మీకు దమ్ముంటే నన్ను ఆపండి: కంగనా

by Anukaran |
మీకు దమ్ముంటే నన్ను ఆపండి: కంగనా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తన హాట్ కామెంట్స్‌తో సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ఆమె ఇటీవల ముంబైకి రావాలంటే అసురక్షితమైన ప్రాంతం అంటూ వ్యాఖ్యలు చేసింది. ముంబై‌ నగరం ఏమైనా పాక్ ఆక్రమిత కశ్మీరా అంటూ ప్రశ్నిచండంతో దుమారం రేగుతోంది. ఇప్పటికే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆమెకు బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అయితే, శుక్రవారం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనా పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమెకు అసురక్షితం అనిపిస్తే రాకుండా ఉండటమే మేలు అని అభిప్రాయపడ్డారు. కంగనా రనౌత్‌కు ఇక్కడ జీవించే, నివసించే హక్కు లేదన్నారు. ప్రభుత్వం, పోలీసులను కించపరిచేలా మాట్లాడిన ఆమె పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనిల్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన కంగనా రనౌత్.. పీవోకే నుండి తాలిబన్ వరకు ఒక రోజులోనే తన ప్రజాస్వామ్య హక్కులపై హోంమంత్రి తనదైన పిలుపునిస్తున్నారని ట్వీట్ చేశారు.

అంతకు ముందు ట్వీట్‌లో.. తాను ముంబైకి వస్తే సాధువులను రోడ్డు మీద రాడ్లు, రాళ్లతో కొట్టి చంపినట్టు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే వచ్చే వారం సెప్టెంబర్ 9 న ఎలాగైనా ముంబైకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని కంగనా స్పష్టం చేశారు. ముంబై విమానాశ్రయంలో దిగే సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని.. ‘మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి’ అంటూ కంగనా సవాల్ విసరడం గమనార్హం.

Advertisement

Next Story