అప్సరసకు రూ.2.50 లక్షలంట.. గురుడికి బురిడీ

by Shyam |   ( Updated:2020-08-02 21:54:38.0  )
అప్సరసకు రూ.2.50 లక్షలంట.. గురుడికి బురిడీ
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: హైదరాబాద్ కు చెందిన ఓ యువకునికి డేటింగ్ ముఠా కాల్ చేసింది. స్వీట్ వాయిస్ తో తన పేరు ఐశ్వర్య అంటూ ఓ అమ్మాయి పరిచయం చేసుకుంది. తాను ‘సెక్సీ చాట్స్’ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పింది. ఆన్ లైన్ డేటింగ్ లో అందమైన యువతులతో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని వివరించింది. డేటింగ్ కోసం రూ.2050 చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పడంతో అతడు డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత ఫొటోలతో పాటు అడ్రస్ ప్రూఫ్స్, ఆధార్ కార్డు సహా డేటింగ్ గ్యాంగ్ అడిగిన వివరాలన్నీ పంపించాడు. చివరగా అతడి అభిరుచులకు తగిన అమ్మాయి సిద్ధంగా ఉందని ఊరించారు.

మెంబర్ షిప్ కోసం రూ.25 వేలు కట్టాలని, ఆ డబ్బును రిఫండ్ చేస్తామని చెప్పడంతో అతడు మరోసారి డబ్బు చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మీ కోసం అమ్మాయి నెక్లెస్ రోడ్డులోని ‘ ఐ లవ్ యూ హైదరాబాద్’ వద్ద ఉందని చెప్పింది. దీంతో అతను ఆశగా వెళ్లి, ఎవరూ లేకపోవడంతో తిరిగొచ్చాడు. ఆపై కొద్ది రోజులకు లుంబినీ పార్కు వద్ద యువతి మీ కోసం ఎదురు చూస్తోందని నమ్మబలికింది. యువతిని మీ కోసమే ప్రత్యేకంగా రప్పించామని, అప్సరసలా ఉంటుందని.., అందుకోసం రూ.2.25 లక్షలు చెల్లించాలనగా.. ఆ మొత్తాన్ని సమర్పించాడు. బాధితుడికి అక్కడా నిరాశే ఎదురైంది. మొత్తం రూ. 2.50 లక్షలు ముట్టజెప్పిన తర్వాతే బాధితుడికి తాను మోసపోయానన్న విషయం అర్థమైంది. సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు పరుగు తీశాడు.

ఇలాంటిదే మరొకటి..

కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్న కరీంనగర్ కు చెందిన మాధవ్ (పేరు మార్చాం) డేటింగ్ వెబ్ సైట్ లో పార్టనర్ కోసం వెతికాడు. ఓ వెబ్ సైట్ కు తన వివరాలు ఇచ్చాడు. ఆ వెంటనే ఓ యువతి అతనితో మాట్లాడింది. మత్తెక్కించేలా ఇంగ్లిష్, హిందీలో మాట్లాడింది. తన ట్రాప్ లో బాధితుడిని పడేసింది. తన పరిచయం ఎంతో ఎంజయ్ నిస్తుందని నమ్మబలికింది. హైదరాబాద్ లో తమ నెట్ వర్క్ ఉందని, గోల్డెన్, ప్రీమియర్ తదితర కార్డులున్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్, టాక్స్ లు, ఫీజులు అంటూ డబ్బు గుంజింది. తీరా ఆ ఫోన్ స్విచ్చాఫ్​ అయింది. ఇలాంటి ఘటనలు నగరంలో నిత్యం జరుగుతున్నా.. కొందరు ధైర్యంగా పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. మరి కొందరు బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎవ్వరికీ చెప్పకుండా లోలోన కుమిలిపోతున్నారు.

బ్లాక్ మెయిల్ దందా..

డేటింగ్ సంస్థలు అమాయక యువకులను టార్గెట్​ చేసి వివరాలు సేకరిస్తున్నాయి. మీ ఫోటోలు, ఐడీలు ఆన్ లైన్ డేటింగ్ సైట్లలో ఉన్నాయంటూ.. బ్లాక్ మొయిల్​ చేస్తున్నాయి. పోలీసులు మిమ్మల్ని గాలిస్తున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు చెబుతామని బెదిరిస్తూ లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నాయి.

నమ్మొద్దు.. మోసపోవద్దు: మోహన్ రావు, సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్

ఆన్ లైన్ డేటింగ్ సంస్థలను నమ్మి మోసపోవద్దు. కోల్ కతా నుంచి ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఇప్పటికే నగరంలో ఇలాంటి ఓ కాల్ సెంటర్ పైన దాడి చేసి 20 మంది గర్ల్స్ ను అదుపులోకి తీసుకున్నాం. ముగ్గురు నిందితులను పట్టుకున్నాం. ఆన్ లైన్ డేటింగ్ కు సంబంధించిన ఏ సంస్థలకు అనుమతి లేవు. అవి బూటకం.

Advertisement

Next Story

Most Viewed