ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం : గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
meghalaya governor satyapal malik
X

దిశ, వెబ్‌డెస్క్: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన చట్టాలపై కేంద్రం ఇదే మొండి పట్టుదలతో ఉండి రైతులకు న్యాయం చేయకుంటే భవిష్యత్తులో బీజేపీకి తీరలేని నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో ఆ పార్టీకి పూడ్చుకోలేని నష్టం చేకూరుతుందని హెచ్చరించారు. తాను రైతులకు మద్దతునిస్తానని, పదవిలో ఉన్నా లేకపోయినా తన వైఖరిలో మార్పు లేదని మాలిక్ చెప్పారు. ఇటీవలే ఆయన రైతులకు మద్దతు ప్రకటిస్తూ.. రైతుల డిమాండ్లు న్యాయమైనవే అని, కానీ కేంద్రం వారి మాట వినిపించుకోవడం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా సత్యపాల్ మాలిక్ ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో బీజేపీ ఓడిపోతుంది’ అని అన్నారు. రైతుల మరణాలపై మాట్లాడుతూ..‘ఒక కుక్క చనిపోయినా దానికి దహన సంస్కారాలు చేసి సంతాపం ప్రకటిస్తారు. కానీ రైతు చట్టాలకు నిరసనగా ఇప్పటికే సుమారు 250 మంది రైతులు ప్రాణాలు విడిచారు. కానీ దీని మీద ఎవరూ సంతాపం వ్యక్తం చేయకపోవడం బాధాకరం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పంతో ఉద్యమిస్తున్న రైతులకు అన్యాయం చేయొద్దని, వారితో త్వరలో చర్చలు ప్రారంభించి తగిన పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇక ఇటీవలే తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగగా వాటిపై స్పందిస్తూ… తన వ్యాఖ్యలు పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం చేకూర్చినట్టు అనిపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సత్యపాల్ మాలిక్ తెలిపారు. తాను గవర్నర్ కాకపోయినా ఇదే విధంగా స్పందిస్తానని స్పష్టం చేశారు. రైతుల పరిస్థితి చూసి బాధతోనే తాను ఇలా మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు.

Advertisement

Next Story