ఆల్మట్టి ఎత్తు పెంచితే అంతే..!

by Shyam |
ఆల్మట్టి ఎత్తు పెంచితే అంతే..!
X

దిశప్రతినిధి, మహబూబ్‌నగర్: అసలే అనుకున్న స్థాయిలో వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్నారు. వరద నీటిపై ఆధారపడి కృష్ణానది పరివాహక ప్రాంతాల రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ముందుకు కదులుతుండటంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది రైతుల పరిస్థితి. ఒక వేళ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే దిగువన ఉన్న ప్రాజెక్టుల నీరు అందటం కష్టమే. ఆ ప్రాజెక్టుల కింద సాగయ్యే పొలాల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.

తెలంగాణలో కృష్ణానది పరివాహాక ప్రాంతాల రైతాంగానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. అసలే వర్షాలు లేక ఇక్కడి రైతులు ఇబ్బంది పడుతూ ఎగువనుంచి వచ్చే వరద నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి సాగునీటిని తరలించేందుకు కుట్రలు చేస్తున్న తరుణంలో తాజాగా కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారమే అని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నాటక, తెలంగాణ సరిహద్దులోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తు అయిదు మీటర్ల ఎత్తు పెంచాలని కర్నాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి సిఫారసు పంపింది. ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాకముందే ముంపునకు గురి కానున్న సుమారు 20 గ్రామాల వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు సైతం చేపడుతోంది. ప్రస్తుతం ఆల్మటి డ్యాం 519.26 ఫీట్లు ఉండగా దీనిని 524.26 ఫీట్ల ఎత్తుకు పెంచాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.61వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనాలను సైతం సిద్దం చేసి, ఎత్తు పెంపునకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని కర్నాటక ప్రభుత్వం కోరింది. పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తే రెండు తెలుగు రాష్ర్టాలకు నీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూడా బీజేపీ అధికారంలో ఉన్నందున తమకు అనుమతి లభిస్తుందని కర్నాటక ప్రభుత్వం ధీమాతో ఉన్నట్టు సమాచారం.

తాగునీటికీ ఇబ్బందే..

ప్రస్తుతం ఆల్మటి ప్రాజెక్టు మరో 5 ఫీట్ల ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో అదనంగా మరో 130 టీఎంసీల నీరు ఆల్మట్టిలో నిల్వ ఉంటే అవకాశాలు వున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో కృష్ణాబేసిన్‌పై ఆధారపడి ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల రైతాంగానికి సరైన సమయానికి సాగునీరు అందక, తాగునీటికి సైతం కష్టాలు కూడా చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. అదే సమయంలో ప్రతి ఏడాదీ కర్నాటకలోని ప్రాజెక్టులు నిండగానే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కృష్ణా నీటిని తెలుగు రాష్ట్రాలకు విడుదల చేస్తారు. అయినా కావాల్సిన మేర నీరు రాకపోవడంతో ఐదేండ్లకోసారి గానీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక కృష్ణా జలాలు అక్టోబరు, నవంబర్ వరకు సైతం తెలుగు రాష్ట్రాలను చేరే అవకాశాలు ఉండవు. ఇదే జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద వ్యవసాయం చేసుకునే రైతాంగానికి సమయానికి నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది.త ఆల్మటి ఎత్తును పెంచి 130 టీఎంసీల కృష్ణా జలాలను కర్నాటక అదనంగా ఉపయోగించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాల మాటే ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు గడ్డుకాలమే..

ఆల్మట్టి ఎత్తు పెంచింతే తెలంగాణలో కృష్ణానీటి‌పై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు గడ్డుకాలం తప్పదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని చివరి దశలో వున్న నెట్టెంపాడు, భీమా, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వంటి వాటికి నీరు అందడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పెద్ద ఎత్తున వరదలు వస్తే తప్ప ఈ ప్రాజెక్టులకు కావాల్సిన మేర నీరు అందే పరిస్థితి ఉండదు. గతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆల్మటి ఎత్తును పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేసి బ్రీజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు సైతం పొందింది. 2010లో అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టేను తీసుకురావడంతో కర్నాటక ఎత్తుగడలకు బ్రేక్ పడింది. అనంతరం 2014 జూలైలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో కొంతకాలం స్థబ్దంగా ఉన్న కర్నాటక ప్రభుత్వం మరోమారు కేంద్రం ద్వారా అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది ముమ్మాటికి కోర్టు దిక్కారం కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు న్యాయపోరాటం తప్పదని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed