ఈ భూబకాసురులను పట్టించుకునేవారే లేరా..?

by Anukaran |
ఈ భూబకాసురులను పట్టించుకునేవారే లేరా..?
X

దిశ, కరీంనగర్ సిటీ : నగర శివారులోని బొమ్మకల్ గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు దాసరి భూమయ్య డిమాండ్ చేశారు. బొమ్మకల్ గ్రామశివారులో ప్రభుత్వం శిఖం భూములు 724/D , 722 , 28 ,74,728,105 ,679/10 సర్వే నంబర్స్ గల భూములను దాసరి భూమయ్య సోమవారం సందర్శించి పరిశీలించారు. సర్వే నంబర్ 28లో గల భూమిలో పెద్దపల్లి ఎమ్మెల్యేకు చెందిన ట్రినిటీ విద్యా సంస్థలు నిర్మించిన బావిని పరిశీలించి మీడియాతో భూమయ్య మాట్లాడారు. బొమ్మకల్ గ్రామంలో దాదాపు 120 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అధికార దాహంతో కబ్జాలు చేశారని ఆయన ఆరోపించారు.

తాము ఆధారాలతో సహ జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, ఇప్పటివరకు చర్యలే తీసుకోలేదని విమర్శించారు. అసైన్డ్ భూములు ఆక్రమించారని మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్, కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న బొమ్మకల్ గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు కబ్జా అవుతున్నా కనిపించడం లేదా ప్రశ్నించారు. స్థానిక మంత్రి, పెద్దపెల్లి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కు చెందిన ఒక ఎమ్మెల్సీ సైతం భూ ఆక్రమణకు పాల్పడ్డారని, తగిన ఆధారాలు అందజేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటో అంతుపట్టడం లేదన్నారు. మంత్రి ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, కరీంనగర్ ప్రజాప్రతినిధులపై ఉదాసీనత ప్రదర్శించటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed