కరీంనగర్ : ఆ వీధుల్లో వెళ్లాలంటే విషమ పరీక్షే..!

by Sridhar Babu |
కరీంనగర్ : ఆ వీధుల్లో వెళ్లాలంటే విషమ పరీక్షే..!
X

దిశ, కరీంనగర్ సిటీ : నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది కరీంనగర్ నగర పాలక సంస్థ యంత్రాంగం పని తీరు. ఓ వైపు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వికృతరూపం దాల్చగా, మరోవైపు నగరంలోని పలుచోట్ల రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డాక్టర్స్ స్ట్రీట్‌తో పాటు, ఆ ఏరియాకు వచ్చే ప్రధాన రోడ్లు తవ్వి రహదారులు, మురికి కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ప్రారంభించిన పనులు శరవేగంగా పూర్తి చేయాల్సి ఉండగా, అవి కాస్త నత్తలకే నడక నేర్పుతున్నాయి. దీంతో డాక్టర్ స్ట్రీట్‌లో పేషెంట్లు, అటెండెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఓ చోట రోడ్డు పనికి తవ్వటం, మరో చోట మురికి కాల్వకోసం తవ్వటం, ఇంకో చోట మంచినీటి పైప్ లైన్ కోసం తవ్వి వదిలేయడంతో తరుచూ ట్రాఫిక్ జాం అవుతోంది. ఆస్పత్రుల ముందు పేషెంట్లను తరలించేందుకు వచ్చిన వాహనాలు, మరో పక్క ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి బంధువుల ఎదురు చూపులతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి.

మట్టికుప్పల పక్కనే వాహనాల పార్కింగ్‌తో డాక్టర్ స్ట్రీట్ ప్రాంతంలో నవడమూ కష్టంగా మారింది. నగరంలోని సివిల్ ఆస్పత్రి వెనుక వైపు, క్రిస్టియన్ కాలనీ, రాజా థియేటర్ వైపు గల రోడ్ల తవ్వకాలు నిత్యకృత్యంగా మారగా, స్మార్ట్ సిటీలో భాగంగా కొనసాగుతున్న పనులు కాంట్రాక్టర్ల పనితీరుకు నిలువుటద్దంగా దర్శనమిస్తున్నాయి. నిరంతరం అంబుల్లెన్సుల సైరన్‌లతో దద్దరిల్లే ఆ వీధులన్నీ ప్రస్తుతం జెసీబీల తవ్వకం, ట్రాక్టర్లతో మట్టి తరలింపుతో బిజీగా మారాయి. దీంతో అనారోగ్యం బారిన పడ్డ వారిని చికిత్సకు తరలించడం గగనంలా మారిపోయింది. నిర్మాణ పనులతో ఇరుకుగా మారిన ఈ రోడ్ల మీదుగానే సాధారణ వాహనాల రాకపోకలను కూడా అనుమతించారు. దీంతో అనేక మంది రోగులు ఆస్పత్రి సమీపంలోకి వచ్చిన తరువాత ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంటున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలూ లేకపోలేదు. రోగాలు, ప్రమాదాల బారిన పడ్డ వారికి వైద్య చికిత్సలందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు, పలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రతిరోజు 200 నుంచి 300 వరకు అంబులెన్సులు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. రోడ్ల పనులను నెమ్మదిగా కొనసాగిస్తుండగా ఆయా ప్రాంతాల మీదుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రధానంగా డా.భూంరెడ్డి ఆస్పత్రి రోడ్డుతో పాటు, సెవెన్ హిల్స్ ఎదురు రోడ్డు నుంచి వెళ్లాలంటే చుక్కలు చూడాల్సి వస్తోంది. రోడ్లపై, మురికి కాల్వల కోసం తవ్విన మట్టి తొలగించకపోవటంతో ట్రాఫిక్ జామ్ అవుతూ 500 గజాల దూరం వెళ్లేందుకు ఒక్కోసారి అరగంట నుంచి ముప్పావు గంట వరకు పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కేసులతో పాటు నాన్ కరోనా రోగులకు వైద్య చికిత్సల కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా రోగులు ఇక్కడి ఆస్పత్రులకు వస్తుంటారు. అయితే, నెలల తరబడిగా పనులు నడుస్తుండగా, ఆస్పత్రులకు వెళ్ళటం ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు జరుగుతున్న పనులతో వస్తున్న దుమ్ము, ధూళి పక్కనే ఉన్న ఆస్పత్రుల్లోని రోగులకు చేరి కొత్త రోగాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఆస్పత్రుల్లో చేర్పించిన పేషెంట్ల తాలుకు బంధువులు కూడా రోడ్లపైనే ఉంటుండంతో దుమ్ము వల్ల వారూ కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా కట్టడిలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాల్సిన నగర పాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనారోగ్యాల బారిన పడ్డ వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుండటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నగర పాలక వర్గం స్పందించి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాల్సినా అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed