IPL 2023: ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా.. హోం గ్రౌండ్‌లో రాజస్థాన్‌తో హైదరాబాద్ ఢీ

by Satheesh |   ( Updated:2023-04-01 18:45:26.0  )
IPL 2023: ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా.. హోం గ్రౌండ్‌లో రాజస్థాన్‌తో హైదరాబాద్ ఢీ
X

హైదరాబాద్ : ఐపీఎల్-16కు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం.. ఇప్పుడు ఐపీఎల్ మెరుపులకు ఆతిథ్యమివ్వనుంది. 2019లో ఇక్కడ చివరి ఐపీఎల్ మ్యాచ్ జరగగా.. కరోనా కారణంగా 2020, 2021 ఎడిషన్లలో విదేశాల్లోనే లీగ్ నిర్వహించారు. గతేడాది భారత్‌లోనే జరిగినప్పటికీ కేవలం నాలుగు వేదికలనే ఎంపిక చేయగా.. హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత ధనాధన్ లీగ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది.

ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తుండటంతో ఎంపిక చేసిన 12 వేదికల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2019 తర్వాత హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడనుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు ఆడనుంది. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడటంతోపాటు లీగ్‌ను ఆరంభించనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఇప్పటికే టికెట్లు అన్ని సేల్ అయినట్టు తెలుస్తోంది.

సన్‌రైజర్స్ మెరిసేనా?

2016‌లో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా గత రెండు సీజన్లలో దారుణంగా నిరాశపర్చి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ నాయకత్వంలో ఈ సారి ఎలాగైనా టైటిల్ పట్టేయాలనే పంతంతోనే హైదరాబాద్ బరిలోకి దిగుతున్నది. అందులో భాగంగా సొంతగడ్డపై నేడు రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తోనే బోణీ కొట్టాలనుకుంటున్నది. కెప్టెన్ మార్క్‌రమ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడంతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టును నడిపించనున్నాడు. హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్‌లతో బౌలింగ్ దళంగా పటిష్టంగా ఉంది. ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌తో బ్యాటింగ్ లైనప్ కూడా పేపర్‌పై బలంగానే కనిపిస్తున్నది. మరోవైపు, రాజస్థాన్ జట్టు సైతం బలంగానే ఉన్నది. ముఖ్యంగా కెప్టెన్ సంజూ శాంసన్, జో రూట్, బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైశ్వాల్, హెట్‌మేయర్‌తోపాటు ఆల్‌రౌండర్లు హోల్డర్, రియాన్ పరాగ్‌‌తో బ్యాటింగ్ లైనప్ పవర్‌ఫుల్‌గా ఉన్నది. అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దిప్ సేన్, యుజువేంద్ర చాహల్, నవ్‌దీప్ సైనీ నాణ్యమైన బౌలర్లను రాజస్థాన్ కలిగి ఉన్నది.

మరో మ్యాచ్‌లో బెంగళూరు, ముంబై ఢీ

నేడు తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లో భాగంగా జరిగే రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫిన్ అలెన్‌, దినేశ్ కార్తీక్‌లతోపాటు షాబాజ్ అహ్మద్, మైఖేల్ బ్రేస్‌వెల్‌, వానిందు హసరంగ ఆల్‌రౌండర్లతో పటిష్టమైన బ్యాటింగ్ దళం కలిగి ఉన్నది. సిరాజ్, హర్షల్ పటేల్‌, రీస్ టోప్లే వంటి కీలక పేసర్లతో బలంగా కనిపిస్తున్నది. అలాగే, ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌తోపాటు వేలంలో కామరూన్ గ్రీన్‌ను తీసుకుని అదనపు బలాన్ని పెంచుకుంది. బుమ్రా దూరమవడం ఆ జట్టుకు భారీ లోటే అయినప్పటికీ.. జోఫ్రా ఆర్చర్ తిరిగిరావడం సానుకూలంశం. రాత్రి 7:30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.

Advertisement

Next Story