- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, హరీశ్ రావు… ఆదర్శ సిద్దిపేట ఇదేనా..?
దిశ ప్రతినిధి, మెదక్: ‘అభివృద్ధిలో సిద్దిపేట రోల్ మోడల్ …. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పట్టణం సిద్దిపేట’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పలు సభలు, సమావేశాల వేదికల్లో చెప్పే మాటలివి. కోట్లాది రూపాయాలు వెచ్చించి మురుగునీటి వ్యవస్థను పారద్రోలేందుకు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొన్ని వార్డుల్లో ప్రారంభమైన చిన్న పాటి వానలకు నిండి పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల మీదికి మురుగు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని చూసిన పట్టణ ప్రజలు ఆదర్శ సిద్దిపేట ఇదేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వేసవికాలంలో వచ్చిన ఇతర మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వానాకాలంలో వస్తే మాత్రం అభివృద్ధి మాటేమోగానీ నవ్విపోవడానికి బాగుంటుందంటూ ప్రతిపక్ష నాయకులు వెక్కిరిస్తున్నారు.
పూర్తికాని యూజీడీ పనులు…
సిద్దిపేట పట్టణంలో 43 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో అండర్ డ్రైనేజీ పనుల కోసం రూ.278.48 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం దాదాపు అన్ని వార్డుల్లో యూజీడీ పనులు పూర్తయ్యాయి. సిద్దిపేట యూజీడీ పనులను మూడు విభాగాలుగా విభజించారు. సీ క్యాచ్మెంట్ అనగా చింతల్ చెరువుకు అనుసంధానం చేశారు. దీని కింద సుమారు పదివేల యూజీడీ కనెక్షన్లు ఉన్నాయి. సీ క్యాచ్ మెంట్ పూర్తికావడంతో దీన్ని రన్ చేస్తున్నారు. ఎన్ క్యాచ్ మెంట్ అనగా నర్సాపూర్ చెరువుకు అనుసంధానం చేశారు. దీని కింద 14 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇవి దాదాపు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఐసోలేట్ ప్యాకేట్స్ కింద రంగంధాంపల్లి, ఇమాంబాద్ , గాడిచర్లపల్లి, నర్సాపూర్ , ఇతర ప్రాంతాల్లో పనులు కావాల్సి ఉంది. ఈ నిర్మాణాలు పూర్తయితే పూర్తిగా సిద్దిపేటలో యూజీడి పనులు పూర్తయినట్టేనని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సోమవారం నాటికి 60 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు.
పొంగి పొర్లుతున్న మ్యాన్ హోల్స్…
సిద్దిపేట పట్టణంలో ఇటీవల కురిసిన చిరు జల్లులకు రోడ్లన్ని జలమయమయ్యాయి. యూజీడి పనులు ప్రారంభించిన ప్రాంతాల్లోనూ పైపులో నీరు భారీగా చేరి మ్యాన్ హోల్స్ నుండి రోడ్లపైకి మురికి నీరు వస్తుంది. వానలు కురిసి రెండు, మూడు రోజులవుతున్నా.. ఇంకా మ్యాన్ హోల్స్ పొంగి పొర్లడంపై సిద్దిపేట పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటి వ్యవస్థను పారద్రోలుతామని చెప్పి … ఇలా రోడ్లపైకి వదిలేలా పనులు చేస్తారా? అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
నలుగురు నవ్విపోదురు గాక..
సిద్దిపేట అన్నింటా అదర్శం …. సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ప్రాంత వాసులు కావడంతో పక్క మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు నిజంగానే సిద్దిపేట బాగానే అభివృద్ధి చెంది ఉంటుందని విజిట్ చేస్తుంటారు. మున్సిపాలిటీ నుండి వచ్చిన వారికి చూపించేవి కొన్నే.. సిద్దిపేట కోమటి చెరువు, దాని పక్కనే స్మృతి వనం, వైకుంఠదామం, సిద్దిపేట శివారు నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మాత్రమే. ఇవి తప్ప మరేవి చూపించరు. దీన్ని చూసిన ఇతర మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వావ్ నిజంగానే సిద్దిపేట చాలా అభివృద్ధి చెందిందని అనుకుంటారు. కానీ సిద్దిపేట వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే వానాకాలంలో పర్యటించాలి. అప్పుడు సిద్దిపేట ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుస్తుందని పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఈ సమయంలో వస్తే మాత్రం సిద్దిపేట అభివృద్ధిని చూసి నవ్విపోదురని పలువురు ప్రతిపక్ష నాయకులు సిద్దిపేట అభివృద్ధి, మంత్రి హరీశ్ రావుపై కామెంట్లు చేస్తున్నారు.
వెక్కిరిస్తున్న ప్రతిపక్ష నాయకులు…
సిద్దిపేటలో ఏ పని మొదలు పెట్టినా ఆరంభం గొప్పగా ఉంటుందే తప్పా తెల్లారి నుండి మాములే అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు నాలుగు సంవత్సరాల నుండి యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి కాలేదు. దీనిపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో యూజీడీ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, పలు కాలనీల్లోకి మురుగు నీరు వచ్చి చేరుతుందని, రోడ్లన్ని ధ్వంసం కావడం వల్ల వాహనాలు పాడైపోతున్నాయని విమర్శిస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన చిరు జల్లులకు యూజీడీ మ్యాన్ హోల్స్ నిండి రోడ్లపైకి రావడంతో ఇదిగో సిద్దిపేట అభివృద్ధి ఇదే అంటూ ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి యూజీడీ వ్యవస్థను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మురుగునీటి వ్యవస్థకు మంగళం పాడాలని పట్టణ ప్రజలు, ప్రతిపక్షాలు నాయకులు కోరుతున్నారు.
మాటలకే పరిమితం సిద్దిపేట అభివృద్ధి- దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు
‘సిద్దిపేట అభివృద్ధి కేవలం మాటలు, కాగితాల్లోనే కన్పిస్తుంది తప్ప వాస్తవంగా ఎక్కడా కన్పించదు. మంత్రి చెబుతున్న అభివృద్ధికి, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండదు. పలు విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న సిద్దిపేటలో చిన్న చిరు జల్లులకే యూజీడీ పైపులు నిండి రోడ్లపైకి మురికి నీరు వస్తుందా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో సిద్దిపేట అభివృద్ధి చెందిందని చెప్పడం కాదు … మంత్రి హరీశ్ రావు ఒక్కసారి కాలనీల్లోకి వచ్చి యూజీడీ జరిగిన తీరు, మ్యాన్ హోల్స్ నిండి రోడ్లపైకి వచ్చిన తీరు గమనించాలి. అప్పుడు మీరు చేస్తున్న సిద్దిపేట అభివృద్ది ఏంటో తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల మాటలు విని సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నా’ అని దరిపల్లి చంద్రం అన్నారు.