కాంగ్రెసోళ్లు పగటి వేషగాళ్లు: కర్నె

by Shyam |   ( Updated:2020-05-13 11:16:03.0  )
కాంగ్రెసోళ్లు పగటి వేషగాళ్లు: కర్నె
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్, బీజేపీ‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ది కోసం గుంటకాడి నక్కల్లా వ్యవహరిస్తున్నారని, వారి హయాంలో ప్రాజెక్ట్‌లను పెండింగ్‌లో పెట్టారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ వైఖరి ఒక్కటే అయితే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏపీ కాంగ్రెస్ నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పగటి వేషగాళ్లలా మారారని, బీజేపీ నాయకులకు వింత ఆలోచనలు వస్తాయని మండిపడ్డారు. బీజేపీకి చిత్తుశుద్ధి ఉంటే కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని న్యాయం ఎవరిదో తేల్చాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇతర రాష్ట్రాలకు నీళ్లు తరలిస్తుంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు హారతులు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ పాపాలకు పరిహారం చెల్లించుకోవాలంటే నీళ్ల వాటాపై ప్రభుత్వంతో కలిసి పోరాటం చేయాలని సవాల్ విసిరారు.

పోతిరెడ్డిపాడు అంశంపై టీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచి ఒకే వైఖరితో ఉందని, కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమన్నారు. నీళ్ల తరలింపుపై నాటి వైఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన చరిత్ర టీఆర్ఎస్‌కు ఉందన్నారు. ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ పలుమార్లు హెచ్చరించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఈనెల 5న తీసుకువచ్చిన జీవోపై కేసీఆర్ సమీక్ష నిర్వహించి రాష్ట్ర వైఖరిని స్పష్టం చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed