ఇమ్యూనిటీ పవర్‌ను డెవలప్ చేస్తున్న బేర్‌ఫుట్ వాకింగ్

by Anjali |   ( Updated:2023-06-13 13:28:31.0  )
ఇమ్యూనిటీ పవర్‌ను డెవలప్ చేస్తున్న బేర్‌ఫుట్ వాకింగ్
X

దిశ, ఫీచర్స్: ఎప్పుడైనా చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించారా? మీ పాదాలు భూమికి నేరుగా తాకడం వల్ల ఓదార్పుగా, విశ్రాంతిగా అనిపించడమే కాకుండా రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యంతోపాటు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ పద్ధతినే ‘గ్రౌండింగ్’ అని కూడా పిలుస్తారు. ఈ ఎక్సర్‌సైజ్ మనలను భూమి ఉపరితలంతో కనెక్ట్ చేయడానికి, శరీరంలో సహజమైన విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. నొప్పి, వాపు తగ్గడం, మెరుగైన నిద్ర, రోగనిరోధక శక్తి, ఒత్తిడి స్థాయిలు తగ్గడంతోపాటు పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు కారణమవుతుంది.

చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల స్థానంపై మెరుగైన నియంత్రణ లభిస్తుంది. మడమపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పాదాలు, కాలు కండరాలు, స్నాయువులను బలోపేతం చేస్తుంది. చీలమండలం, పాదాల కదలిక పరిధిని మెరుగుపరిచి.. మోకాలు, తుంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ పద్ధతిని ప్రయత్నించేటప్పుడు ముందుగా తడి గడ్డి, తడి ఉపరితలంపై నడవాలని సూచిస్తున్న నిపుణులు.. బిగినర్స్ కొన్ని నిమిషాలపాటు మాత్రమే ప్రయత్నించాలని అంటున్నారు. ఆ తర్వాత గంట లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించవచ్చని చెప్తున్నారు.

చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

* పాదాల వంపును మెరుగుపరుస్తుంది. కండరాలు, స్నాయువుల బలాన్ని మెరుగుపరచడం ద్వారా చదునైన పాదాలను అభివృద్ధి చేయడానికి తక్కువ అవకాశం ఇస్తుంది. ప్లాంటర్ ఫాసిటిస్ అనే అరికాలికి సంబంధించిన పరిస్థితి నుంచి నిరోధిస్తుంది.

* తెల్ల రక్త కణాలలో తగ్గుదల, ఎర్ర రక్త కణాల పెరుగుదల ఉన్నట్లు కనుగొనబడింది. ఇది మెరుగైన రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. యాంటీఆక్సిడెంట్లను పెంచడానికి, మంటను తగ్గించి, నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

* సిర్కాడియన్ రిథమ్‌ను మెరుగుపరుస్తుంది. మన అంతర్గత 24 గంటల జీవ చక్రం రోజంతా శారీరక, మానసిక ప్రవర్తనా మార్పులను, నిద్ర, హార్మోన్లు, శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగాలు మొదలైన ముఖ్యమైన విషయాలను కూడా చూసుకుంటుంది.


* చెప్పులు లేకుండా నడవడం.. పాదాల వైకల్యాలకు కారణమయ్యే పెద్ద సైజు బూట్లు ధరించడం వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

* పాదాలపైనే నర్వ్ ఎండింగ్స్ ఉన్నందునా సెన్సారీ ఫీడ్ బ్యాక్‌ ఇంప్రూవ్ అవుతుంది. శరీర అవగాహన, ప్రొప్రియోసెప్షన్, సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

* గడ్డి, ఇసుక, నేల, అంతస్తుల వంటి గట్టి ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడవడం మన సెన్సారీ మోటర్‌ డెవలప్‌మెంట్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

* స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థను సమతుల్యం చేసే పారాసింపథెటిక్ కార్యకలాపాలను పెంచడం ద్వారా ప్రీహైపర్‌టెన్షన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రారంభించేందుకు చిట్కాలు..

