కౌశిక్ రెడ్డి జాక్‌పాట్ కొట్టేయడంలో ఆంతర్యం ఏంటి..?

by Sridhar Babu |   ( Updated:2021-08-04 06:21:11.0  )
trs-party, koushik reddy
X

దిశప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న, మొన్నటివరకు బీజేపీలో ఈటల మరియు సీనియర్ బీజేపీ నాయకులు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్‌లోనూ ఈ పరిస్థితులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడంతో హుజురాబాద్ టీఆర్ఎస్ వర్గాల్లో నైరాశ్యం నెలకొంది. నిన్నటివరకు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన కౌశిక్ రెడ్డికి ఎమ్యెల్సీ పదవిని ఇవ్వడం ఏంటన్న చర్చ సీనియర్ నాయకుల్లో జోరుగా సాగుతోంది.

ఉద్యమాలు చేశాడా..?

కౌశిక్ రెడ్డి స్వరాష్ట్ర కల సాకారం కోసం ఉద్యమాలు చేశాడా..? లేక పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేశాడా..? ఇలా పార్టీలో చేరి అలా జాక్‌పాట్ కొట్టేయడం ఏంటో తమకు అర్థం కాకుండా పోయిందని హుజురాబాద్ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కావున బాహాటంగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం తమకు ఏ మాత్రం రుచించడం లేదని గుసగుసలాడుకుంటున్నారు అక్కడి గులాబీ నేతలు.

కేసీఆర్ ఎమ్మెల్సీనే..

కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీగానే పరిగణించాలి తప్ప హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకుల ప్రతినిధిగా భావించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కొన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ పర్యటించినా అధికారికంగా సన్మానాలు, సత్కారాలు, స్వాగత కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరూ సాహసించకూడదని భావిస్తున్నారు. వీరి నిర్ణయంతో కౌశిక్ రెడ్డి హుజురాబాద్‌లో టూర్ చేపట్టినా ఆయనతో కలిసి టీఆర్ఎస్ కేడర్ కలిసి పనిచేసే అవకాశం కన్పించడం లేదని స్పష్టం అవుతోంది. దీంతో ఇప్పటివరకు బీజేపీలో ఉన్న వేర్వేరు వర్గాలు ఇప్పుడు టీఆర్ఎస్‌ను కూడా తాకాయని తేటతెల్లం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed