కృష్ణా జలాల కోసం రాజీలేని పోరాటం: కేటీఆర్

by Anukaran |
ktr
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీటి కోసం ఎవరితోనైనా.. ఏపార్టీతోనైనా పోరాడేది టీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జవహర్‌నగర్, తూముకుంట్ల మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారనడానికి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని, రెండు నాలుకల ధోరణి, ద్వంద వైఖరిని టీఆర్ఎస్ అవలంభించదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల ఆశీర్వాదం ఉందని.. వారి కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

టీఆర్ఎస్‌లో చేరిన వారిలో జవహర్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన 3వ వార్డు కార్పొరేటర్ బెల్లి శ్రీనివాస్, 20వ వార్డు కుదాడి సాయి, 25వ వార్డు జమల్ పూర్ నవీన్, 21వ వార్డు చింతల ప్రేమిలాశ్రీనివాస్, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అనురాధ రాఘవారెడ్డి, తూముకుంట మున్సిపాలిటీకి చెందిన రాజ్ పుత్ పూజా భారత్ సింగ్, సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ ఎంపీటీసీ సింగిరెడ్డి ఇందిర, పొన్నల్ ఎంపీటీసీ మౌనిక శివ వీర ప్రసాద్, అలియాబాద్ ఎంపీటీసీ కుదురు అశోక్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed