టీడీపీ కుట్రతోనే శాసన మండలి వాయిదా: వైసీపీ

by srinivas |   ( Updated:2020-06-18 08:39:19.0  )
టీడీపీ కుట్రతోనే శాసన మండలి వాయిదా: వైసీపీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. బీఏసీ సమావేశంలో మూడు రోజుల పాటు మండలి సమావేశాలు నిర్వహించాలని తీర్మానించగా, ఊహించని విధంగా రెండు రోజులకే నిరవధికంగా వాయిదా పడింది. అయితే, వాయిదా వేయడం వెనుక టీడీపీ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వమే కారణమని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే, బుధవారం శాసనమండలిలో జరిగిన తీరును పరిశీలిస్తే..

శాసనసభలో ఆమోదం పొందిన ద్రవ్య వినిమయ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు శాసన మండలి ఆమోదానికి వచ్చాయి. వీటిల్లో ఏది మొదట తీసుకోవాలనే విషయంపై వివాదం ఏర్పడి సభ మూడు గంటలపాటు స్తంభించింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేయగా, శాసనసభ ఆమోదించిన బిల్లులపైనే చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడదామంటూ మండలి చైర్మన్ షరీఫ్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించేందుకే అనుమతిచ్చారు. ఈ క్రమంలో వైసీపీ కలుగజేసుకోవడంతో మండలిలో గందరగోళం నెలకొంది. టీడీపీ నేతలు చైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఓటింగ్ తమకు అనుకూలంగా జరిగినట్లు బల్లలు చరిచి బిల్ ఫెయిల్ అయినట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, సవాళ్లు ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేత నాగజగదీష్, మంత్రి వెల్లంపల్లి రెచ్చగొట్టుకుని ఘర్షణకు దిగేందుకు సిద్ధమయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టీడీపీ నేతలు బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు తోసేసే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం ముదిరిపోయింది. ఇంతలో నారా లోకేశ్ ఫొటోలు, వీడియోలు తీయడంతో సభ నినాదాలు, వాగ్వాదంతో గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో శాసన మండలిని నివరధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. ఇలా కీలక బిల్లులకు ఆమోదం పొందకుండానే సభ వాయిదా పడింద.

‘వాయిదాకు యనమలనే ప్రధాన కారణం’

మండలి వాయిదాకు ప్రధాన కారణం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడేనని మంత్రులతో పాటు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్షాన్ని నడిపించే యనమల తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించి, సభ నిరవధికంగా వాయిదా వేయించారని చెబుతున్నారు. శాసన మండలిలో టీడీపీకి మెజారిటీ ఉందన్న కారణంతో సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో లోకేశ్ ఫొటోలు తీస్తున్నాడని, ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతలు దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

సభలో తీసిన ఫొటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని వెల్లడించారు. దీనిపై సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు బిల్లులను అడ్డుకున్నారని, తద్వారా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు మండలి నియమావళిని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తారు. మండలి సమావేశాలకు టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారని అన్నారు. చైర్మన్ కూడా గత సమావేశాల్లో మాదిరే వ్యవహరించారని తెలిపారు.

సభలో పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణం: యనమల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేసినట్టు వైఎస్సార్సీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. సభలో జరిగిన పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని అన్నారు. సబ్జెక్టుతో సంబంధంలేని మంత్రులు మండలిలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. సాధారణంగా సభలో ప్రతిపక్షం గొడవ చేస్తుందని, కానీ ఇక్కడ అధికార పక్షమే గొడవ చేస్తోందని విమర్శించారు. అయినా, తమ పార్టీ నేత లోకేశ్‌పై దాడి చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. మండలిలో మంత్రులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, గతంలో లేని విధంగా తిట్ల పురాణం అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి సమావేశాలకు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరించినట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.

లోకేశ్ వ్యవహార శైలి సిగ్గుచేటు: వెల్లంపల్లి శ్రీనివాస్

శాసన మండలిలో లోకేశ్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మండలిలో లోకేశ్ ఫొటోలు తీశారని, శాసనమండలి చైర్మన్ స్వయంగా
చెప్పినా వినలేదని తెలిపారు. ఫొటోలు తియ్యొద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని ఆరోపించారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. దీని వెనుక లోకేశ్ ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీలు మండలిలో గూండాలు, రౌడీలుగా వ్యవహరించారని విమర్శించారు. దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లోకేశ్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed