కరీంనగర్ అధికారుల మాయ.. ఆ వెబ్‌సైట్‌కు లక్షలు చెల్లించి..

by Sridhar Babu |   ( Updated:2021-08-27 07:31:25.0  )
Karimnagar
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ‘తెలంగాణకు హరితహారం’ వెబ్ సైట్‌ను రూపొందించింది. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సైతం ‘కరీంనగర్‌కు హరితహారం’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న హరితహారం పనులను, మొక్కల సంఖ్యను ఎప్పుడూ అప్డేట్ చేస్తూ అందరికీ తెలిసేలా 2017లో యాప్‌ని డెవలప్ చేయించారు.

అయితే యాప్ డెవలప్ చేసి మూడేళ్లు దాటినా అది నేటికీ పనిచేయడం లేదు. దీనిని గుర్తించిన కరీంనగర్ పట్టణానికి చెందిన సామాజికవేత్త మహమ్మద్ శహబుద్దిన్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో 2019 సెప్టెంబర్ 9న గ్రీవెన్స్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు స్పందిస్తూ అదే నెల 26న యాప్ పనిచేసే విధంగా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తిరిగి మరోసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్‌కు గతేడాది సెప్టెంబర్ 08న గ్రీవెన్స్ ద్వారా సమస్యను తెలిపారు. దీనిపై స్పందించిన చీఫ్ ఇంజనీర్ అదే నెల 17న యాప్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఉన్నతాధికారులు ఆదేశించిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని శహబుద్దిన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేయడం సరికాదన్నారు. యాప్ డెవలప్మెంట్ పేరుతో రూ.2.50లక్షలు డ్రా చేసి, దాని పనితీరును గాలికొదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు 2017, జూన్ 09న రూ.లక్ష( చెక్ నెం- 902347), 2017, అక్టోబర్ 24న రూ.1.50 లక్షలు( చెక్ నెం- 245300) రెండు సార్లు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed