లక్ష గొర్రెలు మృతి.. పైసా రాని ఇన్సూరెన్స్

by Shyam |   ( Updated:2021-08-02 22:43:45.0  )
Distribution of sheep
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం గొర్రెల కాపర్లకు అందించిన గొర్రెల్లో లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ డబ్బులు అందకపోవడంతో గొర్రెల కాపర్లు నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్ ప్రక్రియలో లోపాలు ఉండటం, ఒకరి గొర్రెలను మరొరికి పంపిణీ చేయడం వంటి కారణాలతో క్లయిమ్‌లు కావడంలేదు. ఒక గొర్రెల యూనిట్ (21 గొర్రెల) కు రూ.4,600 ప్రిమియ్ చెల్లిస్తుండగా ఒక గొర్రె చనిపోతే రూ.5వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

గొర్రెల కాపర్లను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రవేశ పెట్టిన గొర్రెల పథకంలో చాలా మంది కాపర్లు నష్టపోతున్నారు. ప్రమాదాలతో, అనారోగ్యాలతో, వాతావరణ పరిస్థితులు అనుకూలించక చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ డబ్బులు అందడం లేదు. గొర్రెల పంపిణీ పథకంలో లోపాలుండటం, ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో గొర్రెల కాపర్లు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా లక్షకు పైగా ప్రభుత్వం అందించిన గొర్రెలు చనిపోయినట్టగా తెలుస్తోంది.

గొర్రెల పంపిణీలో లోపాలు

గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లోపాలను ప్రభుత్వం, అధికారులు గుర్తించకపోవడంతో కాపర్లు నష్టపోవల్సి వస్తోంది. గొర్రెలను కొనుగోలు చేసిన ప్రభుత్వం నెంబరింగ్ చేపట్టి వాటి చెవికి రబ్బరు ట్యాగ్ ను వేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి నెంబర్లు వేసిన 21గొర్రెలను కేటాయిస్తున్నారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ అమలు చేసే కంపెనీ లబ్ధిదారుని వివరాలు, అతనికి కేటాయించిన గొర్రెల నెంబర్ల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. గొర్రెల పంపిణీ సమయంలో ఒకరి గొర్రెలను, మరొకరికి కేటాయించడంతో సమస్య మొదలవుతోంది. ఇలా తప్పుడు పంపిణీలు చేపట్టడంతో గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రాక లబ్ధిదారులు నష్టాలను చవిచూస్తున్నారు.

లబ్దిదారుడి దరఖాస్తును పరిశీలించిన కంపెనీ సిబ్బంది వాటిని తిరస్కరిస్తున్నారు. చనిపోయిన గొర్రెలు అతనికి చెందినవి కాదని గుర్తించి ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరు చేయడం లేదు. గొర్రెల పంపిణీ చేసిన తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది ఫీల్డ్ లెవల్ విజిట్ చేసి గొర్రెల వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ జరగకపోవడం వలనే గొర్రెలు తారుమారు అవుతున్నాయనే అంశాలను గుర్తించలేకపోతున్నారు.

ఒక యూనిట్ కు రూ.4,600 ప్రిమియమ్ చెల్లింపు

లబ్ధిదారులకు నష్ట వాటిల్లకుండా ప్రభుత్వం గొర్రెలకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అమలు చేసింది. ఒక యూనిట్ (21) గొర్రెలకు ప్రభుత్వం అందించిన రూ.లక్ష 25వేలలోనే ఇన్సూరెన్స్ కోసం రూ.4,600లను కేటాయించారు. వీటిని ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రిమియం కింద చెల్లింపులు చేపట్టారు. ఈ సదుపాయంతో ఒక గొర్రె చనిపోతే రూ. 5వేలు లబ్ధిదారునికి చెందనున్నాయి. కానీ పంపిణీలో లోపాలు ఉండటంతో లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుంది.

అధికారుల నిర్లక్ష్యంతో నష్టం

గొర్రెలను పంపిణీ చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే లబ్ధిదారులు నష్టాలను చూడాల్సి వస్తుంది. ఒకరికి చెందాల్సిన గొర్రెలను మరొకరికి కేటాయించడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యవేక్షణలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది ఫీల్డ్ లెవల్ లో తనిఖీలు చేపట్టకపోవడం కూడా కారణమవుతున్నాయి. గొర్రెల పంపిణీలు సక్రమంగా జరిగితేనే లబ్ధిదారునికి ఇన్సూరెన్స్ డబ్బులు అందేందుకు ఆస్కారముంది.
-ఉడుత రవీందర్, గొర్రెల కాపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed