ఐటీ.. బ్యాడ్ టైమ్ స్టార్ట్!

by Shyam |   ( Updated:2020-04-17 03:23:10.0  )
ఐటీ.. బ్యాడ్ టైమ్ స్టార్ట్!
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ ప్రభావం ఐటీ రంగంపై పడటం ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అమెరికా యూరప్‌లలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. దేశంలోని ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల రూపంలో వచ్చే వ్యాపారాన్ని దెబ్బ తీస్తోంది. ఇదే విషయాన్ని బుధవారం గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన విప్రో కంపెనీ తన గైడెన్స్‌లో వెల్లడించింది. కంపెనీలో ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లో 4,000 మంది వివిధ కారణాల వల్ల కంపెనీని విడిచిపెట్టి వెళ్లగా.. వీరి స్థానాలను మళ్లీ ఇప్పట్లో నింపడం సాధ్యం కాదని పేర్కొంది. అంతేగాక కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా కొత్త ఉద్యోగులను తీసుకోవడమూ ఇక ఈ ఏడాది ఉండబోదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతాల పెంపు ఉండదని సంకేతాలిచ్చింది. ఒక్క మార్చిలోనే ప్రాజెక్టులు క్యాన్సిల్ అవడం వల్ల 18 నుంచి 20 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది.

ఇక దేశంలో మరో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్.. మరీ ఇంత ఘాటుగా కాకపోయినా భవిష్యత్తుపై కొంత నెగెటివ్ కామెంట్సే చేసింది. ఈ కంపెనీ గత ఫైనాన్షియల్ ఇయర్ క్యూ 4 ఆర్థిక ఫలితాలను గురువారం సాయంత్రం వెల్లడించింది. అమెరికా నుంచి భవిష్యత్తులో వ్యాపారం రావడం కొంత కష్టమేనని అభిప్రాయపడింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్(జీఎఫ్‌సీ)తో కరోనా ఈవెంట్‌ను పోల్చింది. జీఎఫ్‌సీ కంటే ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. అయితే తమ కంపెనీ ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన అన్ని ఆఫర్ లెటర్లను గౌరవించి ఉద్యోగాలిస్తామని టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల సందర్భంగా కంపెనీల ఈ తరహా నెగెటివ్ కామెంటరీతో.. ఐటీ రంగమే ప్రధాన ఉద్యోగ కల్పన సెక్టార్‌గా ఉన్న హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు తమ ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అని ఆందోళన చెందుతున్నారు.

కాగా, హైదరాబాద్‌లో మొత్తం 1,500 ఐటీ కంపెనీలుండగా.. 5 లక్షల మందిదాకా వీటిలో ఉద్యోగాలు చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిపై ఆధారపడి పరోక్షంగా మరో 7 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. విప్రో కంపెనీ చెప్పినట్టుగా బిజినెస్‌లు ఎఫెక్టవడం ప్రారంభిస్తే ప్రాజెక్టుల సంఖ్య, విలువ తగ్గితే ఐటీ కంపెనీలు సడెన్‌గా ఖర్చు తగ్గించుకుంటాయని తెలుస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ పనిచేయడం ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు పోవడం స్టార్టవుతుందని లోకల్ ఐటీ కంపెనీల ఉద్యోగులు చెబుతున్నారు. ఇక చిన్న కంపెనీల విషయానికొస్తే.. రెసిషన్ వస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వారంటున్నారు. ప్రాజెక్టులు లేక ఆఫీసుల రెంట్లు కట్టలేక, జీతాలివ్వలేక దుకాణాలు బంద్ చేయడం తప్ప వాటికి వేరే మార్గం లేదని చెబుతున్నారు. దీనికి కారణం ఐటీ కంపెనీల ఖర్చుల్లో ఎక్కువ శాతం ఫిక్స్‌డ్ ఖర్చులుండటమేనని వారు విశ్లేషిస్తున్నారు. వ్యాపారం లేకపోయినా ఇవన్నీ తప్పినిసరిగా నెల తిరిగే సరికే చెల్లించాల్సిన పరిస్థితులుంటాయని పేర్కొంటున్నారు. చిన్న, చిన్న కంపెనీలు సైతం చాలా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, మాంద్యానికి ఎఫెక్టయ్యే చిన్న కంపెనీల వల్ల పోయే ఉద్యోగాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఐటీ ఉద్యోగంతో డిఫరెంట్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడ్డాం : సుమన్, కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగి

