- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్ని పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులున్నారు.. ప్రజలను గొర్రెలను చేస్తున్న సీఎం
దిశ, కరీంనగర్ సిటీ : త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారులు పనిచేయాలని మాజీ మంత్రి, ఎంఎల్‌సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో, గురువారం నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సమాలోచన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వేలాది మంది ఉద్యమకారుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేసుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఏక కుటుంబ ఆధిపత్యాన్ని మాత్రమే రాష్ట్రంలో కొనసాగిస్తూ, నైజాం పాలన సాగిస్తున్నాడని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన దీక్షతోనే తెలంగాణ వచ్చిందని విర్రవీగుతున్న సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలంటే, త్వరలో జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యేలా అన్ని పార్టీలు సమిష్టి కృషి చేయాలన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వారిని అణిచివేయడం ఆయన నైజంగా మారిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి తన కుటుంబ అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
శాసనమండలి మాజీ చైర్మన్ బీజేపీ నాయకుడు కనకమామిడి స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్‌ను అటకెక్కించిన ముఖ్యమంత్రి తన కుటుంబ పురోగతిని మాత్రమే కాంక్షిస్తున్నాడని మండిపడ్డారు. ఏడేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుండగా నియంతృత్వం రాజ్యమేలుతోందని, సీమాంధ్రుల నుంచి దాస్య శృంఖలాలు తెంచుకున్న తెలంగాణ, కేసీఆర్ కబంధహస్తాల్లో బంధీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధనకు ఈ వేదిక నాందీ వాచకం కావాలని, నయా నైజాం పాలనపై, రాజకీయాలకు అతీతంగా మరో పోరాటానికి ఉద్యమకారులను ఈ వేదిక సన్నద్ధం చేస్తుందని ఆకాంక్షించారు.
సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి మాట్లాడుతూ.. కలిసికట్టుగా ఉద్యమిస్తే మోనార్క్ కల్వకుంట్ల కుటుంబం పతనం తప్పదని స్పష్టం చేశారు.
మాజీ మంత్రులు చంద్రశేఖర్, విజయ రమణ రావులు మాట్లాడుతూ.. దళితులపై ఇన్నేళ్ళుగా లేని ప్రేమను ఇప్పుడే చూపటం వెనక ఆంతర్యమేమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, హుజురాబాద్ నియోజక వర్గంలో 45 వేల మందికిపైగా దళితులు ఉండటంతోనే వారిపట్ల కపట ప్రేమ కనబరుస్తున్నారన్నారు. కేవలం నియోజకవర్గంలో పది మందికి కాకుండా, రాష్ట్రంలోని దళితులు అందరికీ దళిత బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కటకం మృత్యుంజయం మాట్లాడుతూ.. ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను గొర్రెలుగా మారుస్తున్నాడని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు హామీలు ఇవ్వటమే తప్ప ఆచరణ ఆమడ దూరంలో ఉంటుందని అన్నారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన అనేక పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, ఆయా చోట్ల సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభ మాట్లాడుతూ.. యేరు దాటినాక తెప్ప తగలేసే వ్యక్తిత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌దని, నిరుద్యోగులు విద్యార్థులను ఉద్యమ సమయంలో వాడుకొని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని విమర్శించారు.
ఉద్యమ ఆకాంక్షల వేదిక కన్వీనర్ గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, జిల్లాలో వెయ్యి మందికి పైగా ఉద్యమకారులు ఉండగా, ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని మండిపడ్డారు. అన్ని పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు మరోసారి ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కరీంనగర్ నుంచే కేసీఆర్‌పై యుద్దం ప్రారంభించేందుకు ఉద్యమకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.