- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెన్సేషనల్ న్యూస్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ ఫిక్స్.!
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది. శనివారం రాత్రి జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎవరనే అంశంపైనే చర్చించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖను బరిలోకి దింపితే పద్మాశాలి, మున్నూర్‌కాపు సామాజికవర్గాలతో పాటు బీసీ వర్గాల నుంచి మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై కొండా సురేఖ అభిప్రాయాన్ని సైతం తీసుకునేందుకు కోర్ కమిటీ ప్రయత్నాలు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకే పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖ చెప్పినట్లు సమాచారం.
అవకాశాలున్నానట్టేనా..?
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొండా దంపతుల హవా కొనసాగింది. వరంగల్‌కు చెందిన నేతలు అయినప్పటికీ.. రాష్ట్రంలో వీరి అంశంలో ఏదైనా హాట్‌టాపిక్‌గానే ఉంది. వైఎస్‌రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో ఇమడలేక మళ్లీ సొంతగూటికి చేరారు. కాంగ్రెస్‌పార్టీలో కూడా కొంతకాలం స్తబ్ధుగా ఉన్నా.. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత కొండా దంపతులు మళ్లీ తెరపైకి వచ్చారు. ఇటీవల పలు కార్యక్రమాల్లో ముందుంటున్నారు.
ఇక వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బలమైన నేతగా కొండా సురేఖ, కొండా మురళి ఇంకా ప్రభావం చూపిస్తున్నారు. కొండా సురేఖను బరిలోకి దింపితే పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గాల ఓట్లు హస్తం గుర్తుకు పడతాయని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్టికెట్ కోసం ప్యాట రమేష్, కృష్ణారెడ్డిల పేర్లను కూడా టీపీసీసీ పరిశీలించింది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరుకు దిగుతుండటంతో తమ ఓటు బ్యాంకుపైనే కాంగ్రెస్ఆధారపడింది. గతంలో సాధించిన 61 వేల ఓట్లు తమకు వచ్చినా గెలుస్తామనే ధీమాతో ఉంది.
దీనిలో భాగంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉన్నా.. ప్రస్తుతం ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనుకుంటున్నారు. పలువురిని పేర్లను పరిశీలిస్తున్న టీపీసీసీ సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుతున్నారు.
పలువురి పేర్లు పరిశీలన..
శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంపై తీవ్రంగా చర్చించినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. కరీంనగర్డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ప్యాట రమేష్ పేర్లను కూడా చర్చించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దించాలనుకుంటే కవ్వంపల్లి సత్యనారాయణ పేరును పరిశీలించారు. కానీ, కోర్ కమిటీలో ఎక్కువగా కొండా సురేఖను దింపాలని సూచించారు. అయితే, స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలని కూడా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
బలం తేల్చుకోవాల్సిందే..!
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ ఎదుర్కోబోతున్న తొలి కీలక ఎన్నిక ఇదే. దీంతో, ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది. గౌరవప్రదమైన ఓట్లు సాధించి టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీని కోసం వర్గాల వారీగా అంచనాలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.
ఈ పరిస్థితిలో ఎవరిని పోటీకి దించితే బాగుంటుందనే విషయంపై కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. అయితే బీసీ సామాజిక వర్గాన్ని రంగంలోకి దించాలనుకుంటే కొండా సురేఖను పోటీకి దింపాలనుకుంటున్నారు. రెండు సామాజికవర్గాల మద్దతుతో పాటుగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నారు. ఒకవేళ కేసీఆర్ దళితబంధు పథకానికి కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తే కవ్వంపల్లి సత్యనారాయణకు ఛాన్స్ ఉంటుందని, రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటే కృష్ణారెడ్డి పోటీలో ఉంటారంటున్నారు.
వీరిలో కొండా సురేఖకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోవాలంటే బలమైన నేతను బరిలోకి దించాలని, కొండా సురేఖ అయితేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు సీట్లును ఆశిస్తున్న కొండా దంపతులు.. ఆ పార్టీ నుంచి హామీ వస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం సాగుతోంది.
రేవంత్ నిర్ణయం కోసమే వెయిటింగ్..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను ధీటుగా చేయాలనే లక్ష్యంతో టీపీసీసీ పని చేస్తుందని ఇటీవలే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిలో భాగంగా స్థానిక నేతలకు అవకాశాలిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై దృష్టి పెట్టారు. అయితే హుజురాబాద్ఉప ఎన్నిక అంశంలో కొండా సురేఖ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొంత సంశయించిన కొండా సురేఖ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయం ప్రకారమే పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని కోర్‌కమిటీతో పాటు నాయకులు రేవంత్‌రెడ్డికి కూడా వివరించినట్లు చెప్పుతున్నారు. త్వరలోనే దీనిపై టీపీసీసీ సమిష్టి నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్పుతున్నారు.