* ప్రతి పాదం 26 ఎముకలు, 33 కీళ్ళు, వందకు పైగా కండరాలు, స్నాయువులతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. ముందుగా చిన్న చిన్న వ్యాయామాలతో వాటిని బలోపేతం చేయడం ముఖ్యం. పాదాల కింద టెన్నిస్ బాల్ లేదా గోల్ఫ్ బాల్‌ను ప్రెస్ చేయడం ద్వారా విభిన్న ఉపరితలాలతో సున్నితత్వాన్ని మెరుగుపరుచడంలో సహాయపడుతుంది.

* ముందుగా చెప్పులు లేకుండా ఇంటి లోపల నడవడం ప్రారంభించండి. దీని వల్ల మీ పాదాలలో కాలిస్ థిక్‌నెస్‌ పెరుగుతుంది. బయట నడవడానికి సిద్ధంగా ఉంచుతుంది. థిక్ కాలిస్ పాదాల సున్నితత్వానికి అంతరాయం కలిగించదని కూడా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

* ఇప్పుడు 5-15 నిమిషాలు బయట చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించవచ్చు. నిపుణులు పొడి వాటి కంటే తడి ఉపరితలాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఉత్తమ ఫలితాల కోసం తడి గడ్డి మీద నడవవచ్చు.

* మీరు మీ జీవితమంతా షూస్ ఉపయోగిస్తుంటే.. మార్పు కష్టంగా ఉంటే.. చాలా డిపార్ట్‌మెంట్ స్టోర్‌లలో అందుబాటులో ఉండే మినిమలిస్ట్ షూలను ఉపయోగించవచ్చు. 2021 శాస్త్రీయ అధ్యయనం ప్రకారం.. 6 నెలల పాటు వారి సాధారణ రోజువారీ కార్యకలాపాలలో సాధారణ షూస్ నుంచి మినిమలిస్ట్ షూస్‌కు చేంజ్ అయిన వ్యక్తుల్లో వారి పాదాల బలం 60% మెరుగుపడిందని కనుగొన్నారు.


* నడవడానికి మీరు తప్పనిసరిగా శుభ్రమైన స్థలాన్ని కనుగొనాలి. ఎందుకంటే మనం ఎంచుకునే ప్రాంతం అరికాళ్లకు గాయం లేదా ఇన్ఫెక్షన్‌కు కారణం కాకూడదు. బయట నడిచిన తర్వాత, మీ పాదాలకు ఏదైనా గాయం అయిందా, ధూళి అంటుకుందా అనే విషయాన్ని చెక్ చేయండి. బయట చెప్పులు లేకుండా నడిచిన తర్వాత పాదాలను బాగా కడగాలి. ప్లాంటర్ ఫాసిటిస్, పాదాలు బలహీనమైన కండరాలతో బాధపడుతున్నట్లయితే.. చెప్పులు లేకుండా నడిచేందుకు ఫిజియోథెరపిస్ట్ సూచనలను ఫాలో అవండి.

* గర్భధారణ సమయంలో ఇంటి బయట చెప్పులు లేకుండా నడవడం సిఫార్సు చేయబడదు. బదులుగా ఆరుబయట నడుస్తున్నప్పుడు మినిమలిస్ట్ పాదరక్షలను ఉపయోగించవచ్చు. 10% గర్భిణీ స్త్రీలు అనుభవించే మడమ లేదా అరికాలి నొప్పి అయిన ప్లాంటార్ ఫాసిటిస్ మీ పాదాలకు బలపరిచే వ్యాయామాలతో పాటు మినిమలిస్ట్ పాదరక్షలతో ఆరుబయట నడవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

* పసిపిల్లలను చెప్పులు లేకుండా నడవడానికి ప్రోత్సహించండి. నేల, గడ్డి, ఇసుక వంటి వివిధ ఉపరితలాలపై నడవడానికి ఎంకరేజ్ చేయండి. ఇది సెన్సారీ మోటార్‌ను మెరుగుపరుస్తుంది. శరీర అవగాహనను మెరుగుపరుస్తుంది.

Also Read: మంచి ఆలోచన.. స్కూల్‌‌కు వస్తున్న పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్న టీచర్లు (వీడియో)

Advertisement

Next Story

Most Viewed