20 రోజులు మృత్యువుతో పోరాడి.. నేల రాలిన మరో జర్నలిస్ట్

by vinod kumar |
Journalist Chandrasekhar
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారికి మరో జర్నలిస్ట్ ప్రాణాలు వదిలాడు. సాహో టీవీ నిర్వాహకుడు ముడావత్ చంద్రశేఖర్ (క్రైం చందు) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సీనియర్ క్రైం రిపోర్టర్‌గా పేరొందిన చందు గతంలో 10 టీవీ, హెచ్ఎంటీవీ, వై టీవీ, నంబర్ వన్ న్యూస్ చానెల్స్‌లో క్రైం రిపోర్టర్‌గా చేశాడు. ఆ తర్వాత తానే స్వయంగా సాహో టీవీ అనే యూట్యూబ్ చానెల్‌ను నెలకొల్పి నడిపిస్తున్నాడు.

Chandrasekhar

ఇటీవల ఆయన తల్లి, భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారు హోం ఐసోలేషన్ లో ట్రిట్ మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే చందుకు కరోనా సోకింది. మొదట జ్వరంతో బాధపడిన చందు.. అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యాడు. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో కన్నుమూశారు.

చందుకు భార్య, ఇద్దరు పిల్లలతోపాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నది. చందు చిన్నతనంలోనే ఆయన తండ్రి దూరమయ్యారు. ప్రస్తుతం చందు మరణంతో ఆయన పిల్లలు కూడా మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడం విషాదంగా మారింది. ఆ కుటుంబానికి చందే ఆధారం. ఆయన అకాల మృతితో దిక్కులేని వారయ్యారు వారంతా. కొడుకంటే ప్రాణంగా ప్రేమించే చందు తల్లికి ఆయన చనిపోయిన విషయం ఇప్పటి వరకు తెలియలేదు. కొడుకు కోలుకోని వస్తాడని ఇంకా గేటు వైపే ఎదురు చూస్తోంది.

Advertisement

Next Story