పడుకునే ముందు లైట్లు ఆర్పడం లేదా?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే..

by Javid Pasha |
పడుకునే ముందు లైట్లు ఆర్పడం లేదా?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే..
X

దిశ, ఫీచర్స్: స్లీపింగ్ హాబిట్స్ అందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. చాలా మంది రాత్రిపూట లైట్లు ఆర్పేసి పడుకుంటారు. కొందరు బెడ్ లైట్లు వేసుకుంటే.. మరి కొందరు వేసుకోరు. ఇంకొందరు అసలు లైట్లే ఆర్పరు. అయితే లైట్లను ఆర్పకుండా పడుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ రాత్రిళ్లు లైట్లు వేసుకొని పడుకోవడం కారణంగా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి సుమారు 85 వేల మందిని, 9 ఏండ్ల పాటు స్టడీ చేశారు. అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లైట్ల కాంతికి గురయ్యే వారిలో, అలాగే లైట్లు ఆర్పేసి పడుకున్న వారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయో అబ్జర్వ్ చేశారు. దీంతోపాటు 13 మిలియన్ గంటలకు సంబంధించిన ఓవరాల్ లైట్ సెన్సార్ డేటాను కూడా ఎనలైజ్ చేశారు.

అయితే దీర్ఘకాలం లైట్లు ఆర్పకుండా నిద్రిస్తున్న వారిలో టైప్ 2 డయాబెటిస్ త్వరగా డెవలప్ అయినట్లు ఈ సందర్భంగా పరిశోధకులు గుర్తించారు. కాంతికి ఎక్స్‌పోజ్ అవడంవల్ల సిర్కాడియన్ రిథమ్‌కు ఆటంకం కలగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు కాంతికి గురయ్యేవారిలో ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు సంభవిస్తాయని, ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించే శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీడంవల్ల టైప్ 2 డయాబెటిస్‌ పెరిగేందుకు కారణం అవుతాయని రీసెర్చర్స్ కనుగొన్నారు. కాబట్టి రాత్రిళ్లు లైట్లను ఆర్పేసి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story