టీచర్ల ఫైల్ పై కేసీఆర్ సైన్ చేయడు గానీ.. కాంట్రాక్టు ఫైళ్లయితే చేస్తడు

by Sridhar Babu |
Kodhandaram-11
X

దిశ, ముషీరాబాద్: నిరంకుశ ప్రభుత్వ పాలనలో సమస్యలు చెప్పుకోలేక, ప్రశ్నించలేక ఉద్యోగ, ఉపాధ్యాయులు మౌనంగా ఉంటున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు. గతంలో పే రివిజన్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ పాలన స్తంభింపచేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామిక పాలనతోనే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న విద్యరంగ, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య కోదండరాం, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్, ఆచార్య లక్ష్మీనారాయణలు పాల్గొని మద్దతు పలికారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్ పోస్టులు తక్కువ.. కాంట్రాక్ట్ స్టాప్ ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ప్రతి పాఠశాలలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాఠశాలల్లో పారిశుద్ద్య కార్మికులు లేకపోవడంతో టీచర్లే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టు అయితే ఆగమేఘాల మీద సమస్యలు పరిష్కరిస్తుందని, విద్యారంగ సమస్యలు కాంట్రాక్టు విషయం కాదు కాబట్టి పరిష్కరించిన పాపాన పోలేదని ఆరోపించారు. సంఘటితమై పోరాడితే పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. రాజకీయంగా పాలకులు ఎంత అస్థిరంగా ఉంటారో అది మనకు అవకాశంగా భావించాలన్నారు. ఇప్పుడు రాజకీయ అస్థిరత్వం కనిపిస్తుందని దీన్ని వినియోగించుకోవాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

అమలుకు నోచుకోని కేజీ టూ పీజీ ఉచిత విద్య: ఆచార్య హరగోపాల్

విద్యా, వైద్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలో ఉండాలని ఆచార్య హరగోపాల్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం డీటీఎఫ్ తప్ప మిగతా సంఘాలు ఎందుకు, ఎవరి కోసం పనిచేస్తున్నాయో వారే ఆలోచించుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు వస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగం బలోపేతానకి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యరంగం నిర్లక్ష్యానికి గురవుతుంది: ఆచార్య కె.లక్ష్మీనారాయణ

తెచ్చుకున్న తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని ఆచార్య కె.లక్ష్మీనారాయణ అన్నారు. పాఠశాలల మూసివేత ప్రభుత్వ విధానంగా మారిందని, ఉపాధ్యాయుల సర్దుబాటు, హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వ పాటశాలలను మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా పాలనలో విద్యారంగానికి బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 17శాతం నిధులను కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 13 శాతం కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 శాతానికి నిధులను తగ్గించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్థుత బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 5శాతం మాత్రమే కేటాయించడం చూస్తే విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్న విషయం స్పష్టమవుతుందన్నారు.

తెలంగాణలో నాణ్యమైన విద్య లేదని, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలే కేకుండా పోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై విద్యా పరిరక్షణ ఉద్యమం పేరుతో నవంబర్ 11 నుంచి జనవరి 3 వరకు సమావేశాలు నిర్వహించి ఉద్యమంగా మలచబోతున్నామని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా శిబిరాన్ని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య చక్రధర్ రావు, పాలమూరు అధ్యయన వేదిక బాధ్యులు రాఘవాచారి, సీపీఐ నాయకులు బాలమల్లేష్, సీపీఎం న్యూడెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరావు, పౌరహక్కుల వేదిక నాయకులు లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు రవి చంద్రలు సందర్శించి తమ మద్దతు తెలిపారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, నాయకులు నారయణ రెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, సోమయ్య, రాజిరెడ్డి, భాస్కర్, వెంకట్రాములు, అలీం, చంద్రమౌళి, శాంతన్, రామక్రష్ణ, వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీటీఎఫ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed