నవరత్నాలు నేరుగా అందితే ఓటెవరికేస్తారు?: బాబుతో జేసీ

by srinivas |
నవరత్నాలు నేరుగా అందితే ఓటెవరికేస్తారు?: బాబుతో జేసీ
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్‌రెడ్డికి సూటిగా మాట్లాడుతారని పేరు. వివిధ అంశాలపై ఆయన సూటిగా స్పష్టంగా స్పందిస్తారు. కాంగ్రెస్‌లో ఉండగా పలు సందర్భాల్లో అలా మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్న జేసీ టీడీపీలోకి వచ్చిన తరువాత మరింత దూకుడైన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తాజాగా ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడిన అంశాలను మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికల్లో పోటీ చేయడం అనవసరం, పోటీ చేసి డబ్బులు వదిలించుకుని, జైలుకెళ్లడం మినహా ఎలాంటి ప్రయోజనం లేదని వివరించానన్నారు. అయినప్పటికీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనని ఆదేశించారని చెప్పారు. అయితే ఎన్నికల్లో డబ్బు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారన్నారు. ఇవి రెండూ పంచకపోతే ఎవరూ ఓటు వేయరని చెప్పానని జేసీ వెల్లడించారు.

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చదువుకున్నవారిలో మార్పు వచ్చినప్పటికీ… కాయకష్టం చేసుకునే వారిలో మార్పు రాలేదని జేసీ అభిప్రాయపడ్డారు. వారికి నవరత్నాలు నేరుగా అందుతుండడంతో దాని ప్రభావం స్థానిక ఎన్నికల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దానికి బాబు ఈ పది నెలల పాలన చూశాక ప్రజల్లో మార్పు మొదలైందని చెప్పారన్నారు. దానికి తాను ఎవరో మీకు తప్పుడు సమాచారమిచ్చారని అన్నానని తెలిపారు. 2024లో మీరే మళ్లీ సీఎం అవుతారని, అయితే అప్పటికే రాష్ట్రం సర్వ నాశనమవుతుందని ఆయన జోస్యం చెప్పానన్నారు.

దానికి బాబు సమాధానమిస్తూ, తాను బతికుండగా రాష్ట్రాన్ని నాశనం కానివ్వనన్నారని తెలిపారు. ఒకవేళ నాశనమైనా.. మళ్లీ బాగు చేస్తానని ఆయన అన్నారని జేసీ వెల్లడించారు. 14 సంవత్సరాలు సీఎంగా, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిందేనని బాబు తనతో అన్నారని జేసీ చెప్పారు. జగన్ పాలనపై వ్యతిరేకత తారస్థాయికి వెళ్లడానికి సమయం పడుతుందని, అంతవరకు టీడీపీ శ్రేణులు ఓపిగ్గా ఎదురు చూడాలని ఆయన సూచించారు.

Tags: JC, VIJAYAWADA, JC DIWAKAR REDDY, AP POLITICS, ANANTAPUR, LOCAL BODY ELECTIONS

Advertisement

Next Story

Most Viewed