కేంద్రంపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్

by Shyam |
Gutha Sukender Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నదీ జలాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. తెలంగాణను ఎడారిగా మార్చాలని కేంద్రము కుట్ర పన్నిందని, నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను సైతం గెజిట్‌లో పొందుపరచడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రానికి తెలియకుండా ఒక్క చుక్క నీటిని వినియోగించుకునే వీలు లేకుండా కుట్ర చేసిందని మండిపడ్డారు. తెలంగాణ నాయకుల అమాయకత్వాన్నీ అడ్డం పెట్టుకొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర పాలకులు తెలంగాణ నాయకుల నోళ్లు మూయించారని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను, రన్నింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. ఇది చూసి ఓర్వలేక బీజేపీ కుట్ర పన్నిందని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అర్థంకవడంతోనే ఈ విధంగా కక్ష్య పెట్టుకొని వ్యవహరిస్తున్నదని వివరించారు. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలన్నా.. కేంద్రం దాయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సి వస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, తెలంగాణ బాగు కోరే వారు ఎవ్వరు ఈ గెజిట్‌ను ఒప్పుకోరని అన్నారు. బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, ప్రజలు బీజేపీ నాయకులను నిలదీయాలని తెలిపారు. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి లేదని, తెలంగాణపై ప్రేమ అసలే లేదని, కేవలం అధికారం కోసమే వారి ఆరాటమని ఆరోపించారు. నదీ జలాల అంశంపై కేంద్రం పునరాలోచించాలని, గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలని గుత్తా సూచించారు.

Advertisement

Next Story