‘ధరణి పోర్టల్‌తోనే భూ సమస్యలు.. అధికారులపై నమ్మకం లేదు’

by Shyam |
‘ధరణి పోర్టల్‌తోనే భూ సమస్యలు.. అధికారులపై నమ్మకం లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధరణి పోర్టల్​వల్ల భూ సమస్యలు పెరుగుతున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​ కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ తాము ఏడాది కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇన్ని రోజులు మొద్దు నిద్రపోయారని, ఇప్పుడేమో ఈ నెల 28వ తేదీలోపు అన్ని పరిష్కరించాలంటూ ఆదేశించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటనను జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి తీసుకురావడమంటే ధరణి బాధితులను మభ్యపెట్టడమేనన్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు.

డ్యాష్ బోర్డు క్లియర్ చేయడమంటే సమస్యలు పరిష్కరించినట్లుగా అధికారులు లెక్కలు కడుతున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లుగా భావించాలన్నారు. కోర్టుకే వెళ్లాలనడం అన్యాయమన్నారు. చిత్తశుద్ధి లేని అధికారులపై తమకు నమ్మకం లేదన్నారు. తప్పులతడకగా ఉన్న ధరణి పోర్టల్‎ను అమల్లోకి తీసుకొచ్చారని విమర్శించారు. ఎంతో మంది రైతులు వారి స్వార్జితం, వారసత్వంగా వచ్చిన భూములను అమ్ముకోలేకపోతున్నారని, హక్కులను కాలరాశారన్నారు. పిల్లల పెళ్ళిళ్ల కోసం కూడా భూములను అమ్ముకోలేని ధైన్యం రాష్ట్రంలో నెలకొందన్నారు. కొందరు ఉన్నత చదువుల కోసం భూములను తాకట్టు పెట్టలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రజలను మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారపూరిత అధికారులకు అప్పగించడం వల్ల ధరణి పోర్టల్​అబాసుపాలైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమర్థులకు అప్పగించాలని డిమాండ్​ చేశారు.

Advertisement

Next Story

Most Viewed