ఆర్టీఐని అడ్డదారులకు వాడుతున్న నేతలు అందుకేనా ?

by Shyam |   ( Updated:2021-10-07 23:27:25.0  )
ఆర్టీఐని అడ్డదారులకు వాడుతున్న నేతలు అందుకేనా ?
X

సమాచార హక్కు చట్టాన్ని కొంతమంది రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్తులు, నిర్మాణంలో ఉన్న భవనాల పర్మిషన్‌పై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి, యజమానులను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇవ్వని వారిపై కోర్టుల్లో కేసులు వేసి వేధింపులకు గురి చేస్తున్నారు. పట్టించుకోని వారిపై జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా పలు పార్టీల నాయకులే కాకుండా కార్పొరేటర్లు కూడా ఇలాంటి అక్రమ సంపాదనకు తెరలేపుతున్నారు. గోషామహల్ నియోజకర్గంలోని ఓ డివిజన్ కార్పొరేటర్ తీరు వివాదాలకు దారితీస్తున్నది. నూతన భవనాలను టార్గెట్ చేస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో కొంత మంది కార్పొరేటర్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత డివిజన్ లో మాకు ఎదురులేదనే తీరులో వారి ధోరణి ఉందని ప్రజలు వాపోతున్నారు. గోషామహల్ నియోజకర్గంలో ఆరు డివిజన్లు ఉండగా ఐదు డివిజన్లలో బీజేపీ, ఒక్క డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించాయి. వీరిలో బీజేపీ నుంచి మొదటి సారిగా విజయం సాధించిన ఓ కార్పొరేటర్ తీరు వివాదాలకు దారి తీస్తోంది. సదరు కార్పొరేటర్ డివిజన్‌లో నూతన భవనాలను నిర్మిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. తన అనుచరులను పంపి తమకు ఏం కావాలో భవన యజమానికి చెప్పిస్తున్నారు. ఇవ్వని వారిపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసి తమ వద్దకు వచ్చేలా చేసుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అడిగినంత ఇచ్చుకుని రాజీ పడుతున్నారు. ఇదంతా ఒక కోణం కాగా కార్పొరేటర్‌గా గెలవక ముందు నిర్మించిన భవనాలను కూడా వారు వదలడం లేదు. వారి నజర్ పడిన భవనాలపై ఆర్టీఐ కింద సమాచారం సేకరిస్తున్నారు. ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది? ఎన్ని అంతస్తులు నిర్మించారు? అనేది తెలుసుకుని భవన యజమానులను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇవ్వని వారిపై కోర్టుల్లో కేసులు వేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయంలో భవన నిర్మాణ దారులు కూడా తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండి పోతున్నారు. కార్పొరేటర్‌తో పెట్టుకుంటే తమ నిర్మాణాన్ని కూల్చివేయిస్తాడనే భయంతో ఎవరికీ చెప్పుకోవడం లేదు.

అధికార పార్టీ పేరు చెప్పి..

గ్రేటర్ పరిధిలోని కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు, కొంతమంది అధికార పార్టీ నాయకులు నూతన భవన నిర్మాణదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవ్వని వారిపై అనుమతికి మించి అంతస్తులు నిర్మిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో అధికారులు నిర్మాణదారులను పిలిపించి ఫిర్యాదుదారులతో సెటిల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా వసూలైన మొత్తం నుంచి అధికారులు, నాయకులు వాటాలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి.

శ్లాబుకో రేటు..

జీహెచ్ఎంసీ పాలకమండలి ఈ యేడాది ఫిబ్రవరి 11న కొలువుదీరింది. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు నెలలు గడువక ముందే వసూళ్ల పర్వానికి తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ స్థలం విస్తీర్ణం ఆధారంగా శ్లాబ్‌కో రేటు నిర్ణయిస్తున్నారు. రూ.50 వేలు మొదలు రూ.20 లక్షల వరకు, కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిసింది. కొందరు కార్పొరేటర్లు చిరు వ్యాపారులను సైతం వదలడం లేదు. టిఫిన్‌ బండ్లు, బజ్జీలు, జిలేబీ, గప్‌చుప్‌లు వంటివి అమ్ముకునే వీధి వ్యాపారుల నుంచి అనుచరులతో నెలసరి మామూళ్లు వసూలు చేయిస్తున్నారు. అయితే వీటిని తమకు కాదని, ఆలయాల అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు చెప్తుండడం గమనార్హం.

Advertisement

Next Story