- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆగకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి : మంత్రి జూపల్లి

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా, పనులు ఆగకుండా అభివృద్ధి జరగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ.మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు మోహన్ రావు, శివేంద్ర ప్రతాప్ తదితర అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, నిర్వాహణ లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి, నీటి సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో త్రాగు నీటి సరఫరాకై సీఎం జిల్లా కలెక్టర్లకు కోటి రూపాయల నిధులను మంజూరు చేసినట్లు, అత్యవసర మనుకుంటే ఎమ్మెల్యేల ఎస్ డీ ఎఫ్ నిధులను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.
రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వెంటనే నిర్ణిత తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యం తూకం వేసిన వెంటనే కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణాన్ని అనుసరించి రశీదు అందజేయాలని ఆదేశించారు. ధాన్యం మిల్లులకు రవాణా చేసిన రైతులు పడిగాపులు పడకుండా కొనుగోలు నిర్వాహకులు మిల్లులకు పంపాలని సూచించారు. గత రబీలో మిల్లర్లు వడ్లు మిల్లింగ్ చేసి, బియ్యం డెలివరీ చేయకుండా బయట అమ్ముకున్న మిల్లర్లు నుండి 150 కోట్ల మేరకు బకాయిలను రికవరీ చేయాలని,అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కు 500 రూపాయల సబ్సిడీ అందజేస్తుందని, పేరు, ఆధార్ నెంబర్, రేషన్ కార్డులలో తప్పులు వలన అర్హులు మిస్ అయ్యారని, 200 యూనిట్ లోపల విద్యుత్ వినియోగించుకునే వారికి జీరో బిల్లులు రాకుంటే వాటిని సరి చేయాలని సూచించారు.
నూతన రేషన్ కార్డులు అందజేయాలని, జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులు సమీక్షించి, ప్రభుత్వం మంజూరు చేసిన పనులు వెంటనే చేపట్టాలని, పిల్లలమర్రి, కోయిల్ సాగర్ లలో మంజూరు చేసిన పనులు వెంటనే టెండర్లు పిలిచి చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శిల్పారామంలో నాడు అక్కడ ఉన్న ప్లాట్లను బలవంతంగా తీసుకున్నారని, ఆ ప్లాట్లు శిల్పారామంకు అవసరమైతే నష్టపరిహారం ఇవ్వాలని, అవసరం లేకుంటే వెంటనే ప్లాట్ల ఓటర్లకు తిరిగి ఇచ్చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు.