ఈటల ఎఫెక్ట్.. ఎమ్మెల్యే దాసరి, పుట్ట మధును కేసీఆర్ టార్గెట్ చేశారా.?

by Anukaran |   ( Updated:2021-08-05 03:21:05.0  )
ఈటల ఎఫెక్ట్.. ఎమ్మెల్యే దాసరి, పుట్ట మధును కేసీఆర్ టార్గెట్ చేశారా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఆయనకు నచ్చితే అందలమెక్కిస్తారు.. నచ్చకపోతే పాతాళానికి తొక్కేస్తారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఈటల రాజేందర్ ​ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈటలకు అనుకూలంగా ఉన్న నేతలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈటలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇన్​చార్జి పుట్ట మధులకు టీఆర్ఎస్ హైకమాండ్ పొమ్మనకుండా పొగపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లీడర్లకు, క్యాడర్‌కు సంకేతాలు పంపినట్టు సమాచారం.

అయితే, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, పెద్దపల్లి జడ్పీ​ చైర్మన్ ​పుట్ట మధు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితులు. తనపై ఆరోపణలు వచ్చిన అనంతరం ఈటల తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పుట్ట మధు ఈటలను రహస్యంగా కలిసి వచ్చాడనే వార్తలు జిల్లాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బాస్.. పుట్ట మధును టార్గెట్ చేశారు. సడెన్‌గా లాయర్ వామన్ రావు హత్య కేసు ఉదంతం బయటకు తీయడం.. ఆ తర్వాత పోలీసులు మధును అదుపులోకి తీసుకొని విచారించడం వెనుక టీఆర్ఎస్ ​హైకమాండ్​ ఉందని.. ఈటలకు మద్దతిస్తే ఏం జరుగుతుందో బెదిరించి వదిలిపెట్టిందనే చర్చ జరిగింది. అప్పటి నుంచి పుట్ట మధు పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు.

ఇదిలా ఉండగా.. ఇటీవల మంత్రి కేటీఆర్ ​పుట్టినరోజు సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్​కుమార్​పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం పలు అనుమానులకు దారితీసింది. సంతోష్ కుమార్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా సుల్తానాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. అనంతరం పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా గోదావరిఖనికి వెళ్లిన సంతోష్ రామగుండం ఎమ్మెల్యే చందర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి, కార్యక్రమానికి పుట్ట మధు రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే దాసరితో కూడా సంతోష్ కనీసం మాట్లాడకపోవడం, కలవకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ ​తీసుకోవడానికే ఎంపీ సంతోష్ వచ్చినట్లు చర్చ జరిగింది. అప్పటి నుంచి ఇక ఈ ఇద్దరు నాయకులను టీఆర్ఎస్ ​పక్కన పెట్టినట్లే అనే చర్చ ఊపందుకుంది.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనే సుప్రీం అని టీఆర్‌ఎస్ ​హైకమాండ్ ​ఎన్నో సందర్భాల్లో బల్ల గుద్ది మరీ చెప్పింది. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే విషయంలో అధికార పార్టీ ఆ రూల్‌ను అటకెక్కించింది. పెద్దపల్లి నియోజకవర్గంలో హై కమాండ్ ఎమ్మెల్యే దాసరిని పక్కనపెట్టి తెరపైకి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును తీసుకువచ్చింది. ఈ క్రమంలో చిన్న, పెద్ద లీడర్ అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్‌గా భాను ప్రసాద్​రావు దగ్గరికో, హైకమాండ్ దగ్గరకో పోతున్నారు. ఇటీవల టీఆర్​ఎస్​మున్సిపల్​​ ఫ్లోర్​ లీడర్​ కొలిపాక శ్రీనివాస్​ ఓ కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓ సీఐ, ఓ విలేకరి కలిసి కోటి రూపాయలు డిమాండ్​ చేస్తున్నారని కమిషనర్​ను కలిశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే కోడలు, ప్రస్తుత మున్సిపల్ ​చైర్ పర్సన్​ను యునానమస్​ చేయడంలో శ్రీనివాసే కీలకపాత్ర పోషించారు. అలాంటి కౌన్సిలర్​ ఎమ్మెల్యే తో సంబంధం లేకుండా డైరెక్ట్​గా కేటీఆర్​ దగ్గరకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం టీఆర్​ఎస్​లో చర్చకు దారితీసింది. ఇలా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే టీఆర్ఎస్ హై కమాండ్ వీరిద్దరినీ పూర్తిగా పక్కన పెట్టేసిందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే హుజురాబాద్ బై ఎలక్షన్ కోసం వీరి పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story