మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం.. ఇదీ భారత్ తీరు

by vinod kumar |   ( Updated:2021-03-30 03:23:58.0  )
myanmar
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగి పౌర ప్రభుత్వాన్ని కూలదోసింది. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసిన జుంటా ఆర్మీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సైనికులు ప్రజలపై నరమేధం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 400 మందికిపైగా పౌరులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నెల 27న ఆర్మ్‌డ్ ఫోర్స్ డే పేరిట జుంటా ప్రభుత్వం మిలిటరీ పరేడ్ నిర్వహించింది. ఈ రోజు ఆందోళనకారులపై కాల్పులు జరిపి సుమారు 100 మందిని చంపేసింది. ఈ మిలిటరీ పరేడ్‌కు భారత్ హాజరైంది. భారత్‌తోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లూ తమ ప్రతినిధులను పంపాయి. రష్యానైతే ఏకంగా మంత్రినే పంపింది. పరేడ్‌లో హాజరవడంపై కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ ఇరుదేశాలూ దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నాయని, అందుకే కమిట్‌మెంట్లూ కొనసాగుతున్నాయని వివరించారు. మరోవైపు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు మయన్మార్ మిలిటరీ చర్యలపై మండిపడ్డాయి. అరుదుగా కలిసి సంయుక్త ప్రకటన చేశాయి.

సరిహద్దు రాష్ట్రం మిజోరంకు వలసలు..

ఆర్మీ ఆదేశాలను పాటించి సొంత పౌరులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది ఫైర్ బ్రిగేడ్లు, పోలీసులు శరణార్థులుగా భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో తలదాచుకోవడానికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా మిజోరం సరిహద్దు గ్రామాల్లో ఎక్కువ మంది వలసవచ్చారు. మయన్మార్‌తో ఈ రాష్ట్రం నేరుగా 510 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. కాగా, మయన్మార్ నుంచి శరణార్థులపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. మానవతా విలువల ఆధారంగా తప్పనిసరి అయితేనే వారికి అనుమతించాలని సరిహద్దు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సూచనలు చేసింది.

ఆహారం, ఆవాసం వద్దు

మయన్మార్ శరణార్థులకు ఆహారాన్ని, ఆవాసాన్ని ఇవ్వవద్దని స్థానిక అధికారులకు, సామాజిక సంస్థలకు మణిపూర్ ప్రభుత్వం ఆదేశాలు పంపింది. తీవ్ర గాయాలు ఉంటే మానవతా దృక్పథంతో వారికి చికిత్స అందించవచ్చునని పేర్కొంది. ఎవరైతే శరణు కోరుతున్నారో వారిని మర్యాదగా తిరస్కరించాలని తెలిపింది.

Advertisement

Next Story