వాళ్లు కూడా నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు : కలెక్టర్

by Shyam |   ( Updated:2021-10-12 08:02:54.0  )
Jangaon Collector doctor Shiva Lingaiah
X

దిశ, జనగామ: వైద్య, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. మంగళవారం రఘునాథపల్లి మండలం కోమల్ల, నర్మెట్ట మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రాల సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. గైర్హాజరైన సిబ్బంది గురించి అడిగారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరుపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాకుండా.. గైర్హాజరు సిబ్బందికి మెమోలు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

వైద్య సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలు అందుబాటులో ఉన్నందున, ఇంటికి వెళ్లి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లోని రోగులను పరామర్శించి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు నిర్భయంగా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ప్రతీ ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలన్నారు. అర్హులందరూ కేసీఆర్ కిట్ పొందాలన్నారు. ఆరోగ్య కేంద్ర రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి మహేందర్, డీఆర్డీఓ జి.రాంరెడ్డి, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఉప జిల్లా వైద్యాధికారి అశోక్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed