ఆ ముగ్గుర్నీ కాదని.. వైవీ సుబ్బారెడ్డికి జగన్ కీలక పదవి

by Anukaran |   ( Updated:2021-06-19 03:53:48.0  )
ఆ ముగ్గుర్నీ కాదని.. వైవీ సుబ్బారెడ్డికి జగన్ కీలక పదవి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏ ఎన్నిక వచ్చినా గెలుపు కోసం వ్యూహాలు రచించడంలో ముఖ్యుడు వైవీ సుబ్బారెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించడంలో ప్రధాన పాత్ర వైవీ సుబ్బారెడ్డిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికల బాధ్యతను సైతం ఆయనే పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్‌ పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 21 నాటికి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. గతంలో ఒంగోలు ఎంపీగా గెలుపొంది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మరోసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా లేదా మంత్రిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం ఒంగోలు లోక్‌సభ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

అయినప్పటికీ నాటి ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలను భుజాన వేసుకుని.. తన సత్తా ఏంటో చూపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతో సంతృప్తి చెందారు. అయితే పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. మరో ఆరు నెలల్లో రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఎంపీగా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మండలిలో 8 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికై త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకుంటారంటూ మరో ప్రచారం జోరందుకుంది. అయితే ఎక్కడా తన మనసులో మాట బయటపెట్టలేదు వైవీ. బాబాయ్‌కి ఏ పదవి ఇవ్వాలో అబ్బాయ్‌కే తెలుసు అనుకుంటున్నారో ఏమో కానీ… వైవీ సుబ్బారెడ్డి మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

జగన్ వ్యూహమిదే…

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఏ పదవి ఇవ్వాలో అనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవి ఎంతో కీలకమైనది. టీటీడీకి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు స్వామి వారి సేవలో తరిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం పర్యవేక్షణకు వైవీ సుబ్బారెడ్డి అయితేనే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో టీటీడీలో కీలక మార్పులు తీసుకువచ్చారు వైవీ. దీంతో సంతృప్తి చెందిన సీఎం వైఎస్ జగన్ మరోసారి వైవీకే అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

తీవ్రమైన పోటీ.. బాబాయ్ వైపే మెుగ్గు

టీటీడీ చైర్మన్​ పదవి కోసం త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్​రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వైఎస్సార్​ హయాం నుంచి అడుగుతూ వస్తున్నా.. ఇప్పటికీ ఆయన కోరిక నెరవేరలేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేసేది లేదని.. చివరి అవకాశం కల్పించాలని రాజమోహన్​రెడ్డి జగన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి సైతం టీటీడీ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన కూడా టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఆయన ప్రకటించేశారు. అందుకే తనకు చివరిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త గోకరాజు గంగరాజు సైతం చైర్మన్​ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిని కాదని చైర్మన్​గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే నియమించాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story