- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ వెంచర్లకు ‘అధికారులే’ రక్షణైతే.. కురిసేది ‘కాసుల’ వర్షమే..!
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం హేమ చంద్రాపురం పంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకున్నా వెంచర్లు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. వ్యవసాయ భూములను నయానో భయానో రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కొందరు అక్రమార్కులు.. వాటిని వెంచర్లుగా మార్చి భూమి ధరను ఒక్కసారిగా నాలుగు రెట్లు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అమ్ముకుంటున్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ వెలుస్తున్న అక్రమ వెంచర్ల పై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
తాజాగా హేమచంద్ర పురంలో అనుమతులు లేని ఆరు ఎకరాల వెంచర్ పై స్థానిక ఎంపీడీఓ హెచ్చరిక బోర్డులను సైతం అమర్చారు. అధికారులు వెళ్లిపోయిన మరుక్షణమే హెచ్చరిక బోర్డులను తొలగించి అక్రమార్కులు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై ‘దిశ’ నేరుగా వివరణ కోరే ప్రయత్నం చేయగా వెంచర్ యజమాని ఈ విధంగా స్పందించారు. ఎవరికి సమర్పించాల్సినవి వారికి సమర్పించాం.. అధికారులు వచ్చి పాపం ఏం చేస్తారు. మీ రాతలు మా తలరాతలు మార్చలేవు అంటూ వెటకారం చేశారు. ఇదిలా ఉండగా మరో ప్రబుద్ధుడు ఈ వెంచర్కు ఎదురుగా ఉన్న మరో ఐదు ఎకరాలను క్లీన్ చేసి వెంచర్‌కు రూపకల్పన చేస్తున్నారు. 5 ఎకరాలను ఆనుకుని ఉన్న సింగరేణి హద్దు గోడను కూల్చి ఆక్రమణ చేసేందుకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం.
ఈ వ్యక్తికి గిరిజన చట్టాలంటే భయం లేదు. అక్రమ వెంచర్లు వేసి వాటిని వేరే వ్యక్తులకు అంటగట్టి డబ్బులు వెనకేసుకుంటున్నాడు. హేమచంద్రాపురంలో ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం మాకు ఏం సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు స్పందించి నానా హంగామా చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు పెడుతున్నాం, నోటీసులు ఇస్తున్నాం, కేసులు నమోదు చేస్తాం అంటూ తూతూ మంత్రంగానే వీరి చర్యలున్నాయి. ఈ అక్రమ వెంచర్లపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి కఠినమైన చర్యలు అమలు చేస్తే గానీ వీటికి అడ్డుకట్ట పడే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.