- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క మాట.. దేశాన్ని ఏకం చేసింది!
సత్నాకులం ఘటన, ట్యుటికోరిన్ ఘటన, జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనిక్స్.. ఇలా పేరు ఏదైనా సంఘటన ఒక్కటే. ఇప్పుడు ఇది దేశంలోనే కాదు, ప్రపంచమంతా మార్మోగే అతిపెద్ద సమస్యగా పరిణామం చెందబోతోంది. అందుకు కారణం సింగర్, ఆర్జే సుచిత్ర పెట్టిన వీడియో. ఆ వీడియోలో ఆమె అన్న ఒకే ఒక్క మాట, ఇప్పుడు దేశం మొత్తాన్ని ఏకం చేస్తోంది. భారతదేశమంటే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మాటను అందరూ రుజువు చేస్తున్నారు. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలే వెతకాలని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ ఇంటర్నెట్ వారధిగా ఇప్పుడు క్రూరత్వాన్ని ఖండిస్తూ అందరూ ఒకే తాటి మీద నడిచే అవకాశం దొరికింది. ఈ సత్నాకులం ఘటనలోనూ అదే జరుగుతోంది. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ ఘటన ప్రపంచమంతా ఎలా వైరల్ అయిందో.. అదే స్థాయిలో ఈ ఘటన కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.
ఎక్కడో మారుమూల దక్షిణ భారతదేశంలో జరిగిన ఈ హింసాత్మక ఘటన గురించి ప్రపంచమంతా తెలియాలంటే ఏర్పడే ప్రధాన సమస్య భాషా భేదం. ఆ భాష అడ్డుగోడను సుచిత్ర తన వీడియోతో బద్ధలు కొట్టింది. ఆ వీడియో మొదటి మాటగా ఆమె ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ‘నేనొక దక్షిణ భారతీయురాలిని, భాషా భేదం వల్ల దక్షిణ భారతదేశంలో జరిగే వికృత సంఘటనలన్నీ దక్షిణ భారత సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. అందుకే ట్యుటికోరిన్‌లో జరిగిన సమస్యను నేను అందరికీ అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో వివరిస్తాను’ అని ఆమె ఆ ఘటన గురించి వీడియోలో కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. ఘటన హేయమైన చర్య అయినప్పటికీ, దక్షిణ భారతీయుల సమస్యలు భాషా భేదం వల్ల ఇక్కడే మగ్గిపోతున్నాయనే మాట ఉత్తర భారతీయుల మనసులకు గట్టిగా తగిలింది. అందుకే ఈ భూభాగ విభేదాలను పక్కకు పెట్టి, మానవతా దృష్టితో సుచిత్ర వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.
అయితే ఈ వీడియోను మొదటగా దక్షిణ భారత ప్రముఖులే తమ ఖాతాల్లో షేర్ చేయడం విశేషం. తర్వాత నెమ్మది నెమ్మదిగా షేర్ అవుతూ అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా వరకు చేరింది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడు కేవలం దక్షిణ భారత సమస్యగా కనిపిస్తున్న ఈ సత్నాకులం ఘటన.. మొత్తం ప్రపంచ సమస్యగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం వివక్ష. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో ఇంత దారుణంగా ఇద్దరిని పొట్టన బెట్టుకున్న పోలీసుల దాష్టీకం మీద ప్రపంచం గొంతెత్తుతోంది. ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ ఘటన కారణంగా అమెరికా అల్లకల్లోలం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ మన భారతదేశంలో ఈ ఘటన దావానంలా వ్యాపించి అన్యాయం జరిగిన తండ్రీకొడుకులకు న్యాయం జరిగే వరకు కొనసాగేలా కనిపిస్తోంది.
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను దక్షిణ భారతం, ఉత్తర భారతం అనే తేడాలు లేకుండా భారతదేశ సమస్యగా పరిష్కరించి ఒక చట్టాన్ని తీసుకొచ్చే స్థాయిలో పోరాటం చేశారు. అదే స్థాయిలో దక్షిణ భారతంలో జరిగిన ఈ ఘటనను దేశ సమస్యగా పరిగణించాలని సుచిత్ర ఆ వీడియోలో కోరారు. అయితే ఆమె మాటలను విమర్శించిన వారు కూడా లేకపోలేదు. దేశంలో ఎన్ని రకాల వివక్షలు ఉన్నా.. భాషా, సంస్కృతి విషయంలో ఎవరూ వివక్ష చూపించలేదని, ఉత్తర భారతీయులెప్పుడూ దక్షిణ భారత సమస్యలను చులకనగా చూడలేదని, అయినా మానవత్వం ఉన్న వాళ్లెవరూ వికృత చేష్టలకు పాల్పడరని.. కుల, మత, భాషాభేదాలను చూపించరని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో ‘తమిళ్ తెలియని వాళ్లకోసం’ అని సుచిత్ర అన్నారే తప్ప ఉత్తర భారతీయుల కోసం మాత్రమే అని ఆమె అనలేదు. కాబట్టి తమిళం తెలియని వారు అంటే అదే దక్షిణ భారతదేశంలో ఉండే తెలుగు, కన్నడ, మలయాళ ప్రజలు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమె భాషా విభేదాలనే మాటలను తప్పుబట్టడం మానేసి, అసలైన సమస్య మీద దృష్టిసారించాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఈ సమస్య పెద్దమొత్తంలో అందరికీ తెలిసి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగి, తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాలని ఆశిద్దాం!