ధనాధన్.. దంచుడే

by Shiva |
ధనాధన్.. దంచుడే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్ ముచ్చట్లు ఇంకా తాజాగానే ఉన్నాయి. విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ నిన్న గాక మొన్ననే ట్రోఫీ ఎత్తినట్లు అనిపిస్తున్నది. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లాండ్ సిరీసేగా జరిగింది. కానీ అప్పుడే ఐపీఎల్ వచ్చేసింది. కరోనా కారణంగా గత ఏడాది 7 నెలలు ఆలస్యంగా జరిగిన ఐపీఎల్.. నవంబర్ నెలలో ముగిసింది. కానీ 4 నెలల్లోనే మరో సీజన్‌కు తెరలేచింది. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నా.. ధనాధన్ సందడికి మాత్రం ఆటంకం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ మరోసారి ప్రేక్షకులకు సందడి చేయడానికి వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు దేశంలోని ఐదు వేదికల్లో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా బయోబబుల్ వాతావరణంలో లీగ్ నిర్వహిస్తుండటంతో.. ఈ సారి మ్యాచ్‌లను వివిధ దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ మ్యాచ్‌లు చెన్నై, ముంబయి వేదికలుగా జరుగనున్నాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ వంటి జట్లు ట్రైనింగ్ క్యాంపులు కూడా షురూ చేశాయి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు ఆటగాళ్లు ఆయా జట్లకు దూరంగా ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్..

గత ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి దశలో మ్యాచ్‌లు చెన్నై వేదికగా ఆడనున్నది. గత ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్ గాయపడి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కాగా, ఈ సీజన్‌లో తాను ఐపీఎల్ ఆడలేనంటూ ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. సుదీర్ఘమైన బయోబబుల్‌లో గడపలేనని.. అందుకే దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు. గత ఏడాది అతడి స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఇక మార్ష్ బదులు ఇంగ్లాండ్‌కు చెందిన బ్యాట్స్‌మాన్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్ వెల్లడించింది. కానీ అతడి పేరు మాత్రం వెల్లడించలేదు.

ముంబయి ఇండియన్స్..

ముంబయి ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్, దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ఈ సీజన్‌లో తొలి 4 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ జట్టుతో అతడు ఆలస్యంగా జాయిన్ అవుతాడని తెలుస్తున్నది. కాగా, డికాక్ గైర్హాజరీ నేపథ్యంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్సీబీ ఈ సారి ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తున్నది. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన యాజమాన్యం.. ఇటీవల జరిగిన వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. అయితే రిటైన్ చేసుకున్న అడమ్ జంపా మాత్రం సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్ స్పష్టం చేశారు. అడమ్ జంపా పెళ్లి చేసుకోనుండటంతో కొన్ని రోజులు జట్టుకు దూరమవనున్నట్లు ఆయన తెలిపారు. సీజన్ మధ్యలో అతడు జట్టుతో కలిసే అవకాశం ఉన్నది.

రాజస్థాన్ రాయల్స్..

రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇండియా పర్యటనకు ముందు గాయపడిన ఆర్చర్‌ వన్డే సిరీస్ ఆడకుండానే లండన్ తిరిగి వెళ్లాడు. అతడి చేతికి గాజు పెంకు వల్ల గాయం అయినట్లు గుర్తించి సర్జరీ చేశారు. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం అవసరం. దీంతో అతడి సేవలు రాయల్స్ జట్టుకు ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండవని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. పూర్తిగా కోలుకుంటే రెండో అర్దభాగంలో అందుబాటులో ఉండవచ్చు. గత సీజన్‌లో రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు జోఫ్రా ఆర్చర్ తీశాడు.

చెన్నై సూపర్ కింగ్స్..

చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది పేలవ ప్రదర్శన అనంతరం తిరగి 14వ సీజన్‌ను ఆడుతున్నది. అందరి కంటే ముందుగానే ట్రైనింగ్ క్యాంపు మొదలు పెట్టడం, గత సీజన్‌లో దూరమైన సురేష్ రైనా జట్టులో చేరడం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ లుంగి ఎన్‌గిడి మొదటి 4 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇక గాయం నుంచి కోలుకున్న టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టు తరపున ఎప్పుడు ఆడుతాడనే దానిపై స్పష్టత లేదు. అతడు ప్రస్తుతం జట్టుతోనే ఉన్నా.. మైదానంలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్..

గత సీజన్ ఫైనలిస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోవడం పెద్ద నష్టం. బ్యాట్స్‌మాన్, కెప్టెన్‌గా గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని భావించవచ్చు. ఇక 13వ సీజన్‌లో అత్యధికంగా 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న కసోగి రబాడ తాజా సీజన్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కసోగి రబాడ, ఎన్రిచ్ నోర్జే తొలి 4 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇక తొలి విడత మ్యాచ్‌లకు బీసీసీఐ, ఫ్రాంచైజీలు చెన్నై, ముంబయిలో బయోబబుల్స్ ఏర్పాటు చేశాయి. బయోబబుల్‌లో ప్రవేశించడానికి ముందు క్వారంటైన్ సెంటర్లలో ఆటగాళ్లను ఉంచుతారు. అనంతరం అందరూ బయోబబుల్‌లోకి ప్రవేశిస్తారు. ఈ సారి కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకను బీసీసీఐ రద్దు చేసింది. ఐసీసీ కరోనా తాత్కాలిక నిబంధనలతో పాటు పలు కొత్త నిబంధనలను బీసీసీఐ అమలు చేయనున్నది.

Advertisement

Next Story

Most Viewed