కోనసీమను వణికిస్తున్న కొత్త భయం 

by srinivas |   ( Updated:2020-08-10 12:09:48.0  )
కోనసీమను వణికిస్తున్న కొత్త భయం 
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ అందాలు కళ్ళను ఆకడితే… అక్కడివారి గాథలు మాత్రం కళ్ళను చెమరుస్తాయి. ప్రకృతి సహజసిద్ధ అందాలకు కోనసీమ నెలవు. కానీ ఈ ప్రాంతాన్నంతా ఆగష్టు భయం కమ్మేసింది. ప్రతియేటా వరద ముప్పుకు వణికే జనాలకు ఈ ఏడాది కరోనా పీడ అదనంగా వచ్చి పడింది.

ప్రతి సంవత్సరం ఆగస్ట్ లో గోదారికి వచ్చే వరదలు ఈ సారి కోనసీమ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాలొస్తే గ్రామాలను ముంచెత్తే నదీ పాయల మధ్యలో ఉండే లంక గ్రామాల ప్రజలు ఎన్నో వరదలను చూసారు. వరద సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు జనజీవనం కూడా స్థంభిస్తుంది. ఈ కారణంగా అధికారులు వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు.

వరద ప్రభావం తగ్గుముఖం పట్టేవరకు ఆ జనమంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రాల్లోనే తల దాచునేవాళ్ళు. ఇక్కడే కోనసీమ వాసుల్లో టెన్షన్ మొదలైంది. జనాన్ని ఒకే చోట పునరావాస కేంద్రాల్లో ఉంచితే కరోనా మహమ్మారి బారిన పడతామేమో అనే భయం పట్టుకుంది ప్రజల్లో.

గడచిన మూడు దశాబ్ధాల తరువాత గతంలో ఎన్నడూ లేనంతగా గోదావరికి వరద వచ్చి పడింది. వరద సమయాల్లో రవాణ వ్యవస్ధ లేని కొన్ని లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ఇప్పటికి రాకపోకలు సాగిస్తుంటారు. రెండేళ్ల క్రితం ఐ పోలవరం మండలం పశువుల్లంక రేవులో బోటు మునిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధులు, ఓ మహిళ మృతి చెందగా… ఒక విద్యార్ధిని మృత దేహం ఆచూకి ఇప్పటికీ లభించలేదు.

ఆ ప్రమాదం తరువాత అప్పటి టీడీపీ ప్రభుత్వం పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణం చేపట్టింది. అయితే కోటిపల్లి, ముక్తేశ్వరం, కనకాయలంక, ఊడుమూడిలంక వంటి లంక గ్రామాల ప్రజలు ఇప్పటికీ నాటు పడవలనే ఉపయోగించడం గమనార్హం.

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వచ్చే వరదల నుంచి ఎలా బయట పడాలని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినా అక్కడ కిక్కిరిసిపోయిన జనం మధ్యలో కరోనా వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేపట్టి రవాణా, ఆహారం, మందులు సిధ్దం చేయాలని కోనసీమవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed