‘కంటైన్‌మెంట్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి’

by Shyam |
‘కంటైన్‌మెంట్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి’
X

– అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

దిశ, న్యూస్‌బ్యూరో : కంటైన్‌మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 260 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటైన్‌మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి స్పష్టం చేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్‌ను ఇండ్ల వద్దకే సరఫరా చేయాలని.. వాలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్ జోన్‌లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, వారి అవసరాలను తెలుసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 15 కంటైన్‌మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి ఉదహరించారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్‌మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావణం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని, శానిటేషన్‌తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్‌మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్ /ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారున్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వృథా అవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల గల పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అత్యవసర సేవలను అందించేందుకు 104, 108 వాహనాలే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి తదితరులు పాల్గొన్నారు.

Tags : KTR, Continemnt Zones, Migrant workers, GHMC, Etala Rajendar

Advertisement

Next Story