Social Media : ఆ విషయాలు కూడా షేర్ చేస్తున్నారా..? రిస్క్‌లో పడతారు!

by Javid Pasha |   ( Updated:2025-02-13 16:37:58.0  )
Social Media : ఆ విషయాలు కూడా షేర్ చేస్తున్నారా..? రిస్క్‌లో పడతారు!
X

దిశ, ఫీచర్స్ : నిద్రలేవగానే ఒక సారి.. బ్రష్ చేశాక మరోసారి, రెడీ అయ్యాక ఒకసారి, బయటకు వెళ్లే ముందు ఇంకోసారి.. ప్రతీ క్షణం సోషల్ మీడియాను స్ర్కోల్ చేస్తుంటారు కొందరు. ఏం చేస్తున్నది, ఎలా రెడీ అవుతున్నది, ఎక్కడికి వెళ్తున్నది కూడా పంచుకుంటారు. ఇంత వరకు ఓకే కానీ.. పర్సనల్ విషయాల నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు కూడా కొందరు సోషల్ మీడియాలో లొడ లొడా వాగుతుంటారు. కానీ కొన్నిసార్లు ఇది మీకు నష్టం చేస్తుందని, మానసిక, సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి విషయాలేమిటో ఇప్పుడు చర్చిద్దాం.

ఆర్థిక వ్యవహారాలు

మీకు ఎంత ఉత్సాహం ఉంటే మాత్రం వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక విషయాలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసుకండి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీ ఆదాయం, పొదుపు, అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్వెస్టిమెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్స్ వంటి అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్ బుక్, థ్రెడ్.. ఇలా ఏ సోషల్ మీడియా వేదికల్లోనూ షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఏదో ఒకరోజు మీ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కవచ్చు. మరేవైనదా ఇబ్బందులు తలెత్తవచ్చు.

మారిటల్ లైఫ్ కాంట్రవర్సీస్

భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, వివాదాలు సహజం. కానీ ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితికి తీసుకెళ్లవచ్చు. పైగా ఇలాంటి విషయాలు ఇతరులతో పంచుకుంటూ సానుభూతికంటే సమస్యలు ఎదురయ్యే చాన్సెస్ ఎక్కువ. జీవితమన్నాక ప్రతి ఒక్కరికీ సమస్యలు, సంతోషాలు, సరదాలు, అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని స్నేహితుల వద్ద పంచుకోవడం ద్వారా రిలాక్స్ అనిపిస్తుండవచ్చు. అలాగని సోషల్ మీడియాలో మాత్రం పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఇంటి గుట్టు బయట పెట్టినట్లు అవుతుంది. మీ వ్యక్తిగత విలువలకు భంగం కలుగవచ్చు. సంబంధాల్లో అన్యోన్యతను దెబ్బతీయవచ్చు. అందుకే మీ వైవాహిక జీవితం లేదా సహజీవనంలోని పర్సనల్ విషయాలను పంచుకోకండి.

కుటుంబ సమస్యలు

కుటుంబం అన్నాక అప్పుడప్పుడూ సమస్యలు, సవాళ్లు, సంతోషాలు సహజమే. కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురు కావచ్చు. మనసు బాధ అనిపించవచ్చు. చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. కాస్త ఓపిక పడితే వాటికి పరిష్కారం మీవద్దే ఉంటుంది. కానీ అంతలోనే తొందర పడి కుటుంబ సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోకండి. దీనివల్ల మీ శత్రువులకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్లవుతారని నిపుణులు అంటున్నారు. సో.. కుటుంబ కలహాలు, మీరు మాత్రమే పరిష్కరించుకోగలిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోకండి.

వర్క్‌ప్లేస్‌‌ నిబంధనలు

మీరు పనిచేసే ఆఫీసులో ఆ సంస్థకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉండవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మీకు సమస్యగా అనిపించవచ్చు. పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మీ వర్క్ ప్లేస్‌కు సంబంధించి ఇబ్బందిగా అనిపించే ప్రతిదీ సోషల్ మీడియాలో బయట పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మీకు, మీ కార్యాలయానికి నష్టం జరగవచ్చు. మీ వర్క్ స్టైల్‌ను, సంస్థ రూల్స్‌ను, విజయాలను థర్డ్ పర్సన్ పసిగట్టవచ్చు. తర్వాత అది గాసిప్‌లకు దారితీయవచ్చు. చివరికి మీ ప్రొఫెషనల్ లైఫ్‌‌ను దెబ్బతీసే చాన్స్ ఉంటుంది. అందుకే వర్క్‌ప్లేస్‌లో డిగ్నిటీ పాటించాలని నిపుణులు చెప్తుంటారు.

వ్యక్తిగత సమస్యలు

మనుషులన్నాక అన్ని విషయాల్లోనూ ఎవ్వరూ పర్‌ఫెక్ట్ కాదు, ఏదో ఒక పొరపాటు చేస్తుంటారు. లోపాలు ఉండవచ్చు. అది సహజమే. అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలు మీరు అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప సోషల్ మీడియాలో షేర్ చేయడమో, బహిరంగంగా చర్చించడమో చేయడంవల్ల ఫలితం ఉండదు అంటున్నారు నిపుణులు. అట్లనే మీకు మానసికంగా, శారీరకంగా ఉండే సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటివి ఫైనల్‌గా పరిష్కరించుకోవాల్సింది మాత్రం మీరే. కాబట్టి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ.

లవ్ అండ్ ఎఫైర్స్

కొందరు తమ లవ్ అండ్ ఎఫైర్స్ వంటి అంశాలను కూడా సోషల్ మీడియాలో చర్చిస్తుంటారు. ఏదో ఒకరోజు ఇవి మిమ్మల్ని సమస్యల్లో నెడతాయి. ముఖ్యంగా శృంగార జీవితం, ఇతరులతో వ్యక్తిగత సంబంధాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటున్నారు నిపుణులు. వీటితోపాటు మీ బలహీనతలను, అభద్రతాభావాన్ని కూడా బయటపెట్ట కూడదు. మీకు సంతోషాన్ని కలిగించేవి, మీకు, ఇతరులకు ఇబ్బంది కలిగించనవి ఏ విషయాలైనా షేర్ చేసుకోవడం మేలు చేస్తుంది. కానీ ఇతరులు మీ వ్యక్తిగత ఆలోచనలు, జీవితానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చేంతగా విషయాలను సోషల్ మీడియా వేదికల్లో పంచుకోవడం మీకు నష్టం చేస్తుంది. అందుకే ఏది పంచుకోవాలి? ఏది పంచుకోకూడదో విచక్షణగా ఆలోచించాలని, మీరే పరిమితులు విధించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story