చెమటలు పట్టిస్తున్న ఏసీ

by Shyam |
చెమటలు పట్టిస్తున్న ఏసీ
X

దిశ, న్యూస్‌బ్యూరో
వేసవి కాలం మొదలవుతోంది. నగరంలో ప్రముఖ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ( ఎయిర్ కండీషన్డ్‌లు) కామన్. నగరంలో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు, స్టేషన్లలో చల్లటి అనుభూతితో ప్రయాణించడం కూడా ఓ పాజిటివ్ అంశం. ఇదే మెట్రోను నగరవాసులకు తక్కువకాలంలోనే చేరువయ్యేలా చేసిందనడంలో సందేహం లేదు. ఆర్టీసీ సైతం నగరవాసుల కోసం పుష్పక్, ఏసీ బస్సులను నడుపుతోంది. ఎండల్లో సొంత వాహనాల్లో చెమటలు కక్కుతూ ప్రయాణించే బదులు సుఖంగా ఏసీ బస్సులు, మెట్రోలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సరిగా ఇదే ఇప్పుడు ప్రజలకు చెమటలు పట్టిస్తోంది. కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడ చూసినా తమకు కూడా వైరస్ ఎక్కడ అంటుకుంటుందోననే భయం కలుగుతోంది అందరికీ. షేక్ హ్యాండ్ బదులు కేవలం నమస్కారం చెప్పేస్తున్నారు. పొరపాటున తుమ్మినా, దగ్గినా పక్కవాళ్లు ముఖం పట్టుకుని తిట్టేస్తున్నారు. సాధారణ జలుబు, దగ్గు ఉన్నా కూడా ఆందోళనకు గురవుతున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లేవారు, మెట్రోల్లో ప్రయాణించేవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చల్లటి ప్రాంతాల్లో వైరస్ మనుగడ ఉండటం, ఏసీల్లో అయితే వైరస్ తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఏసీ చల్లగా ఉంటుందని మెట్రో, బస్సుల్లో ప్రయాణిద్దామనుకుంటే కరోనా భయం చెమటలు పట్టిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు తమ అవసరాల కోసం కొత్తవారు వస్తారు కాబట్టి చాలా ఆఫీసుల్లో ఉన్నతాధికారులు తమకు అవసరమైన మేరకు తప్ప ఏసీలను వాడటం లేదు.

మెట్రో ప్రయాణికులు తగ్గలేదు

కరోనా భయం నేపథ్యంలో మెట్రో ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల పెద్దగా ఏమీలేదని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లు, రైళ్లను సిబ్బందితో రోజూ హైజెనిక్ ఉండేలా శుభ్రం చేస్తున్నట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిత్యం సుమారు 4 లక్షల మంది నగరవాసులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినా లక్షణాలు వెంటనే కనబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది ఎటువంటి మాస్క్ లు, ప్రత్యేక డ్రెస్, రక్షణ చర్యలు లేకుండానే క్లీన్ చేస్తున్నారు. వారి ఆరోగ్యం విషయంలో కూడా మెట్రో అధికారులు తగిన జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరముంది. మెట్రో స్టేషన్లలో ప్రవేశించే ఏ వ్యక్తికైనా కరోనా వైరస్ సోకి ఉంటే దాని తీవ్రతను తగ్గించడం అంత సులభం కూడా కాదు. మెట్రో సిబ్బంది, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

tags : HMRL,metro,corona,Ac, cool, summer

Advertisement

Next Story