్ డౌట్ కొత్తగా ప్రయత్నించాడన్ని అడ్డుకుంటుంది. వైఫల్యానికి దారితీస్తుంది. మిమ్మల్ని మీరు విశ్వసించినంత మాత్రాన ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని కాదు కానీ.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, మరోసారి ప్రయత్నించడానికి, పట్టుదలతో ఉండటానికి ఆత్మ విశ్వాసం ధైర్యాన్నిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మడం విజయానికి తొలిమెట్టు లాంటిదనే విషయాన్ని మర్చిపోవద్దు.