ప్రభుత్వాసుపత్రిల్లో వేతనాలు పెంచండి.. లేకుంటే సమ్మెనే..

by Shyam |
AITUC LEADERS
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి వెంటనే జీతాలను పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహా ల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు పెంచాలని గత ఐదు రోజులుగా నిరసనలు, ధర్నాలు చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాల కార్మికులకు జీతాలు పెంచిన ప్రభుత్వం ఆస్పత్రులలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు మాత్రం జీతాలు పెంచకపోవటం దారుణమన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులో సైతం కార్మికులు పేషెంట్లకు సేవలు అందిస్తున్నారని, వీరికి కనీస వేతనం రూ.19 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed