- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రోజుకో మాట.. భయాందోళనల్లో ప్రజలు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3900 దాటాయి. ఈ వ్యాధి కారణంగా 148 మంది చనిపోయారు. తొలుత ‘జస్ట్ పారాసిటమాల్ గోలీ వేసుకుంటే చాలు.. మన తెలంగాణకు వైరస్ అస్సలే రాదు… వైరస్ 22 సెంటీగ్రేడ్ డిగ్రీలు దాటితే బతకనే బతకదు.. మాస్కులు అక్కరే లేదు.. రాష్ట్రంలోకి కరోనాను రానియ్యం…’ లాంటి వ్యాఖ్యలు మొదలు ఇప్పుడు ‘మాస్కు తప్పనిసరి’, ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’, ‘ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి’ అనే దాకా వచ్చింది. ‘లాక్‌డౌన్ తప్ప వైరస్ కట్టడికి మరో మార్గం లేదు.. ప్రజల ప్రాణాల కన్నా ఏదీ విలువైంది కాదు.. డబ్బులు పోతే ఇయ్యాల కాకుంటే రేపు వస్తాయి… కానీ ప్రజల ప్రాణాలు రావు…’ అని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆదాయం కోసం కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంక్షలను సడలించక తప్పడంలేదని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో సందర్భానుసారంగా మారుతున్న ప్రభుత్వ విధానం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.
‘విదేశీ విమానాలను నిలిపివేయాలి, రైలు సర్వీసులు ఇప్పుడే వద్దు, లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలి…’ లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. లాక్‌డౌన్ పటిష్టంగా అమలైనంతకాలం కేసులు అదుపులోనే ఉన్నాయి. ఏప్రిల్ చివరికల్లా కొత్త కేసులు రావని, మే మొదటివారంకల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరోనాకు మందు లేదు… వ్యాక్సిన్ రాలేదు… ప్రాణాంతకమైన వ్యాధికి గురి కాకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు రెండు చేతులూ జోడించి విజ్ఞప్తి చేశారు.
లాక్‌డౌన్ ఆంక్షలు సడలుతున్నకొద్దీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. మూడో విడత లాక్‌డౌన్ ముగిసే నాటికి (మే 17) రెండున్నర నెలల వ్యవధిలో రాష్ట్రంలో 1,551 కరోనా పాజిటివ్ కేసులు వస్తే మరుసటి రోజు సడలింపులు అమలులోకి వచ్చిన తర్వాత మూడు వారాల వ్యవధిలో సుమారు రెండున్నర వేల కేసులు అదనంగా నమోదయ్యాయి. ఇక మరణాలు సైతం 34 నుంచి 148కి చేరుకున్నాయి. సడలింపులు పెరుగుతున్న కొద్దీ కేసులు ఊహించనంతగా పెరుగుతున్నాయి. కరోనాతో సహజీవనం తప్పదని, ప్రజలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని పాలకులు పిలుపునిస్తున్నారు. కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగానే సినిమా షూటింగులు చేసుకోవడానికి, షాపింగ్ మాల్స్ లాంటివి తెరుచుకోడానికి అనుమతులు రావడం గమనార్హం.
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పలు వైపుల నుంచి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. టెస్టులు తక్కువగా చేయడంపై కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రానికి ఘాటుగా లేఖ రాశారు. ఆ తర్వాత టెస్టుల సంఖ్య, దాంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. రాష్ట్ర హైకోర్టు సైతం కరోనా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజూ విడుదల చేసే బులెటిన్‌లలో తప్పుడు లెక్కలు రావడంపైనా సీరియస్ అయింది.
అసెంబ్లీ వేదికగా, మీడియా సమావేశాల సాక్షిగా చేసిన కామెంట్లు, ఇప్పుడు అందుకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు తదితరాలపై ప్రస్తుతం ప్రజల మధ్య జోరుగానే చర్చ జరుగుతోంది. ఒకవైపు ఆస్పత్రుల్లో సౌకర్యాలు అధ్వాన్నంగా ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్న సమయంలో కరోనా పాజిటివ్ ఉన్నా లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండాలని చెబుతూ డిశ్చార్జి చేస్తున్నారు వైద్యులు. మార్చి 2న రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది మొదలు ఇప్పటివరకు సీఎం చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఓసారి పరిశీలిద్దాం.
మార్చి 7 : (అసెంబ్లీలో) జస్ట్ పారాసిటమాల్ గోలీ వేసుకుంటే చాలు. అంతకుమించి ఏమీ అక్కర్లేదు. వైరస్ 22 సెంటీగ్రేడ్ డిగ్రీలు దాటితే బతకనే బతకదు. మాస్కు కట్టుకోకుంటే మనం సచ్చిపోతమా?
మార్చి 24 : (మీడియాతో) కరోనా ఒక భయంకరమైన వ్యాధి. దానికి ఇప్పటి వరకు మందు లేదు. లాక్‌డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలి. లేకుంటే ఆర్మీని దింపి ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు ఇవ్వడం లేదా కర్ఫ్యూ విధించక తప్పదు.
మార్చి 29 : ఏప్రిల్ 7 కల్లా రాష్ట్రంలో కొత్త కరోనా కేసులేవీ నమోదుకావు. ఇప్పటి వరకూ క్వారంటైన్‌లో ఉన్నవారు కోలుకుని ఇండ్లకు వెళ్లిపోతారు.
ఏప్రిల్ 6 : ఏప్రిల్ 14తో ముగుస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు పొడిగించాలి. లాక్‌డౌన్‌ను మించిన ఆయుధం లేదు.
ఏప్రిల్ 10 : ఇంటి గడప దాటి బయటకు వస్తే విధిగా మాస్కు ధరించాల్సిందే.
ఏప్రిల్ 19 : కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో అమలుచేయడంలేదు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది.
ఏప్రిల్ 27 : వారం రోజుల్లో కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. కొత్త కేసులు సింగిల్ డిజిట్‌లోకి వచ్చాయి. మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.
మే 11 : కరోనాతో సహజీవనం తప్పదు. అది మనల్ని వదిలిపోదు. దానికి మందు, వ్యాక్సిన్ లేదు. వైరస్‌తో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలి.
మే 16 : ఈ వైరస్ ఎంత కాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా వైరస్ లేదు.
జూన్ 8 : కరోనా విషయంలో ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలె. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.