నేను గడిచిన రెండేళ్ల నుంచి ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. జీతం బాగుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బ్యాంకులు కూడా త్వరగా ఎన్ని లోన్లు కావాలంటే అన్ని లోన్లు ఇస్తున్నాయి. లైఫ్‌స్టైల్‌ అంతా మారిపోయింది. మాకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్(జీఎఫ్‌సీ) గురించి వినడమే తప్ప అనుభవం లేదు. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. ఇంత వరకు బాగానే ఉంది. ఈ వైరస్ వల్ల ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లు పెట్టి రెసిషన్‌లోకి వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెసిషన్ వల్ల ఫస్ట్ మా జాబ్సే పోతాయని అంటున్నారు. ఇదే నిజమైతే మేం దానికి మెంటల్‌గా రెడీగా లేము. లేటెస్ట్‌గా విప్రో కంపెనీ మేనేజ్‌మెంట్ మాటలు చూస్తే భయం వేస్తోంది. జీతం ఆగిపోతే ఇప్పటికే తీసుకున్న లోన్ల పరిస్థితేంటో తెలియట్లేదు.

కొత్తగా వచ్చిన వారికి జీతాలు తక్కువే ఉంటాయి : సునీల్, ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్, హైదరాబాద్

రీసెంట్‌గా కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్‌లో జాయిన్ అయ్యాను. కొత్తగా చేరిన వాళ్లకే ముందుగా జాబ్ త్రెట్ ఉంటుందని అంటున్నారు. సీనియర్లతో పోలిస్తే మాకిచ్చే సాలరీ చాలా తక్కువ. కాబట్టి మమ్మల్ని తీసేయరని, జీతాలు ఎక్కువ ఉన్నవాళ్లని మాత్రమే తీసేస్తారని కంపెనీలో అంటున్నారు. ఇప్పటికైతే మా ఆఫీసులో ఎవరి ఉద్యోగాలు పోలేదు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రాజెక్టులు తగ్గిపోయి ముందు ముందు ఏ పరిస్థితులుంటాయో నాకైతే తెలియదు. నా ఉద్యోగానికి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదు. విప్రో మేనేజ్‌మెంట్ క్యూ 4లో కొత్త ప్రాజెక్టుల గురించి, ఉద్యోగాల విషయంలో చెప్పిన మాటలు వింటే మాత్రం కాస్త భయంగానే ఉంది.

స్కిల్స్ ఉన్నవారికి ఢోకా లేదు : నవీన్ కుమార్, విప్రో

నేను సీనియర్ లెవెల్లో విప్రో కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నాకున్న డేటా అనలిటిక్ స్కిల్స్ వల్ల ఎంత రెసిషన్ వచ్చినా.. నా ఉద్యోగానికి ఢోకా ఉండదన్న నమ్మకం ఉంది. కానీ, జీతం పెంచకపోవడం, ప్రమోషన్లు లేకుండా పనిచేయాలంటే కొంత కష్టమే. మాంద్యం వస్తే పరిస్థితులని బట్టి నిర్ణయం తీసుకుంటాను. 2008 రెసిషన్ చూశాను. ఎన్నో పెద్ద కంపెనీలు ఆ మాంద్యాన్ని తట్టుకున్నాయి. పరిస్థితి కుదుటపడ్డాక మంచి జీతానికి వేరే కంపెనీకి షిఫ్ట్ అవడం.. ఐటీ ఉద్యోగాల్లో స్కిల్స్ ఉన్నవారికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. జూనియర్స్‌కు కూడా నేనే చెప్పేది ఒకటే.. ఏ కాలేజీలో చదివామన్నది, ఎన్ని మార్కులొచ్చాయన్నది జాబ్‌లో జాయిన్ అయ్యేంత వరకే పనికొస్తుంది. ఒకసారి జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకొని కెరీర్‌ను మలచుకోవడం మన చేతుల్లోనే ఉంది. మన దగ్గర డిమాండ్ ఉన్న స్కిల్ ఉన్నంత వరకు ఏ మాంద్యం ఏం చేయలేదు.

Tags : wipro results, management comments, hyderabad it, joblosses, salaries

Advertisement

Next Story

Most Viewed